header

Cartilage Damage… కార్టిలేజ్‌ .....Meniscus Damage…

Cartilage Damage… కార్టిలేజ్‌ .....Meniscus Damage…
cartilage damage మోకీళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. ఇక కీళ్ల స్వరూపాన్ని క్రమంగా మార్చేస్తూ.. చివరికి వాటిని కట్టిపడేసే అరుగుదల సమస్య (ఆస్టియో ఆర్థ్రయిటిస్‌) దాడి చేస్తే? మొత్తం శరీరమే కుదేలవుతుంది. నిజానికి వయసుతో పాటు మోకీళ్లు అరగటం అసహజమేమీ కాదు. కాకపోతే ఇప్పుడు 40, 50ల్లోనే ఎంతోమంది దీని బారినపడుతుండటం.. చిన్న చిన్న దూరాలకే నొప్పులతో విలవిల్లాడుతూ కూలబడిపోతుండటమే విషాదం. మారిపోతున్న జీవనశైలి, అధిక బరువు, ఊబకాయం వంటివన్నీ ఇందుకు తలో చేయి వేస్తున్నాయి.
కూచోవాలన్నా, నిలబడాలన్నా ఒకటే నొప్పి. నాలుగడుగులు వేయటమూ గగనమే. ఇలా మోకీళ్లనొప్పులతో తలెత్తే బాధలు అన్నీఇన్నీ కావు. మన శరీరాన్ని, జీవనగమాన్ని నడిపించే మోకీలు ఎందుకిలా మొరాయిస్తోంది? అసలేంటీ సమస్య? మన శరీరంలో అతి ముఖ్యమైన, అతి బలమైన కీళ్లలో మోకీలు ఒకటి. శరీర బరువును, ఒత్తిడిని భరిస్తూనే సున్నితంగా కదులుతుండటం దీని ప్రత్యేకత. మనం నడవటం, కాళ్లు ముడుచుకొని కూచోవటం వంటివి తేలికగా చేస్తున్నామంటే అంతా మోకీళ్ల చలవే. వీటి నిర్మాణం నిజంగా అద్భుతమే. పైనుంచి వచ్చే తుంటి ఎముక, పాదం నుంచి వచ్చే కింది ఎముక.. రెండూ మోకాలి దగ్గర కలుస్తాయి. ఇవి రెండూ ఒకదానికి మరోటి రుద్దుకోకుండా ఎముకల చివర్లోని మృదులాస్థి (కార్టిలేజ్‌).. ఎముకల మధ్యలోని మినిస్కస్‌ అనే మందమైన పొర తోడ్పడుతుంటాయి. శరీర బరువును, ఒత్తిడిని చాలావరకూ ఈ మృదులాస్థి, మినిస్కస్‌ పొరలే తీసుకుంటాయి. అయితే ఇవి ఎప్పటికీ అలాగే ఉండిపోవు. వయసు మీద పడుతున్నకొద్దీ అరిగిపోతుంటాయి. దీంతో మోకాలు కదిలినప్పుడల్లా ఎముకలు రెండూ ఒకదాంతో ఒకటి రుద్దుకుంటూ విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. మోకీళ్ల నొప్పులకు (ఆస్టియో ఆర్థ్రయిటిస్‌) ఇదే మూలం. ఒకప్పుడు మోకాళ్ల నొప్పులంటే వృద్ధాప్య సమస్యే. ఇప్పుడు చిన్నవయసులోనే దాడిచేస్తోంది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటినవారిలో సుమారు 20% మందిలో మోకీళ్లు అరిగిపోతుంటాయి. ఆ తర్వాత వయసు పెరుగుతున్నకొద్దీ అరిగిపోవటమూ ఎక్కువవుతుంటుంది. కానీ ఇప్పుడు 45, 50 ఏళ్లలోనే ఎంతోమంది మోకీళ్ల నొప్పుల బారినపడుతుండటం గమనార్హం.
చిన్నవయసులోనే మోకీళ్ల నొప్పులు దాడిచేస్తుండటానికి ప్రధాన కారణాలు మారిపోతున్న జీవనశైలి, ఊబకాయం. మన శరీరం చాలా అద్భుతమైంది. కండరాలు, ఎముకల మీద ఒత్తిడి పడుతున్నకొద్దీ దాన్ని తట్టుకోవటానికి అవసరమైన సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువ. తిని కూచోవటం తక్కువ. అందువల్ల సహజంగానే కండరాలు, ఎముకలు బలంగా ఉండేవి. మరిప్పుడో? శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. కూచొని చేసే పనులు పెరిగిపోయాయి. ఫలితంగా మోకాలి కండరాలు, కీళ్లను పట్టుకునే కండర బంధనాలు పట్టు కోల్పోతున్నాయి. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, బరువును మోసే శక్తి కొరవడుతున్నాయి. అంతేకాదు- ఊబకాయం, అధిక బరువు కూడా చిన్న వయసు నొప్పులకు దారితీస్తున్నాయి. సరైన శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే ఒళ్లు బరువెక్కుతుందనటంలో సందేహం లేదు. దీనికి తోడు కొవ్వు పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ తినటమూ పెరిగిపోయింది. ఇలాంటివన్నీ అధిక బరువు, ఊబకాయానికి దోహదం చేస్తున్నాయి. బరువు పెరిగినకొద్దీ మోకీళ్ల మీదా ఒత్తిడి ఎక్కువవుతుంది. ఫలితంగా మృదులాస్థి కూడా త్వరగా అరగటం ఆరంభిస్తుంది. కొందరిలో వంశపారంపర్యంగానూ మోకీళ్లు అరిగిపోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడో, దెబ్బలు తగిలినప్పుడో సరైన చికిత్స తీసుకోకపోవటంతోనూ మోకాలి ఎముకల మధ్య సమతుల్యత దెబ్బతిని మృదులాస్థి అరిగే ప్రమాదముంది. కీళ్లవాతం, గౌట్‌ వంటి సమస్యలూ కొందరికి మోకీళ్ల నొప్పులకు దారితీయొచ్చు. అందువల్ల చిన్నవయసులో మోకీళ్ల నొప్పులు తలెత్తితే ఇతరత్రా సమస్యలేవీ లేవని నిర్ధరించుకోవటం చాలా అవసరం.
కారణమేదైనా మృదులాస్థి ఒకసారి క్షీణించిందంటే దానంతటదే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యం.
ఎప్పుడు సమస్యాత్మకం?
ఎప్పుడైనా కాస్త ఎక్కువదూరం నడవాల్సి వస్తే మోకీళ్లు నొప్పి పుట్టటం మామూలే. కండరాల మీద, ఎముకల మీద ఒత్తిడి పడటం మూలంగా వచ్చే ఇలాంటి నొప్పులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. వీటికి భయపడాల్సిన పనేమీ లేదు. కానీ తరచుగా, అదీ తక్కువ దూరానికే నొప్పి వస్తుంటే మాత్రం సందేహించాల్సిందే. నడవటం ఆపేస్తే నొప్పి తగ్గిపోతుండటం.. ఇంతకుముందు 2 కిలోమీటర్లు నడిస్తే వచ్చే నొప్పి ఇప్పుడు అర కిలోమీటరు దూరానికే రావటం.. రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడూ నొప్పి ఇబ్బంది పెడుతుండటం.. మోకీళ్లు పట్టేస్తుండటం.. వాపు వంటివి గమనిస్తే ఏమాత్రం తాత్సారం చేయరాదు. లక్షణాలు- ఎన్నెన్నో
నొప్పి: మొదట్లో ఎప్పుడైనా ఎక్కువ దూరం నడిచినప్పుడో, మెట్లు ఎక్కుతున్నప్పుడో, కింద కూచొని లేచినప్పుడో నొప్పి వస్తుంటుంది. తర్వాత కాస్త దూరం నడవగానే నొప్పి మొదలవుతుంది. మెట్లు ఎక్కటం, దిగటం కష్టమవుతుంది. చివరికి ఏం చేయకపోయినా, విశ్రాంతి తీసుకుంటున్నా నొప్పి బాధిస్తుంది. కొందరికి రాత్రి పూటా నొప్పి వేధిస్తుంటుంది. దీంతో నిద్ర కూడా దెబ్బతింటుంది. క్రమంగా నొప్పి మాత్రలు వేసుకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి తలెత్తుతుంది.
వాపు: సమస్య ఆరంభంలో అప్పుడప్పుడు వాపు వస్తుంది, కొద్దిరోజులకు తగ్గిపోతుంది. ముదురుతున్నకొద్దీ వాపు తగ్గకుండా అలాగే ఉండిపోతుంటుంది.
కిరకిర చప్పుడు: కొందరికి కూచున్నప్పుడు, లేచినప్పుడు కిరకిరమంటూ చప్పుడు రావొచ్చు. మృదులాస్థి అరిగిపోయినప్పుడు అక్కడ ఎముక బయటపడుతుంది. దీంతో ఎముకలు రాసుకుపోయి చప్పుడు వస్తుంది. అయితే కిరకిరమని చప్పుడు ఉన్నంత మాత్రాన మోకీళ్ల అరుగుదలగా భావించాల్సిన పనిలేదు. కొందరికి మామూలుగానే కూచున్నప్పుడు, లేచినప్పుడు మోకీళ్లు చప్పుడు చేస్తుంటాయి. చప్పుడుతో పాటు నొప్పి, వాపు కూడా ఉంటేనే సమస్యగా భావించాలి.
వంకర పోవటం: మృదులాస్థి ఒకపక్క బాగా అరిగిపోతే కీలు వంకర పోవచ్చు. దీంతో బరువు సరిగా పడక ఒకవైపునకు ఒరిగి నడుస్తుంటారు.
బిగుసుకుపోవటం: మొదట్లో నిద్రలేచిన వెంటనే మోకీళ్లు బిగుసుకుపోయినట్టు, పట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. కాస్త అటూఇటూ కదిలించటం వంటివి చేస్తే తిరిగి కుదురుకుంటాయి. క్రమంగా కూచోవాలన్నా, లేవాలన్నా వంగకుండా తయారవుతాయి. దీంతో కుర్చీలో, కారులో కూచోవాలన్నా.. వంగాలన్నా ఇబ్బంది పడతారు.
వేడి: సమస్య తీవ్రమైతే మోకీళ్లు వేడిగానూ ఉండొచ్చు.
పరీక్షలు
ముందు ఆయా లక్షణాలను, ఇబ్బందులను నిశితంగా పరిశీలించటం చాలా అవసరం. నొప్పి ఒక కాలిలో ఉందా? రెండు కాళ్లలోనా? ఎంత దూరం నడిస్తే వస్తోంది? ఎన్నిరోజుల నుంచి వస్తోంది? ఎంత తీవ్రంగా ఉంది? రాత్రిపూట కూడా నొప్పి పుడుతోందా? విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందా? రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతోందా? మెట్లు ఎక్కటానికి వీలవుతోందా? కూచొని లేవగలుగుతున్నారా? చప్పుడు వస్తోందా? ఏవైనా మందులు వేసుకుంటున్నారా? ఎంత తరచుగా మందులు వేసుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలతోనే సమస్య ఏంటనేది చాలావరకు తేలిపోతుంది. తర్వాత నడక ఎలా ఉంది? ఒకవైపునకు ఒరిగిపోతున్నారా? కుంటుతున్నారా? అనేది చూస్తారు. అలాగే మోకీళ్ల మీద చేయి పెట్టి కీలు ఎలా ఉంది? ఎలా కదులుతోంది? చప్పుడేమైనా వస్తోందా? వంకర పోయిందా? నొప్పి ఎక్కడెక్కడ్నుంచి మొదలవుతోంది? అనేది పరిశీలిస్తారు. ఇవన్నీ సమస్యపై ఒక అంచనాకు రావటానికి తోడ్పడతాయి. ఎక్స్‌రే: మోకీళ్లు అరిగిపోయినట్టు అనుమానిస్తే ఎక్స్‌రే తీస్తారు. ఇందులో ఎముక అరిగిపోవటం, వంకరపోవటం వంటివన్నీ బయటపడతాయి.
ఎంఆర్‌ఐ: ఎక్స్‌రేలో ఎముకలకు సంబంధించిన అంశాలే తెలుస్తాయి. మృదులాస్థి, కండర బంధనాలు, మెనిస్కస్‌ ఎలా ఉన్నాయనేవి కచ్చితంగా తెలియవు. అందువల్ల అవసరమైతే కొందరికి ఎంఆర్‌ఐ కూడా చేయాల్సి ఉంటుంది.
రక్త పరీక్షలు: ఇవి రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, గౌట్‌ వంటివి గుర్తించటానికి తోడ్పడతాయి.
ఆర్థ్రోస్కోపీ: అరుదుగా ఆర్థ్రోస్కోపీ అవసరపడొచ్చు. ఇందులో మోకీలులోకి గొట్టం లాంటిది పంపించి ఎలా ఉందో చూస్తారు. మృదులాస్థి అరుగుదల తొలిదశలోనే ఉన్నా గుర్తించొచ్చు. కండర బంధనాలు బెణికినా ఇందులో బయటపడుతుంది.
ఒకసారి మృదులాస్థి క్షీణించటం మొదలైతే తిరిగి మామూలు స్థాయికి రావటం కష్టం. కాబట్టి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
బరువు అదుపు: మోకీళ్లకు బరువు పెద్ద శత్రువు. బరువు పెరిగినకొద్దీ కీళ్ల మీద భారం ఎక్కువవుతుంది. ఫలితంగా మృదులాస్థి త్వరగా అరిగిపోయే ప్రమాదముంది. కాబట్టి ముందు నుంచే బరువు పెరగకుండా చూసుకుంటే మోకీళ్ల నొప్పులు తలెత్తకుండా చూసుకోవచ్చు. కాబట్టి సమతులాహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. వ్యాయామాలతో మరో ప్రయోజనం ఎముకలకు దన్నుగా నిలిచే కండరాలు, కండర బంధనాలు కూడా బలోపేతమవటం.
ఇతర సమస్యలకు చికిత్స: కీళ్లవాతం, గౌట్‌ వంటి సమస్యలేవైనా ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ముదిరిపోయి ఒకసారి కీళ్లు దెబ్బతింటే తిరిగి కుదురుకోవటం అసాధ్యం. అవి శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి. కీళ్లవాతం, గౌట్‌లకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటుంటే సమస్య ముదరకుండా చూసుకోవచ్చు.
చికిత్స బరువు తగ్గటం, వ్యాయామం ప్రధానం
అధిక బరువు, ఊబకాయం తగ్గించుకోవటం చాలా కీలకం. ఒక కిలో బరువు తగ్గినా మోకీళ్ల మీద సుమారు 5 కిలోల భారాన్ని తగ్గించుకున్నట్టే. కాబట్టి సమతులాహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయటం అత్యవసరం. నడిస్తే నొప్పి పుడుతోందని భావిస్తే వ్యాయామ సైకిల్‌ తొక్కొచ్చు. ఈత కొడితే ఇంకా మంచిది. వీటితో పాటు డాక్టర్లు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తారు. ఇవి మోకీళ్లకు దన్నుగా నిలిచే కండరాలను బలోపేతం చేస్తాయి. దీంతో కీళ్లపై భారం తగ్గుతుంది, కదలికలూ మెరుగవుతాయి. మృదులాస్థి అప్పుడప్పుడే అరగటం ఆరంభమైనవారికి కీళ్లు జారిపోకుండా చూసే పట్టీలు కూడా బాగా ఉపయోగపడతాయి.
నొప్పి మందులు: ముందు మామూలు నొప్పి మందులతోనే ఫలితం కనబడుతుంది. వీటితో ఉపశమనం లభించకపోతే డ్లైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు ఇస్తారు. అయితే ఇవి ఛాతీలో మంట, అల్సర్ల వంటి దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. కాబట్టి దీర్ఘకాలం వాడుకోవటం మంచిది కాదు. నిపుణుల సలహా మేరకే తీసుకోవాలి.
గ్లూకోజమైన్‌ మాత్రలు: ఇవి మోకీళ్లలో జిగురుద్రవం ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి. మృదులాస్థి బలోపేతమవుతుంది.
ఆర్థ్రోస్కోపీ క్లీనింగ్‌: మాత్రలు వేసుకుంటున్నా, ఫిజియోథెరపీ చేస్తున్నా, పట్టీలు ధరిస్తున్నా ఫలితం కనబడకపోతే ఆర్థ్రోస్కోపీ ద్వారా మృదులాస్థి ఉపరితలాన్ని శుభ్రం చేస్తారు. పెచ్చులేవైనా లేస్తే తొలగిస్తారు. దీంతో కదలికలు మెరుగువుతాయి. నొప్పి, వాపు నుంచి తాత్కాలింగా ఉపశమనం లభిస్తుంది.
జిగురుద్రవం: కీళ్లలో హైలురోనిక్‌ యాసిడ్‌ అనే జిగురుద్రవం ఎముకలు రాసుకుపోకుండా కందెనలాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అవసరమైతే దీన్ని ఇంజెక్షన్‌ రూపంలో నేరుగా కీళ్లలోకి ఇస్తారు.
ఎముకను సరిచేయటం: దీన్నే ఆస్టియోటమీ అంటారు. దెబ్బతిన్న మృదులాస్థి మీద బరువు ఎక్కువగా పడకుండా ఎముక అమరిక సహజసిద్ధంగా ఉండేలా సరి చేయటం దీని ప్రత్యేకత. ఇందులో మోకాలి కింది ఎముకకు ఒకవైపున గాటు పెట్టి.. అవసరమైన మేరకు కత్తిరించటమో.. ఎముకను జోడించటమో చేస్తారు. తర్వాత ప్లేట్‌, స్క్రూలతో బిగిస్తారు. దీంతో దెబ్బతిన్న మృదులాస్థి మీద బరువు పడటం తగ్గి, నొప్పి తగ్గుతుంది. మున్ముందు మృదులాస్థి అరిగిపోకుండానూ ఉంటుంది. అరిగిపోయిన భాగం తిరిగి కోలుకోవటానికీ వీలుంటుంది. మోకీలు మార్పిడితో పోలిస్తే ఇది తేలికైంది. పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. ఖర్చు కూడా తక్కువే. అందుకే చిన్న వయసులో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా దీన్ని సూచిస్తున్నారు. ఇటీవల ఇది ఎక్కువగానే ప్రాచుర్యం పొందుతోంది.
మోకీలు మార్పిడి: ఇతరత్రా చికిత్సలతో ఫలితం కనబడపోతే.. చివరి ప్రయత్నంగానే మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. అయితే ఇది పెద్ద ఆపరేషన్‌. ఇన్‌ఫెక్షన్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. కృత్రిమ కీలు కొంతకాలానికి అరిగిపోతుంది కూడా. అందువల్ల వీలైనంతవరకు అరవై ఏళ్ల లోపువారికి దీన్ని చేయకపోవటమే మంచిది. 50 ఏళ్ల వయసులో శస్త్రచికిత్స చేయించుకున్నారనుకోండి. ఉద్యోగాలు, పనులతో చురుకుగా ఉంటారు. దీంతో కృత్రిమ కీలు అరిగిపోయి తిరిగి 70 ఏళ్ల వయసులో మళ్లీ మార్పిడి చేయాల్సి రావొచ్చు. అదే అరవై, డెబ్బై దాటితే అంత ఎక్కువ చురుకుగా ఉండరు. అప్పుడు మోకీలు మార్పిడి చేయించుకుంటే కీలు మీద అంత ఒత్తిడి పడదు. దీంతో ఎక్కువకాలం మన్నుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒత్తిడిని తట్టుకొని ఎక్కువకాలం మన్నే పరికరాలూ అందుబాటులోకి వచ్చాయి. కీలు ఫిక్సేషన్‌ పద్ధతులు, డిజైన్‌ కూడా మెరుగయ్యాయి. కాకపోతే అన్ని సదుపాయాలు గల ఆసుపత్రిలో, మంచి అనుభవం గల డాక్టర్లతోనే చేయించుకోవాలి. అరకొరగా ఆపరేషన్‌ చేస్తే ఇన్‌ఫెక్షన్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అమరిక ఒక డిగ్రీ అటూఇటూ అయినా కీలు త్వరగా అరిగిపోతుంది.
పునరుత్తేజిత చికిత్సలు
వీలైనంతవరకు సహజ కీలును అలాగే ఉంచి.. మృదులాస్థిని తిరిగి కోలుకునేలా చేయటంపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అందుకే మృదులాస్థిని పునరుత్తేజితం చేసే (రీజనరేటివ్‌) చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
ప్లేట్‌లెట్‌ రిచ్డ్‌ ప్లాస్మా చికిత్స: ఇందులో నొప్పితో బాధపడుతున్నవారి నుంచి 30-40 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి దానిలోంచి ప్లేట్‌లెట్లు దండిగా ఉండే 3-4 మిల్లీలీటర్ల ప్లాస్మా ద్రవాన్ని వేరుచేస్తారు. దీన్ని సూది ద్వారా మోకీళ్లలోకి ప్రవేశపెడతారు. ప్లేట్‌లెట్లలో కణజాలాన్ని వృద్ధి చేసే కారకాలు (గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌) దెబ్బతిన్న మృదులాస్థి పునరుత్తేజితమయ్యేలా ప్రేరేపిస్తాయి. అరుగుదల తొలిదశలో ఉన్నవారికిది బాగా ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
మూలకణ చికిత్స: మూలకణాలు మృదులాస్థి కణాలుగా మారిపోయి దెబ్బతిన్న భాగం మరమ్మతు కావటానికి తోడ్పడతాయి. ఈ చికిత్సపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని పద్ధతులు అందుబాటులోకీ వచ్చాయి. కటి ఎముక లోపలి నుంచి మజ్జను తీసి, మూలకణాలను వేరుచేసి నేరుగా మోకీలులోకి ఎక్కించటం ఒక పద్ధతి. అయితే దీంతో ఒనగూడే ఫలితాలకు శాస్త్రీయంగా నిరూపణ లేదు. మూలకణాలను ప్రయోగశాలలో పెద్దసంఖ్యలో వృద్ధి చేసి మోకీలులోకి ప్రవేశపెట్టటం మరో పద్ధతి. ఇది బాగా ఉపయోగపడుతుంది గానీ దీన్ని నిర్వహించటానికి మనకింకా అనుమతి లభించలేదు. మూలకణాలను పూతగా చేసి మృదులాస్థి పెచ్చులు ఊడినచోట పూయటం మరో పద్ధతి. దీంతో మరింత మంచి ఫలితం కనబడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీర బరువును, ఒత్తిడిని చాలావరకు మృదులాస్థి, మినిస్కస్‌ పొరలే తీసుకుంటాయి. ఇవి వయసు మీద పడుతున్నకొద్దీ క్షీణిస్తుంటాయి. మోకీళ్ల నొప్పులకు మూలమిదే బరువు, నడక వేగం పెరిగినకొద్దీ మృదులాస్థి మీద ఒత్తిడీ పెరుగుతుంది. అందువల్ల మృదులాస్థి దెబ్బతింటే అడుగు వేయటమే గగనమైపోతుంది
అరవై కిలోల బరువున్న వ్యక్తి 6 కి.మీ. వేగంతో నడిస్తే మృదులాస్థి మీద 90 కిలోల ఒత్తిడి పడుతుంది. అదే వేగంగా నడిస్తే, పరుగెడితే ఈ ఒత్తిడి 360 కిలోలకు చేరుకుంటుంది. అయినా కూడా మృదులాస్థి దాన్ని సమర్థంగానే తట్టుకుంటుంది. కానీ క్షీణిస్తే మాత్రం తట్టుకోలేక చతికిలపడి పోతుంది!