మూత్రనాళాల్లో లేదా మూత్రపిండాల్లో రాళ్ళు ఉండాటాన్ని వైద్య పరిభాషలో యూరోలిథియా లేదా నెఫ్రోలిథియాసిస్ అంటారు. సాధారణంగా కిడ్నీలలో ఏర్పడే ఒకరకం రాయైన ఆక్సలైట్ స్టోన్‌కు తగినంత చికిత్స అందించని కేసుల్లో 40 శాతం మందిలో ఏడాది వ్యవధిలో, 35 శాతం మందిలో ఐదేళ్ళలో, 50 శాతం మందిలో పదేళ్ళలో మళ్ళీ వస్తాయి.
కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి...?
మన మూత్ర విసర్జక వ్యవస్థలో రెండు మూత్రపిండాలు, వాటి నుంచి సంచిలా ఉండే బ్లాడర్‌ను కలిపే యురేటర్స్ అనే రెండు గొట్టాలు, బ్లాడర్ నుంచి మూత్రాన్ని శరీరం బయటకు విసర్జించే ఒక మూత్రనాళం ఉంటాయి. రక్తంలోని అనేక పదార్థాలను మూత్రపిండం వడ పోస్తుంటుంది. ప్రమాదకరమైన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించి వేస్తుంది. రక్తంలోని క్యాల్షియం ఆక్సలైట్ అనే పదార్థాలు మూత్రవిసర్జన వ్యవస్థలో గడ్డలా మారిపోతూ క్రమంగా రాయిలా ఏర్పడవచ్చు. ఇవి సన్నగా స్పటికాల్లా ఉండి మూత్ర పిండం నుంచి మూత్రనాళం మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.
మూత్ర వ్యవస్థలో ఏర్పడే రాళ్ళు అనేక పరిమాణాల్లో ఉండవచ్చు. 5 మి.మీ కంటే తక్కువ సైజ్‌లో ఉండేవి మూత్ర ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంతకంటే ఎక్కువ సైజ్‌లో ఉన్న రాళ్ళు మూత్రపిండం, యూరేటర్ లేదా మూత్రనాళంలో ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్రంలో రాళ్ళు ఏర్పడటం అన్నది అనువంశికంగానూ కనిపించవచ్చు. కుటుంబ చరిత్రలో మూత్రంలో రాళ్ళు ఏర్పడే కండిషన్ ఉంటే అవి వారసుల్లోనూ కనిపించడానికి ఫెమిలియల్ రీనల్ ట్యూబ్యులార్ అసిడోసిస్ సిస్టిన్యూరియా అనే కండిషన్స్ ఉదాహరణలు.
లక్షణాలు : ఒకచోటి నుండి మరోచోటికి తెరలు తెరలుగా వ్యాపిస్తున్నట్లుగా కడుపులో నొప్పి, వికారం లేదా వాంతులు కావడం, మూత్రంలో రక్తం పడటం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో మంట... పై లక్షణాలన్నీ కనిపిస్తూ తరచూ జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే పెద్ద రాళ్ళు ఉన్నప్పటికీ కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.
రాళ్ళు ఏర్పడానికి దారితీసే కొన్ని పరిస్థితులు :
1. వేడిగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం ఎక్కువ. ద్రవాహారం, నీళ్లు తక్కువగా తీసుకునే వారిలో ఈరిస్క్ మరింత ఎక్కువ.
2. శారీరకంగా కొన్ని రకాల నిర్మాణపరమైన తేడాలు ఉండేవారిలో (ఉదా: ముడుల్లరీ స్పాంజ్ కిడ్నీ, యూపిజె ఆబ్‌స్ట్రక్షన్) మూత్రపిండాల్లో రాళ్ళు రావచ్చు.
3. కొన్ని రకాల మందులు.. ఉదా: ఫ్యురోసమైడ్ (లాసిక్స్) అసిటజోలమైడ్ (డయామాక్స్) వంటివి తీసుకునే వారిలో రాళ్లు ఏర్పడవచ్చు.
4. మెలింగోమైలోసీల్, లేదా న్యూరోజెనిక్ బ్లాడర్ వంటి జబ్బులు, స్ట్రువ్ టి స్టోన్ అనే రకం రాళ్లు ఏర్పడేందుకు దోహదపడవచ్చును.
5. మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఈ రిస్క్ ఎక్కువ.
6. సార్కారాయిడోసిస్, లెప్రసీ, క్యాన్సర్ ఉన్న రోగులలో, క్యాల్షియమ్ పాళ్ళు పెరిగి రాళ్ళు వచ్చేందుకు అవకాశం ఎక్కువ.
7. గర్భిణీల్లో 1500 నుంచి 2500 మందిలో ఒకరికి ఇలా రాళ్ళు ఏర్పడేందుకు అవకాశం ఎక్కువ. అప్పటికీ మూత్ర విసర్జక వ్యవస్థలో రాయి ఉన్న సందర్భాలలో కడుపు పెరుగుతుండటం వల్ల ఒక్కోసారి అది నొక్కుకుపోయి మూత్రంలో రక్తస్రావం కనిపించవచ్చు.
నిర్థారణ ఇలా
రోగులకు చేసే సాధారణ మూత్రపరీక్షలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవియూ) కొందరి రోగులలో రాళ్లను ఎక్స్-రే ద్వారా కనుగొనలేని సందర్భాల్లో లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన కేసుల్లో, పొట్టలో ఇంకా ఏవైనా జబ్బులు ఉన్నపుడు.. ఇలాంటి వారిలో సిటీస్కాన్ అబ్డామిన్ పరీక్ష ద్వారా రాళ్లను కనుక్కోవాల్సి ఉంటుంది. లోపల ఉండే రాళ్ల సైజ్‌ను బట్టి చేయాల్సిన చికిత్స నిర్ణయించవలసి ఉంటుంది.
చికిత్స
కిడ్నీస్టోన్స్ చాలా వరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తారు. నాన్ ఇన్‌వేజివ్ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్‌వేవ్ లిథోటోప్సీ విధానంలో లేజర్, ఆల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా లేదా మెకానికల్‌గా కాని రాయిని పొడి అయిపోయేలా చేస్తారు. ఎండోస్కోపీ ద్వారా యురేటర్‌లో రాయిని తీయడం ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయితీయడం, వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నపుడు కిడ్నీ వ్యవస్థ విఫలమైనపుడు, ఇన్‌ఫెక్షన్ గురైనపుడు సర్జరీ చేయాలి. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే ఆపరేషన్ చేయించడం అవసరం లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి కిడ్నీలు దెబ్బతినవచ్చు.