header

Best food for Kidneys....కిడ్నీ వ్యాధి వారికి మంచి ఆహారం...ు

Best food for Kidneys....కిడ్నీ వ్యాధి వారికి మంచి ఆహారం...

కిడ్నీ వ్యాధుల వారు తినకూడనవి... చెక్కెర, బెల్లం, స్వీట్ల వంటి తీపి పదార్ధాలు తక్కువగా తినాలి. బియ్యం, గోధుమ వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. సంక్లిష్ట పిండిపదార్ధాతో కూడిన తృణధాన్యాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి. శక్తి కూడా నెమ్మదిగా విడుదల కావడం వల్ల దాన్ని శరీరం వెంటనే వినియోగించుకుంటుంది. చెక్కర స్వీట్ల వంటి తీపి పదార్ధాలు తినడం వల్ల ఒక్కసారిగా శక్తి విడుదల అవుతుంది. దాన్ని శరీరం వెంటనే ఖర్చు పెట్టుకోలేదు. అప్పుడది కొవ్వు రూపంలోకి మారి, నిల్వ వుండిపోతుంది. దీంతో బరువు పెరగడం, స్ధూలకాయం రావడం జరుగుతాయి. ఇది కిడ్నీలకు మంచిది కాదు. ఇక మధుమేహలు తీపి పదార్ధాలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజు నియంత్రణ దెబ్బతింటుంది. మధుమేహం లేని వాళ్ళు ఎప్పుడైనా స్వీట్లు తిన్న పెద్దగా ఇబ్బంది వుండదు. కాని మితిమీరి తినరాదు.
మాంసాహారం తగ్గించాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి? కిడ్నీల జబ్బు బాధితుల్లో ప్రోటీన్ల నియంత్రణ చాలా కీలకం. కూరగాయల కన్నా మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు ఎక్కువ ప్రమాదకరం. ఈ ప్రోటీన్లు జీర్ణమయ్యాక మిగిలిపోయే పదార్ధాలను బయటకు పంపించేందుకు మూత్రపిండాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అదే కూరగాయల నుండి లభించే ప్రోటీన్లతో అంత భారం ఉండదు. అయితే డయాలసిస్‌ చేయించుకునేవారికి ప్రోటీన్లు అవసరం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారికి ప్రోటీన్ల నియంత్రణ పనికిరాదు. కిడ్నీలు చేయాల్సిన పనిని డయాలసిస్‌ చేస్తుంది. కాబట్టి ఇబ్బందేమీ ఉండదు. ప్రోటీన్లను తగ్గిస్తే వీరిలో పోషకాహార లోపం ఏర్పడవచ్చు. అయితే ప్రోటీన్లతో పాటు ఫాస్పరస్‌ కూడా అందుతుంది కాబట్టి దాని మోతాదును అదుపులో ఉంచుకోవడానికి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. వెన్న, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులు తక్కువగా తినాలి.
అసంతృప్త కొవ్వులు గల ఆలివ్‌నూనె, చేపనూనె, అవిసెనూనె ఎక్కువగా తినాలి. ఎందుకు? : కిడ్నీ జబ్బు గలవారిలో, మధుమేహుల్లో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, ఎల్‌డీయల్‌ కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది కూడా, అందువల్ల వీళ్ళు వెన్న, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులను బాగా తగ్గించాలి. పాలి, ఒమెగా-3, అసంతృప్త కొవ్వులు గల ఆలివ్‌నూనె వంటివి మంచిది. మాంసాహారులైతే చేపనూనె తీసుకోవచ్చు. వీటిలోని ఒమెగా త్రీ కొవ్వు అధిక రక్తపోటు తగ్గించటానికి రక్తంలోని ప్లేట్‌లెట్ల పనితీరును కొవ్వును నియంత్రణలో వుంచడానికి తోడ్పడతాయి.
అవిసెనూనె (ఫ్లాక్స్‌సీడ్స్‌ అయిల్‌) లోనూ ఒమెగా-3 కొవ్వులెక్కువగా వుంటాయి. అవిసెగింజల పొడిని కూరలో వేసుకున్నా, అన్నంలో కలుపుకొని తిన్నా మంచిదే. పొద్దుతిరుగుడు నూనె, నువ్వులనూనె కూడా మంచివే. ఈ నూనెలను మార్చి మార్చి వాడుకుంటే మేలు.
మాంసం కన్నా చేపలు తినడం మేలు. చేపల్లో ఒమెగా-3 కొవ్వులు ఆమ్లాలు అధికంగా వుంటాయి. కాబట్టి మాంసం కన్నా చేపలు తినడం మంచిది. సముద్రం చేపలైతే ఇంకా మంచిది. అలాగే మాంసం ద్వారా లభించే ప్రోటీన్లలో ఫాస్పరస్‌ కూడా అధికంగా ఉంటుంది. కిడ్నీ జబ్బు గలవారిలో ఫాస్ఫరస్‌ మోతాదు పెరిగితే ఒంట్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌ స్ధాయిల్లో సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఎముకలు బలహీన పడతాయి. రక్తనాళాల్లో క్యాల్షియం చేరి, గట్టిపడటంలో అడ్డంకులు ఏర్పడి ఆయా అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
రక్తనాళాల్లో క్యాల్షియం మరీ ఎక్కువగా పోగుబడి గట్టిపడితే చర్మం నెక్రోసిస్‌ రావచ్చు. దీంతో కండరం, చర్మం చనిపోయే ప్రమాదం వుంది. కొన్ని పప్పు దినుసుల్లోను ఫాస్పరస్‌ అధికంగా ఉంటుంది. వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కాని పరిమితంగా తీసుకోవాలి. బీరు, పన్నీరు, చాక్లెట్లలోను ఫాస్ఫరస్‌ ఎక్కువే.
ఉప్పు తక్కువగా తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీరు అధికంగా చేరిపోతుంది.ఉప్పుతో పాటు నీరు కూడా నిల్వ ఉండటంతో బరువు పెరుగుతారు. కాళ్ళ వాపులు ఆయాసం వస్తాయి. అలాగే ఉప్పు మూలంగా నీటితో పాటు రక్తమోతాదు పెరగటంతో గుండె మీద అధిక భారం పడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది కూడా. ఉప్పు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహలు తీపి పదార్ధాలతో పాటు ఉప్పును పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటే వీరికి మామూలుగానే అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ. దీనికి ఉప్పు కూడా తోడైతే అది మరింత ఎక్కువవుతుంది. చివరికి ఇది కిడ్నీల జబ్బుకు దారి తీస్తుంది.
కిడ్నీ జబ్బుల బాధితులు రోజుకు 4 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తినకూడదు. కాబట్టి వండేటప్పుడు కాకుండా వండిన తరువాత కూరల్లో ఉప్పు కలుపు కోవడం మంచిది. దీనితో ఎంత మోతాదు తింటున్నామనేది తెలుస్తుంది.
నిల్వ పచ్చళ్ళల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఒంట్లో నీటి శాతం పెరగటం,బీపి పెరగటం వంటి సమస్యకు దారి తీస్తుంది. అప్పటికప్పుడు చేసుకునే రోటీ పచ్చళ్ళల్లో అంత ఉప్పు ఉండదు కాబట్టి వీటిని తినవచ్చు. పిజ్జాలు, గింజపప్పులు, ఆలూ చిప్స్‌, శుద్ధి చేసిన ఆహార పదార్ధాలు, బటర్‌, కెచప్‌, సాస్ లు, ఉప్పు కలిపిన ఎండబెట్టిన చేపలు, మాంసంలోను ఉప్పు ఎక్కువ ఉంటుంది.
అరటి, పుచ్చ, నారింజ, కమలా, బత్తాయి పండ్ల వంటివి పరిమితంగానే తినాలి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి తగ్గించి తినాలి. జిఎఫ్‌ ఆర్‌ తగ్గిపోయినపుడు ఒంట్లో అధికంగా ఉన్న పొటాషియంను మూత్రపిండాలు సరిగా బయటకు పంపించలేవు. దీంతో పొటాషియం మోతాదు పెరుగుతుంది. అందువల్ల పొటాషియం లభించే ఆహార పదార్ధాలను తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. యాపిల్‌, బొప్పాయి, జామ, సీతాఫలం వంటి వాటిల్లో పొటాషియం మోతాదు తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవచ్చు.
మొక్కజొన్నల్లోను పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి పరిమితంగానే తినాలి. దాదాపు అన్ని కూరగాయల్లోను పొటాషియం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటిని ముక్కలుగా తరిగిన తరువాత గంటసేపు నీటిలో నానవేసి ఉంచటం మంచిది. దీంతో అందులోనే పొటాషియం నీటిలోకి చేరుకుంటుంది. ఈ పద్ధతిని ‘లీచింగ్‌’ అంటారు. ఆ తరువాత కాయగూర ముక్కలను వంటలో ఉపయోగించుకోవాలి.
బేకరీ పదార్ధాలు మానేయాలి. బేకరీ పదార్ధాల్లో ఉప్పుతోపాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని మానేయడమే మంచిది. నిమ్మ ఉప్పు, నల్ల ఉప్పును మానివేయాలి. బేకరీ పదార్ధాలు మసాలా దినుసుల్లోను పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.
