డా.అజిత్ కుమార్, MD.DM
అంతర్లీనంగా ఉన్న కాలేయ వ్యాధికి చిహ్నం కామెర్లు. ముఖము, కళ్ళలోని తెల్లభాగముతో సహా చర్మము మరియు మూత్రము పసుపు రంగులోకి మారతాయి. కాలేయం సరిగా పనిచేయకపోవటం వలన చిన్నపేగులలోని బైల్ పిగ్మంట్ విసర్జనం జరగక అవి కాలేయంలో ప్రోగుపడి రక్తంలో కలిసిపోయి చర్మానికి మరియు మూత్రానికి పసుపు రంగునిస్తాయి.
ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్ తగ్గినపుడు ఏర్పడే ఒక ఉప-ఉత్త్పత్తి అయిన బిలిరుబిన్ పెరగటం వలన ఇది సంభవిస్తుంది. సాధారణంగా కాలేయంలో జరిగే ఎంజైమ్‌ల ప్రతిచర్య వలన బిలిరుబిన్ ఏర్పడుతుంది. తర్వాత అది పిత్తాశయం మరియు పేగుల్లో ప్రవేశించి, ఆహారపదార్థాలలోని కొవ్వును జీర్ణం చేయానికి తొడ్పడి, మలం ద్వారా విసర్జించబడుతుంది. కొని, కొన్ని సందర్భాలలో బిలిరుబిన్ నిల్వ ఉండి పోయి, ప్రోగుపడి, కాలేయంలోని రక్తంలో కలిసి కామెర్లకు కారణం అవుతుంది.
కామెర్ల లక్షణాలు : కాలేయ ప్రాంతంలో ఉదరం కుడి పైభాగాన నిరంతర అవ్వక్తమైన నొప్పి, తీవ్రమైన నీరసం, జ్వరం తలనొప్పి, చర్మం దురద పుట్టుట, వాంతులు మలబద్ధకం, తలత్రిప్పుట, చర్మం, కళ్ళు, నాలుక మరియు మూత్రము పసుపు పచ్చరంగులోకి మారుట మరియు సాధారణంగా, బిలిరుబిన్ మలానికి గోధుమ రంగును కలుగజేస్తుంది. ఇది లేక పోవటం వలన కొన్నిసార్లు లేత రంగు మలం (చైనా మట్టి రంగుకూడా) ఏర్పడుతుంది
పిల్లలకు జన్మించిన మొదటి వారంలో కామెర్లు రావటం సాధారణం, ఎందుకంటే వారి కాలేయాలు సరిగా పనిచేయాటానికి కొంత వ్యవధి పడుతుంది కనుక. కాని పెద్దవారిలో అయితే మూడు రకాల కామెర్లు - హెమోలిక్ కామెర్లు, అబ్జ్స్రక్టివ్ కామెర్లు మరియు హెపో సెల్యులర్ కామెర్లు సంభవించవచ్చును.
కామెర్ల వ్యాధికి, గాల్‌స్టోన్స్ (బైల్‌డక్ట్ స్టోన్స్) మరియు వైరస్ (హెపటైటిస్ ఎ,బి,సి,డి మరియు ఇ) వల్ల కాలేయంలో మంట మరియు మందులు పడకపోవటం ప్రధాన కారణాలు కాగా, మురికి వాతావరణం, కలుషిత త్రాగునీరు, ఎక్కువ జనసమ్మర్థం వగైరాలు కూడా దారితీస్తాయి. కామెర్ల వ్యాధి నిరోధం అనేది ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధిని అరికట్టడం చాలా ముఖ్యం. ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు అత్యధికం. హెపటైటిస్ ఎ మరియి బి వైరస్‌లకు సమర్థవంతమై వాక్సిన్సు లభిస్తున్నప్పటికీ మిగతా వైరస్‌లకు లేవు.
జాగ్రత్తలు: కామెర్ల వ్యాధిని నిరోధించడానికి తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు అపరిశుభ్రంగా ఉన్న ఆహారం మరియు నీరు జోలికి పోవద్దు. టాయ్ లెట్ వాడిన తర్వాత లేదా దేహం నుంచి వెలువడే వాటిని ముట్టుకున్నపుడు చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవాలి.
టాయ్ లెట్ వాడిన తర్వాత దగ్గినా లేదా తుమ్మిన తర్వాత, ఆహారం తయారుకు ముందు మరియు తయారు చేస్తున్నప్ఫుడు, భోజనానికి ముందు మరియు తర్వాత, పెంపుడు జంతువుల్పి పట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, చేతికి అంటిన పదార్థాలు పోవునంతవరకు బాగా శుభ్రం చేసుకోవాలని పలు అధ్యయనాలు చెపుతున్నాయి. రోజుకి కనీసం ఐదుసార్లయినా అంటే మూడుసారు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి ముందు టాయ లెట్ వాడిన తర్వాత, స్నానం సమయంలోనూ చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కుంటే తేడా తెలుస్తుంది.
చేతుల్ని గబగబా కడుక్కోవాటానికి ముంచి తీసినా, బ్యూటీ సబ్బు వాడినా వ్యాధుల వ్యాప్తిని అరికట్టలేవు.
కామెర్లవ్యాధుల నుండి బయటపడేందుకు చిట్కాలు :
అపరిశుభ్రంగా ఉన్న ఆహారాన్ని, నీటిని దరిచేరనీయకండి. టాయ లెట్ వాడిన తర్వాత లేదా దేహం నుంచి వెలువదే వాటిని ముట్టుకున్నపుడు చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవాలి. లేదా హ్యాండ్ శానిటైజర్‌ను వాడండి. లక్షణాలు నిదానించే వరకు విశ్రాంతి తీసుకోండి. తక్కువ కొవ్వు మరియు ఎక్కువ మాంసకృత్తులున్న ఆహారాన్ని తీసుకోండి. కొన్ని వారాలపాటు రోజూ ఆహారంతో పాటు పళ్లరసం త్రాగండి.