డా. ఎం.వి.చలపతిరావు, ఛీఫ్ కన్సల్టంట్, రేడియాలజిస్ట్, కిమ్స్, సికింద్రాబాద్
ట్రాఫిక్ సజావుగా సాగాలంటే ఎప్పుడూ ఒకేవైపు సాగాలి. వాహనాలు ఎదురు రాకూడదు. అలా వస్తే ట్రాఫిక్ అస్తవ్యస్తం. మన శరీరంలోని రక్తం కూడా ట్రాఫిక్‌లాగే సజావుగా ఒకేవైపు వెళ్ళే ఏర్పాటును ప్రకృతి చేసింది. రక్తనాళాల్లోని రక్తం ఎదురు వెళ్ళకుండా ట్రాఫిక్ పోలీసుల్లాంటి వాల్వ్స్ ఏర్పాటుచేసింది. ఒకవేళ ఆ రక్తనాళాల్లోని ఆ వాల్వ్స్ సరిగ్గా పనిచేయనప్పుడు రక్తం ఎదురు ప్రయాణం చేస్తే....? అక్కడి రక్తనాళాలు ఉబ్బుతాయి. ఆ శరీరభాగాల్లో నొప్పి వస్తుంది. 'వేరికోస్ వెయిన్స్'గా పిలిచే ఈ సమస్యకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
శరీరంలోని ప్రతి భాగానికి గుండె నుంచి రక్తం పంప్ అవుతుంది. శుభ్రమైన రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాలను ధమనులు అంటారు. అలాగే అన్ని శరీర భాగాల నుంచి గుండెకు చెడురక్తం చేరుకుంటుంది. వీటిని తీసుకెళ్ళే రక్తనాళాలను సిరలు అంటారు. అయితే మన శరీరంలోని మంచి రక్తాన్ని తీసుకెళ్ళే ధమనులు బయటకు కనిపించవు. కేవలం సిరలే ఉబ్బినట్లుగా బయటకు కనిపిస్తాయి. ఇక ఇందులోని వాల్వ్స్ పనిచేయనప్పుడు రక్తం వెళ్ళాల్సిన దిశలో పూర్తిగా వెళ్ళకపోవడంతో అవి ఉబ్బినట్లుగా అవుతాయి. జిగ్‌జాగ్‌గా మెలికలు తిరిగినట్లుగానూ కనిపిస్తాయి. ఈ కండిషన్‌నే వెరికోస్ వెయిన్స్ అంటారు.
శరీరంలోని మిగతా భాగాల్లోనూ ఈ సిరలు ఉబ్బినట్లుగా కావడం సహజమే అయినా కాళ్ళల్లోనూ ఈ సిరలు ఉబ్బినట్లుగా కావడం సహజమే. అయినా కాళ్ళల్లో ఇది మరీ ఎక్కువ. కాళ్ళల్లో ఉబ్బినట్లుగా కనిపించే రక్తనాళాలను వెరికోస్‌వెయిన్స్ అని, మిగతా శరీర భాగాల్లో ఇదే సమస్య ఉంటే వెరికోసిస్ అని పిలుస్తారు.
.
వేరికోస్ వెయిన్స్ సమస్య నిలబడి పనిచేసే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలోని మిగతా రక్తనాళాల్లోనూ ఈ సమస్య వచ్చేందుకు అవకాశాలున్నా ఇది కాళ్ళలోనే ఎక్కువ. ఎందుకంటే కాళ్ళ నుంచి గుండెకు చెడురక్తం వెళ్ళాలంటే 'భూమ్యాకర్షణశక్తి'కి వ్యతిరేకంగా, బలంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా నిత్యం పనిచేసే క్రమంలో సిరల్లోని వాల్వ్స్ కొన్ని సార్లు బలహీనం అయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో మొత్తం పంప్ అవ్వాల్సిన రక్తంలో కొంత భాగం సిరల్లోనే ఉండిపోవడం వల్ల అవి ఉబ్బినట్లుగా, మెలికలు తిరిగినట్లుగా అవుతాయి. అక్కడి శరీరభాగాల వాపు, నొప్పి, నిలబడలేకపోవడం, సమస్య మరీ తీవ్రమైన కొన్ని సందర్భాల్లో కాలికి పుండు పడడం వంటి సమస్యలు వస్తాయి.