బిస్కట్లు, కేకులు బ్రెడ్‌లో పొటాషియం ఎక్కువగా వుండే అవకాశం ఉంది. కాబట్టి తక్కువగానే తినాలి. పాలు, పెరుగు వంటి పాలపదార్ధాలు పరిమితంగానే తీసుకోవాలి.చప్చటి మజ్జిగ మంచిది. కిడ్నీ జబ్బు గలవారిలో క్యాల్షియం మోతాదు తగ్గే అవకాశం ఉంది. అలాగే విటమిన్‌ డి లోపం కూడా ఎక్కువే. కాబట్టి క్యాల్షియం, విటమిన్‌-డి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో క్యాల్షియం జీవక్రియ కొంతవరకు మెరుగు పడుతుంది. పాలు, పెరుగు వంటి వాటిల్లో క్యాల్షియం లభిస్తుంది. కాని దాంతో పాటే ఫాస్ఫరస్‌ కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. అందువల్ల వెన్నతీసిన పాలు పెరుగు తీసుకోవాలి. అదీ పరిమితంగానే వాడుకోవాలి. చప్చటి మజ్జిగ తీసుకుంటే అంత ప్రమాదమేమి ఉండదు.
మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే స్వభావం కలవారు మాత్రం పాలకూర, టమోట, క్యాబేజి, క్యాలిఫ్లవర్‌ మానేయడం మంచిది. స్వీట్లు తగ్గించాలి. వీటిలో అగ్జలేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా పోగుపడితే రాళ్ళు ఏర్పడడానికి దోహదం చేస్తాయి. ఇవి కిడ్నీ జబ్బులకు దారి తీస్తాయి. కాబట్టి రాళ్ళ సమస్యలున్నవారు టమోటా, పాలకూర, క్యాబేజి, క్యాలిఫ్లవర్‌ వంటివి మానేయాలి. వీళ్లు డాక్టర్‌ సలహా లేకుండా విటమిన్‌-సి కూడా ఎక్కువగా తీసుకోరాదు.
ఇది అగ్జలేట్లుగా మారిపోయి తిరిగి రాళ్ళు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. వీళ్ళు స్వీట్లు ఎక్కువగా తింటే మూత్రంలోకి క్యాల్షియం ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో తిరిగి రాళ్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.
గుడ్డులో పచ్చసొన మంచిది కాదు. ఇందులో కొలెస్ట్రాల్‌, ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ డిసీజస్ గలవారికి ఇది అంత మంచిది కాదు. తెల్లసొన తింటే పర్వాలేదు.
అవసరమైన మేరకే నీళ్లు తాగాలి. మనం ఎప్పుడైనా నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలు ఆమేరకు నీటిని బయటకు పంపించేస్తాయి. కాని కిడ్నీ జబ్బు గలవారిలో మూత్రపిండాలు ఆపనిని సమర్ధవంతంగా చేయలేవు. దీంతో ఒంట్లో నీటి శాతం ఎక్కువై రక్తపోటు పెరగటం, ఆయాసం, కాళ్ళు ముఖం ఉబ్బటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూత్రం ఎంత మోతాదులో వస్తుందనేది దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు నీరు త్రాగాల్సి ఉంటుంది.అంటే మూత్రం తక్కువగా వస్తుంటే నీళ్లు తక్కువే తాగాలన్న మాట.
కాఫీ, టీలు ఎక్కువగా తాగరాదు. కెఫిన్‌ మూలంగా ఒంట్లో కొవ్వు పదార్ధాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కాఫీ, టీలను పరిమితంగానే తీసుకోవాలి. ఇన్‌స్టంట్‌ కాఫీ కన్నా ఫిల్టర్‌ కాఫీ మేలు. ఇన్‌స్టంట్‌ కాఫీలో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.
చింతపండు తక్కువగానే తినాలి. చింతపండులో అగ్జలైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు ఇవి శరీరంలో పేరుకుపోయే అవకాశముంది. కాబట్టి పులుపు కోసం చింతపండు బదులు నిమ్మరసం వాడుకోవచ్చు అయితే దీన్ని పరిమితంగానే తీసుకోవాలి.
పొగమానేయాలి. మద్యం పరిమితంగా తీసుకోవాలి. పొగతాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలు గట్టి పడతాయి. పొగలోని విషపదార్ధాలు నేరుగా మూత్రపిండాల్లోని గ్లోమరుస్‌ను దెబ్బతీస్తాయి. గుట్కా కూడా పొగ మాదిరిగానే దుష్‌ప్రభావం చూపుతుంది. ఇక మద్యం నేరుగా కిడ్నీ ట్యూబ్స్ ను దెబ్బతీస్తుంది. దీంతో ఒంట్లో కొవ్వు పెరిగే అవకాశముంది. మద్యం అలవాటు గలవారు ఇతర పదార్ధాలు అంతగా తీసుకోకపోవడం వల్ల వీరిలో పోషకాహార లోపం రావచ్చు.
వక్కపొడి మంచిది కాదు.ఇందులో పొటాషియం, ఆల్కాలాయిడ్స్ ఎక్కువగా వుంటాయి కాబట్టి. కూల్‌డ్రింకులు మానేయాలి. వీటిలో ఫాస్పేట్‌ అధికంగా ఉండటం వల్ల ఎముకల్లో క్యాల్షియం చేరకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిది.