కిడ్నీ వ్యాధి ఆరంభంలో ఎలాంటి లక్షణాలు కనబడవు. అందువల్ల దీని ముప్పు అధికంగా ఉండే మధుమేహం, హైబీపీ బాధితులు క్రమం తప్పకుండా మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉండి ఉంటే వారి కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరు పరీక్షించుకోవాలి.
కిడ్నీ జబ్బుగల వారిలో మూత్రం గాఢత (కాన్‌సెంట్రేషన్) తగ్గిపోతుంది. అందువల్ల రాత్రిపూట కూడా మూత్రం కోసం నిద్రనుంచి లేవాల్సి వస్తుంటే కిడ్నీ వ్యాధి ఉందేమోనని పరీక్షించుకోవడం ఉత్తమం. కిడ్నీ జబ్బు వ్యాధి ముదురుతున్న కొద్దీ అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్ పోవటం, కాళ్ళవాపు, ఆయాసం రావటం, ముఖం ఉబ్బరించటం, ఆకలి మందగించటం, మూత్రం తగ్గిపోవటం, రక్తహీనత, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనబడతాయి.
‘యురెమిక్ న్యూరోపతీ’ కారణంగా కాళ్ళు చేతుల్లో తిమ్మిరి కూడా రావొచ్చు. కిడ్నీ జబ్బు మరీ తీవ్రతరమైతే మూర్ఛ వచ్చి స్పృహ తప్పిపోవటమూ జరగొచ్చు. ఇలాంటి సమయంలో డయాలసిస్ చేయాల్సి వస్తుంది. జిఎఫ్‌ఆర్ 10 ఎం.ఎల్ కన్నా తగ్గితే డయాలసిస్ చేయాల్సిన అవసరముందని అర్ధం. లేదంటే కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది.
పరీక్షలు....
1.మూత్రంలో ప్రోటీన్ పరీక్ష : ఇది కిడ్నీ జబ్బు ఉందో లేదో తెలుసుకోడటానికి ఉపయోగపడుతుంది. మూత్రంలో అల్బుమిన్ రోజుకు 30 మి.గ్రా కన్నా తక్కువుండాలి. 30-300 మి.గ్రా మధ్యలో ఉంటే మైక్రో అల్బుమినూరియా అనీ, 300 మి.గ్రా కన్నా ఎక్కువైతే ప్రోటినూరియా అంటారు.
2.సీరం క్రియాటినైన్ పరీక్ష: ఇది ఎంత ఉండొచ్చన్నది వయసును బట్టి, లింగాన్ని బట్టి, శరీర నిర్మాణాన్ని బట్టి మారుతుంటుంది. మొత్తమ్మీద 1.2 నుంచి 1.4 లోపు ఉండాలి. దాటితే కిడ్నీ వ్యాధి ఉందని అనుమానించాలి. దీని ఆధారంగా జీఎఫ్‌ఆర్‌ను అంచనా వేసి, వడపోత ప్రక్రియ ఎలా ఉందో తెలుసుకుంటారు. సాధారణంగా మూత్రపిండాల్లో నిమిషానికి 100 ఎం.ఎల్ రక్తం శుద్ధి అవుతుంది. ఇది నిమిషానికి 80 ఎం.ఎల్ కన్నా తగ్గితే కిడ్నీ వ్యాధి ఆరంభమైనట్టే ఇలా మూడు నెలలపాటు జిఎఫ్‌ఆర్ క్రమంగా తగ్గుతూ వస్తుంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా భావిస్తారు.
3.ఆల్ట్రాసౌండ్ పరీక్ష: ఇందులో కిడ్నీ పరిమాణం ఎలా ఉంది. రాళ్ళు, నీటితిత్తులు (పాలీ సిస్టిక్ కిడ్నీ) వంటివి ఉన్నాయేమో తెలుస్తుంది. గ్లొమెరూర్ నెఫ్రైటిస్, అధిక రక్తపోటు గల వారిలో కిడ్నీ పరిమాణం తగ్గుతుంటుంది. పాలిసిస్టిక్ డీసీజ్‌లో, మూత్ర మార్గంలో రాళ్ళ వంటివి అడ్డుపడినప్పుడు కిడ్నీ సైజు పెరుగుతుంది. మధుమేహుల్లో ముందు కిడ్నీ ఆకారం పెరిగి. మామూలుగా అవుతుంది.
4.పీటీహెచ్ పరీక్ష: క్రానిక్ కిడ్నీ డిసీజ్ గల వారిలో పారాధైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) ఎక్కువతుంది. కాబట్టి దీన్ని కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కిడ్నీ జబ్బు ఉంటే సీరం క్యాల్షియం, సీరం ఫాస్ఫరస్, సీరం యూరిక్ యాసిడ్, ఆ్కలైన్ ఫాస్పేట్‌జ్ వంటి పరీక్షలు అవసరం.
చికిత్స ...మధుమేహులైతే గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు 120/80 ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే స్టాటిన్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అప్యూరినాల్ వంటి మందులు ఇస్తారు. క్యాల్షియం తక్కువుంటే క్యాల్షియం మాత్రలు ఇస్తారు. వీటిని పరగడుపున వేసుకోవాల్సి ఉంటుంది. అయితే క్యాల్షియం బాగానే ఉండి ఫాస్పరస్ మాత్రమే ఎక్కువుంటే వీటిని భోజనంతోపాటు గానీ, భోజనం చేశాకగాని వేసుకోవాల్సి ఉంటుంది. క్యాల్షియం మాత్రల మూలంగా రక్తంలో క్యాల్షియం మోతాదు పెరుగుతుందనే అనుమానముంటే సెవలామెర్ వంటి మాత్రలను ఇస్తారు. వీటిని భోజనంతోపాటు వేసుకోవాల్సి ఉంటుంది. క్యాల్షియం, ఫాస్పరస్ స్ధాయిు అదుపులోకి వస్తాయి.
పీటీహెచ్ స్ధాయిూ తగ్గడానికి అవకాశముంటుంది. పీటీహెచ్ మరీ ఎక్కువగా ఉంటే ‘సినాక్యాల్సెట్’ మందులు ఇస్తారు. దీంతో రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకోవటం తగ్గుతుంది. ఎముకలు బహీనపడకుండా చూస్తుంది. కిడ్నీ జబ్బు బాధితుల్లో ఇనుము లోపమూ కనబడుతుంది. దీన్ని నివారించడానికి ఇనుము మాత్రలు ఇవ్వాల్సి రావొచ్చు. అవసరమైతే ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు.