header

Edema………కాళ్ళవాపులు

డా. జె.ఎం.గురునాధ్‌ - సీనియర్‌ కన్సల్టెంట్, ఇంటర్నల్‌ మెడిసన్‌, యశోదా హాస్పటల్‌, సికింద్రాబాద్‌.
కాళ్లలో నొక్కినచోట గుంటలా ఏర్పడి అది మొల్లగా సర్ధుకోవడాన్ని సాధారణగా పిట్టింగ్‌ అంటారు. ఈ సమస్యను వైద్యపరిభాషలో ఎడిమా అంటారు. ఈ సమస్య సాధారణంగా పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ. నీరు పట్టడానికి అనేక కారణాలుంటాయి.
కారణాలు : రెండు కాళ్లలోనూ నీరుపడుతుంటే ఈ కింది సమస్యలు ఉండే అవకాశం ఉంది.
1. కిడ్నీ సమస్యలు : నెఫ్రోటిక్‌ సిండ్రోమ్‌, గ్లామరూలో నెఫ్రిస్‌ వంటి మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో.
2. కాలేయ సమస్యలు : సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌ వంటి కాలేయ సమస్య ఉన్నప్పుడు.
3. గుండె సమస్యలు : హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి గుండె సంబంధించిన సమస్యలు
4. పోషకాహాక లోపాలు : ఆహారంలో తగినన్ని ప్రోటీన్లు తీసుకోకపోవటం బెరిబెరి వంటి పోషకాహార లోపాలు ఉండటం.
5. హైపోథైరాయిడిజం : ఇది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. ఈ సమస్యలో మాత్రం కాళ్ల వాపు నీరు పట్టడం వల్ల జరగదు. కాళ్లలో మిక్సిమాస్‌ అనే టిష్యూ కారణంగా కాళ్ల వాపు వస్తుంది.
6. కొన్ని రకాల మందుల వల్ల : నొప్పి నివారణ మందులు దీర్ఘకాలం వాడుతున్న వారిలో, కొన్ని రకాల హైబిపి మందులు వాడేవారిలో, రకరకాల కారణాల వల్ల స్టెరాయిడ్స్‌ వాడిన వారిలో కాళ్లవాపు కనిపించవచ్చు
. 7. ప్రయాణాల వల్ల : కొందరిలో చాలా దూరం కూర్చుని ప్రయాణం చేయడం వల్ల ఈ కాళ్లవాపు వస్తుంటుంది.
8.కారణాలు లేకుండా : కొంతమందిలో నిర్థిష్టంగా ఎలాంటి కారణం లేకుండానే కాళ్లవాపులు రావచ్చు. ముఖ్యంగా పిల్లలను కనే వయసులోని మహిళల్లో ఇది కనిపించడం చాలా సాధారణం దీన్ని ఇడియోపాధిక్‌ సైక్లిక్‌ ఎడిమా అంటారు.
చాలా మందిలో కాళ్లవాపు సమస్య ప్రమాదకరం కాదు. అయితే ఈ సమస్య ప్రమాదకరం కాదని చెప్పడానికి ముందుగా అందుకు అనుమానించే అన్ని కారణాలకు సంబంధించిన పరీక్షలు చేయించి అవి నెగిటివ్‌ అని తేలాక మాత్రమే. అది ప్రమాదకరం కాదని నిర్థారణ చేయాల్సి ఉంటుంది.
ఒక కాలిలో వాపు ఉంటే :
1. ఫైలేరియాసిస్‌, ఎలిఫెంటియాసిస్‌ : దోమకాటు వల్ల కాలిలో వాపు
2. వెరికోస్‌ వెయిన్స్‌ : కాళ్లపై ర్తనాళాల్లోని (సిరలు) కవాటాలు పనిచేయకపోడం వల్ల నరాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.
3. డీప్‌ వెయిన్‌ ధ్రాంబోసిస్‌ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది.
4. వీనస్‌ ఇన్‌సఫీషియన్సీ : కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం నిర్థిష్ట మార్గంలో ప్రయాణం చేయకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు.
5. సెల్యులైటిస్‌ : కాళ్ల చర్మంలోని డెర్మల్‌ సబ్‌క్యుటేనియస్‌ అనే పొరలలో ఉండే కనెక్టివ్‌ టిష్యులో సమస్యల వల్ల ఈ వాపు వస్తుంది. చికిత్స : (ఈ మందులను డాక్టరు సలహాపై మాత్రమే వాడాలి. సొంత వైద్యం పనికిరాదు)
రెండు కాళ్ళు చాచినప్పుడు : సాధారణంగా కాళ్ల వాపు వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ఒకేలాంటి నిర్థిష్టమైన చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. అందుకే ముందుగా పరీక్షలు చేయించి కాళ్ల వాపులకు ఉన్న కారణాన్ని కనుగొనాల్సి ఉంటుంది.
మూత్రపిండాల సమస్యలో : ఇమ్యునోసప్రెసెంట్స, డైయూరిటిక్స్‌ వంటి మందులు వాడాల్సి ఉంటుంది.
సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌లో : స్పెరనోలాప్టోన్‌ అనే మందులు వాడాల్సి ఉంటుంది. కార్డియాక్‌ సమస్యలో : అయనోట్రోపిక్స్‌, డైయూరిటిక్స్‌ వంటి మందులు వాడాలి.
పోషకాహార లోపాల్లో : అత్యధికంగా ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి.
హైపోధైరాయిడిజమ్‌ : థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ ఇవ్యాల్సి ఉంటుంది.
ఏదైనా మందుల వల్ల కాళ్ల వాపు వస్తే : పేషంట్ వాడుతున్న నొప్పి నివారణ మందులు, హైబిపి మందులు, స్టెరాయిడ్స్‌ నిలిపివేసి వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర మందులు మార్చాల్సి వస్తుంది.
ఏ కారణం లేకుండా వచ్చే వాపు : ఇది ఏ కారణం లేకుండా వచ్చే ఇడియోపథిక్‌ సైక్లిక్‌ ఎడిమా అయితే ఎలాంటి మందులు వాడనవసరం లేదు. దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే కొద్ది రోజుల పాటు డైయూరిటిక్స్‌ వాడవచ్చు.
ప్రయాణంలో వచ్చే వాపులు : వీరికి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు కాస్త ఎత్తుగా ఉండేలా తలగడపై కాళ్లు పెట్టుకోవడంతో కాళ్లవాపు తగ్గుతుంది, ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ సలహాపై డైయూరిటిక్స్‌ వాడవచ్చు.
ఒకే కాలి వాపునకు చికిత్స
ఫైలేరియాసిస్‌లో : డై ఇథైల్‌ కార్మోమైసిన్‌ ను సాధారణంగా ఉపయోగిస్తారు. ఎలిఫెంటి యాసిస్‌లోనూ ఇవే మందులను ఉపయోగిస్తారు. అయితే ఈ మందులు ఒకదశలో పనిచేయని పరిస్థితి రావచ్చు.
వేరికోస్‌ వెయిన్స్‌ : నిర్థిష్టంగా ప్రత్యేకంగా మందులు ఉండవు. కాళ్లకు తొడిగే ప్రత్యేకమైన తొడుగు స్టాకింగ్స్‌ల వల్ల ఈ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు.
వీనస్‌ ఇన్‌సఫిషియన్సీ: ఈ సమస్యకు కూడా నిర్థిష్టంగా చికిత్స ఉండదు. అయితే ప్రత్యేకమైన ఎలాస్టిక్‌ తొడుగుల ద్వారా కాళ్లవాపును అదుపు చేయవచ్చు. ఒకవేళ కాళ్ల వాపు మరీ ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.
సెల్యులైటిస్‌ : ఈ సమస్య వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు : అన్ని రకాల కాళ్ల వాపుల విషయంలో ఈ సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. చాలాసేపు అదేపనిగా కూర్చోవడం, నిలబడటం తగ్గించాలి. రాత్రివేళల్లో కాళ్లను ఎత్తుగా తలగడపై విశ్రాంతిగా ఉంచాలి. అవసరాన్ని బట్టి ఎలాస్టిక్‌ స్టాకింగ్స్‌ వాడాలి.
పరీక్షలు
సీబీపీ. యూరిన్‌ స్పాట్ ప్రొటీన్ / క్రియాటినిన్‌ రేషియో. బ్లడ్‌ యూరియా క్రియినిన్‌. లివర్‌ పంక్షన్‌ పరీక్ష.2-డీ ఎకో కార్డియోగ్రామ్‌. టి3, టి4, టిఎస్‌హెచ్‌. ఆల్ట్రా సౌండ్‌ హోల్‌ అబ్డామిన్‌. వీనస్‌ డాప్లర్‌ ఆఫ్‌ ది లెగ్స్‌. నైట్ స్మియర్‌ ఫర్‌ మైక్రోఫైలేరియా లాంటి పరీక్షలు కాళ్ల వాపులు ఉన్నవారిలో చేయించాల్సి ఉంటుంది.