header

Kidneys….కిడ్నీలు

Kidneys….కిడ్నీలు

కడ్నీలు పక్కటెముకల కింద, వెనుకవైపున ఉంటాయి. చూడ్డానికి పిడికెడంత వున్నా ఇవి చేసే పని ఎక్కువ. నలభై మైళ్ళ సూక్ష్మనాళాలుంటాయి. రోజుకు కనీసం 100 గ్యాలన్ల రక్తాన్ని శుభ్రపరుస్తాయి.
శరీరంలో రకరకాల జీవక్రియల వల్ల యూరియా, యూరికామ్లం వంటి వ్యర్థాలు, విషతుల్యాలు తయారవుతాయి. రక్తంలో వీటిపరిమాణం పెరిగితే చాలా ప్రమాదం. కిడ్నీలు ఈ వ్యర్ధాల్ని వేరుచేసి వడకట్టి బయటకు పంపుతాయి. మూత్రపిండాల్లో వున్న అతి సున్నితమైన పది లక్షల వడపోత నిర్మాణాలు (నెఫ్రాన్లు) నిరంతరం పనిచేస్తుంటాయి. మనం నీళ్ళు తాగగానే, వాటిని పేగులు రక్తంలో కలుపుతాయి. రక్తం పలుచగా మారుతుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే కిడ్నీలు రక్తంలో ఎక్కువగా వుండే నీటిని బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు శరీరంలో నీటి కొరత ఏర్పడినపుడు పొదుపుగా వడకట్టి నీటిని బయటకు పంపుతాయి. ఈ ప్రక్రియకు ఆటంకం కలిగితే ఊపిరితిత్తులకు మరియు గుండెకు ప్రమాదం. రక్తవృద్ధికి అవసరమైన ఎరిత్రోసిన్‌ అనే హార్మోన్‌ను మూత్రపిండాలు విడుదల చేస్తాయి. అది ఎముక మజ్జల్లోకి వెళ్ళి రక్తాన్ని తయారుచేసే కణాల్ని ప్రేరేపిస్తుంది. మూత్రపిండాలు మొరాయిస్తే రక్తహీనత వచ్చే ప్రమాదం కలదు.
మూత్రపిండాల సమస్యతో కాల్షియం, ఫాస్పరస్‌ జీవక్రియ దెబ్బతింటుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి. కొంతమందికి రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయి గుండెజబ్బులొచ్చే ప్రమాదముంది. రక్తపోటును సమస్ధాయిలో ఉంచుతుంది. కిడ్నీలు దెబ్బతింటే హై బీపి వచ్చే ప్రమాదముంది. రక్తపోటు నియంత్రణలో రెనిన, యాంజియోటెన్సిన్‌ అనే ఎంజైములు కిడ్నీలలో తయారవుతాయి.
మూత్రపిండాలు విఫలమవుతున్న కొద్దీ రక్తంలో క్రియాటినైన్‌ స్ధాయి పెరుగుతుంది. దీంతో రక్తహీనత, రక్తపోటు సమస్యలు వస్తాయి. గుండె చేసే పని పంపిగ్‌ ఒక్కటే. అందుకే కృత్రిమ గుండెను తయారుచేయగలిగారు. కిడ్నీలు విఫలమయినపుడు చేసే డయాలిసిస్‌ కేవలం వడపోత మాత్రమే చేస్తుంది. అదికూడా కేవలం 10 శాతం మాత్రమే. మిగతా పనులకు మందులమీద ఆధారపడవలసిందే.
కిడ్నీలు విషలమైనపుడు శారీరకంగా కనిపించే సూచనలు..
రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లటం. మూత్రం వస్తున్నట్టు అనిపించినా విసర్జన కాకపోవచ్చు. మూత్రం పెద్ద మొత్తంలోనూ వస్తుండొచ్చు. నోరు చప్పబడటం, రుచి తెలియకపోవటం. నోటి నుంచి దుర్వాసన. వికారం, వాంతి. ఆకలి తగ్గటం. రక్తహీనత, .బలహీనత, తలతిప్పుటం. రక్తపోటు పెరగటం. కాళ్లు, మడమలు, పాదాల వాపులు.ముఖం ఉబ్బరించటం ఆయాసం. చర్మం పొడి బారటం, దురదలు. ఎముకలో నొప్పులు.మూత్రంలో రక్తం సుద్దలు సుద్దలుగా పడటం. తరచుగా పిక్కలు, కండరాలు పట్టేయటం. వీటిలో ఏవి కనపడ్డా వెంటనే డాక్టరును సంప్రదించాలి
డా॥.కె.వి. దక్షిణామూర్తి, ఫ్రొఫెసర్‌, హెడ్‌ నెఫ్రాలజి, నిమ్స్‌ హైదరాబాద్‌
మన మూత్రపిండాలు శరీరంలోని వ్యర్ధ పదార్థాలను బయటకు పంపించటమేకాదు.. ఎరిత్రోపైటిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తూ రక్తం పరిమాణాన్ని నియంత్రిస్తాయి. విటమిన్‌-డి ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాల్షియం, సోడియం, పొటాషియం,ఫాస్పరస్‌, మెగ్నీషియం, యూరిక్‌ ఆమ్లం వంటి వాటిని సమతులంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా రక్తాన్ని వడపోసి, వ్యర్ధాలన్నింటినీ నీటితో కలిపి మూత్రం రూపంలో బయటకు పంపించేస్తాయి. ఈ పనులన్నింటినీ మూత్రపిండాలు సమర్ధంగా చెయ్యలేకపోతుంటే దాన్నే మనం మూత్రపిండాల వ్యాధి (కిడ్నీ డిసీజ్‌) అంటాం.
మూత్రపిండాల పనితీరు హఠాత్తుగా అంటే... కొద్దిరోజుల్లోనే తగ్గిపోతే ‘ఆక్యూట్‌ రీనల్‌ ఫెయ్యిూర్‌’ అంటారు. వారాల్లో తగ్గిపోతే ‘ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్‌ కిడ్నీ డిసీజ్‌’ అనీ.. ఇక మూడు నెలల పాటు మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతూ వస్తుంటే ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌’ అంటారు. వ్యాధి బాగా ముదిరిపోయి, ప్రాణానికి హాని కలిగే స్ధాయికి చేరుకుంటే ‘ఎండ్‌ స్టేజ్‌ కిడ్నీ డిసీజ్‌’ గా పిలుస్తారు. కిడ్నీ వ్యాధితీవ్రతను గ్లోమెర్యూర్‌ ఫ్టిరేషన్‌ రేటు (జిఎఫ్‌ఆర్‌) ఆధారంగా నిర్ధరిస్తారు. ఎక్యూట్‌రీనల్‌ ఫెయ్యిూర్‌ హఠాత్తుగా వస్తుంది. కాబట్టి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం కూడా ఇందులోనే ఎక్కువ. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ క్రమంగా మూత్రపిండాల పనితీరు తగ్గుతుంటుంది. కాబట్టి దీన్ని మందులతో, ఆహార నియమాలతో అడ్డుకోవటం అవసరం.
ముప్పు కారకాలేంటి?
క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ రావడానికి మధుమేహం, హైబీపీ ప్రధాన కారణాలు మూత్రపిండాల వాపు (గ్లోమరుర్‌ నెఫ్రైటిస్‌) మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, రాళ్లు ఏర్పడటం వంటివి కిడ్నీ డిసీజ్‌కు దారితీయొచ్చు. రాళ్ళు ఏర్పడినప్పుడు మూత్రం సరిగా బయటకు వెళ్ళకపోవటం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడి, కిడ్నీవ్యాధి వస్తుంది మూత్రం ఎక్కువగా నిల్వ ఉండటం వలన కిడ్నీపై ఒత్తిడి పెరిగి దెబ్బతినే అవకాశమూ ఉంది. వృద్ధుల్లో ప్రోస్టేట్‌ గ్రంధి వాపుతో కూడా కిడ్నీ వ్యాధి రావొచ్చు.
కొందరికి పుట్టుకతో ‘పాలీ సిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌’ వంటి జబ్బుండొచ్చు. మూత్రంలో ప్రోటీన్‌ పోవటం కూడా కిడ్నీ వ్యాధికి కారణం కావచ్చు. స్థూలకాయం కూడా కిడ్నీ జబ్బు ముప్పును తెచ్చి పెడుతుంది. వీరికి మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవేమి లేకపోయినా కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వు వలన సమస్యలు రావొచ్చు.
మధుమేహుల్లో 5 దశలు .
మధుమేహం కూడా కిడ్నీ వ్యాధికి ముఖ్యకారణం. నిజానికి చాలామందిలో మూత్రంలో ప్రోటీన్‌ రావటాన్ని గుర్తించటం ద్వారానే మధుమేహం తొలిసారి బయటపడుతుంది కూడా వీరిలో ఇది 5 దశలుగా కనపడుతుంది. మొదట్లో ‘జిఎఫ్‌ఆర్‌’ మామూలు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో దశలో జిఎఫ్‌ఆర్‌ మామూలుగా ఉన్నప్పటికి పైకి ఎలాంటి లక్షణాలు కనపడకుండానే లోపల్లో మూత్రపిండాలు దెబ్బతింటూ ఉంటాయి.
మూడోది ‘మైక్రోఅన్ బమినూరియా’ దశ ఈ సమయంలో మూత్రంలో తక్కువ మోతాదులో రోజుకు (24 గంటల్లో) 30-300 మి.గ్రా ప్రోటీన్‌ పోతుంటుంది. అంటే అప్పటికే కిడ్నీ వ్యాధి ఆరంభమైందన్నమాట.
నాలుగో దశలో మూత్రంలో ప్రోటీన్‌ మరీ అధికంగా (ఓవర్ట్‌ ప్రోటీనూరియా) పోతుంది. అంటే రోజుకు 300 మి.గ్రా కన్నా ఎక్కువ ప్రోటీన్‌ పోతుందన్నమాట. దీన్నే ‘డయాబెటిక్‌ నెఫ్రోపతీ’ అంటారు.
ఇక ఐదో దశ కిడ్నీ వైఫల్యం! మూడోదశలో వ్యాధిని గుర్తిస్తే మధుమేహం, హైబిపీను నియంత్రణలో ఉంచుకోవటం, ఆహారనియమాలు, మందుల ద్వారా దాన్ని ఆపటం గాని, తిరిగి సాధారణ స్ధాయికి తేవటం కాని చేయొచ్చు.నాలుగు, ఐదో దశలో గుర్తిస్తే కిడ్నీ పనితీరు మరింత తగ్గిపోకుండా చూడొచ్చు గానీ తిరిగిమామూలు స్ధాయికి చేర్చడం అసాధ్యం.
అధిక రక్తపోటు ముప్పు
వ్యర్థాలను వడపోసే ప్రక్రియ అంతా కూడా మూత్ర పిండాల్లోని నెఫ్రాన్‌లో జరుగుతుంటుంది. దీన్ని గ్లోమరుస్‌ నిర్వహిస్తుంది. అధిక రక్తపోటు గల వారిలో ఈ గ్లోమరుస్‌ పై ఒత్తిడి పెరిగిపోయి అది దెబ్బతింటుంది. ఫలితంగా మూత్రంలో ప్రోటీన్‌ పోతూ, క్రమేపీ అది కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది.