పూర్తి మార్పిడితో పోలిస్తే పాక్షిక మార్పిడిలో త్వరగా కోలుకునే అవకాశముంది. రెండో రోజుననే కాలు కింద ఆనించి బరువు మోపించేందుకు, నడిపించేందుకు ప్రయత్నిస్తారు. నొప్పులు అంతగా లేకపోతే రెండు, మూడు రోజుల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. 10-15 రోజుల వరకు చేతి కర్ర లేదా వాకర్ సాయంతో నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3 వారాల లోపు మెట్లు ఎక్కటం వంటి పనులు చేయొచ్చు. రెండు నెలల్లో దాదాపు పూర్తిగా కోలుకునే అవకాశముంది. 2-3 నెలల వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత అన్ని పనులూ చేసుకోవచ్చు. ఇతరత్రా శస్త్రచికిత్సల్లో మాదిరిగానే దీనిలోనూ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉండొచ్చు. అంతకుమించి పెద్ద ముప్పులేవీ ఉండవు. అయితే ఎముకలు దృఢంగా లేనివారికి, పరికరం సరిగా కుదురుకోనివారికి ఆ భాగంలో ఎముక విరిగే ప్రమాదముంది. అందువల్ల ఎముకలు బలహీనంగా ఉన్నవారికి దీన్ని చేయటం తగదు. అలాగే ఏసీఎల్ కండరబంధనం తెగినవారికీ ఇది పనికిరాదు.
మోకీలు మార్పిడి అనగానే ముందుగా మొత్తం మార్పిడే గుర్తుకొస్తుంది. ఇందులో కీలు మొత్తాన్ని తొలగించి.. దాని స్థానంలో లోహం లేదా సిరామిక్తో చేసిన కృత్రిమ పరికరాన్ని అమరుస్తారు. అయితే మృదులాస్థి క్షీణించటమనేది అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో కీలులో ఒక భాగంలోనే దెబ్బతినొచ్చు. ఇలాంటివారికి కీలు మొత్తాన్ని తొలగించాల్సిన అవసరం ఏముంది? దెబ్బతిన్న భాగాన్ని తీసేసి, అంతవరకే సరిచేస్తే చాలదా? సరిగ్గా ఇక్కడే పాక్షిక మోకీలు మార్పిడి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. కీళ్లనొప్పులతో బాధపడే వారిలో 30% మందికి కీలులో మూడింట ఒకవంతు భాగమే దెబ్బతింటుంది. ఇలాంటివారికి పూర్తి మోకీలు మార్పిడి కన్నా పాక్షిక మార్పిడే ఉత్తమమనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది.
దీన్ని మొత్తం మార్పిడికి ప్రత్యామ్నాయంగా భావిస్తుంటారు గానీ ఇవి రెండూ వేర్వేరు పద్ధతులే. దేని ప్రయోజనం దానిదే. పాక్షిక మార్పిడిలో దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే తొలగించి, దాని స్థానంలో కృత్రిమ పరికరాన్ని అమరుస్తారు. మిగతా ఎముక, మృదులాస్థి, కండరబంధనాల (లిగమెంట్లు) వంటివన్నీ అలాగే ఉంచుతారు. మొత్తం మోకీలు మార్పిడి మాదిరిగానే దీంతోనూ మంచి ఫలితం కనబడుతుంది. పైగా దీంతో అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. మొత్తం మోకీలు మార్పిడి చేయించుకున్నవారు కాలును పూర్తిగా వంచలేరు. అదే పాక్షిక మోకీలు మార్పిడి అనంతరం కాలును పూర్తిగా వంచొచ్చు. కండర బంధనాలు అలాగే ఉండటం వల్ల కదలికలన్నీ మునుపటిలాగే ఉంటాయి.
ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. కింద కూచోవాలనుకుంటే కూచోవచ్చు. పెద్ద పెద్ద పనులు చేయాలంటే చేసుకోవచ్చు. ఆటలాడాలనుకుంటే ఆడుకోవచ్చు. వ్యవసాయం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సాధారణంగా కృత్రిమ మోకీలు పరికరం 20 ఏళ్ల వరకు మన్నుతుందని అంచనా. ప్రస్తుతం మన జీవనకాలం బాగా పెరిగింది. ఎంతోమంది 80, 90ల్లోనూ మంచి ఆరోగ్యంతో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే మొత్తం మోకీలును మార్చాల్సి వస్తే మున్ముందు మరోసారి సర్జరీ చేయాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అప్పుడు తిరిగి సర్జరీ చేయటం చాలా కష్టం. ఫలితాలూ అంత బాగా ఉండకపోవచ్చు. అందువల్ల కొద్దిభాగమే మోకీలు దెబ్బతిన్నవారికి ముందుగా పాక్షిక మార్పిడిని ప్రయత్నించటమే ఉత్తమం. అవసరమైతే వీరికి మున్ముందు మొత్తం మోకీలు మార్పిడి చేయటానికీ అవకాశముంటుంది.
పాక్షిక మోకీలు మార్పిడి చేయించుకున్నాక రెండో వైపున మృదులాస్థి క్షీణిస్తే? చాలామందికి ఈ అనుమానం వస్తుంటుంది. కానీ పాక్షిక మార్పిడి చేయించుకున్న 95% మందిలో 15 ఏళ్ల వరకూ కృత్రిమ పరికరం సమర్థంగా పనిచేస్తున్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. అంటే మార్పిడి అనంతరం మోకీలులో రెండో వైపున మృదులాస్థి క్షీణించటమనేది పెద్దగా కనబడటం లేదనే దీనర్థం. సాధారణంగా మన శరీర బరువు చాలావరకు మోకాలికి లోపలి వైపుననే (మీడియల్) పడుతుంటుంది. కాబట్టి అరుగుదల కూడా ఈ భాగంలోనే ఎక్కువ. పాక్షిక మార్పిడి అనంతరం మన శరీరం బరువు మోకీలుపై సరి సమానంగా పడుతుంది కూడా. కాబట్టి రెండో వైపున క్షీణించే అవకాశమూ తగ్గుతుంది