మహిళల్లో ఎక్కువ....
వెరికోస్‌వెయిన్స్ సమస్య అందిరిలోనూ కనిపించినా పురుషులతో పోలిస్తే మహిళల్లో అవి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగా రావడం, గర్భధారణ, బరువు పెరగడం, రుతుస్రావం ఆగిపోవడం (మెనోపాజ్) వంటి కారణాలతో స్త్రీలతో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
చికిత్స :
1. శస్త్రచికిత్స : గాటు ఎక్కువగా ఉండే సెఫానస్ స్ట్రిప్పింగ్, గాటు తక్కువగా ఉండే ఫ్లెబక్టమీ
2. కెమికల్ : స్క్లెరోథెరపీ
3. థర్మల్ : ఆర్.ఎఫ్.ప్రక్రియ, ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్
4. మైక్రోఫ్లెబెక్టమీ శస్త్రచికిత్స : శస్త్రచికిత్సలో భాగంగా చెడిపోయిన సిరలను తొలగిస్తారు. రక్తం క్రమంగా ఎదురు ప్రవహించడటంతో ఈ సిరలు తమ విధులను నిర్వహించలేవు. దాంతో ఆ బాధ్యతలను పక్కనే ఉండే మరికొన్ని సిరలు స్వీకరిస్తాయి. అందువల్ల చెడిపోయిన సిరలను సర్జికల్‌గా తొలగిస్తారు. శస్త్రచికిత్సల్లో సాంప్రదాయకంగా ఎక్కువ గాటు అవసరమైన సెఫినస్ స్ట్రిప్పింగ్, గాటు తక్కువగా ఉంటే ఫ్లెబెక్టమీ ఆపరేషన్స్ వంటివి చేస్తారు.
స్క్లెరో థెరపీ : శస్త్రచికిత్సల అవసరం లేకుండా కొన్ని రకాల మందుల సహాయంతో చెడిపోయిన సిరలు కుంచించుకుపోయేలా చేసే ప్రక్రియను స్ల్కెరోథెరపీ అంటారు. ఇలా సిరలు కుచించుకుపోయేలా చేసే రసాయనాలను స్ల్కెరో సాంట్స్ అంటారు.
లక్షణాలు :
రక్తనాళాలు బాగా ఉబ్బినట్లుగా కావడం, మెలికలు తిరిగినట్లు చర్మంలోంచి బయటకు కనిపించడం, కాళ్ళవాపు, నొప్పి, బరువుగా అనిపించడం, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, కాళ్ళపై ఉన్న చర్మం రంగు కోల్పోవడం, కాళ్ళపైన దురద, రాత్రివేళల్లో కాళ్ళ కండరాలు బిగుసుకుపోయినట్లుగా కావడం, కాళ్ల పైన కొన్ని చోట్ల చర్మంపై పుండ్లు పడడం, ప్రధానంగా మడమ భాగంలో ఈ సమస్య ఎక్కువ. ఈ పుండ్లను వెరికోస్ అల్సర్స్ అంటారు. వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రాంతంలో ముట్టుకుంటే బాధాకరం (టెండర్)గా అనిపించవచ్చు.
ప్రమాదాలు : వీటికి చికిత్స చేయించకుండా వదిలేస్తే కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో పుండ్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చిన్న చిన్న దెబ్బలకు కూడా ఆగకుండా రక్తస్రావం కావచ్చు.
ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ :
ఇది థర్మల్ ప్రక్రియల్లో భాగంగా చేసే అధునాతన చికిత్స. చిన్న ఇంజెక్షన్‌లా సిరల్లోకి సూదిని పంపి లేజర్ సహాయంతో అక్కడ చెడిపోయిన సిరను పూర్తిగా దహించుకుపోయేలా చేస్తారు.
సంప్రదాయ సర్జికల్ ప్రక్రియలో స్పైనల్ లేదా జనరల్ అనస్థీసియా ఇవ్వడం సాధారణమే. అందులో చెడిపోయిన సిరలను తొలగించుకుంటూ వచ్చే క్రమంలో కొన్నింటిని గుర్తించడం సాధ్యం కాకపోవడంతో వదిలేయడం కూడా పరిపాటి. అయితే ఎండోవీనస్ లేజర్‌లో అల్ట్రాసౌండ్ సహాయంతో సిరలను నిత్యం గమనించుకుంటూ లేజర్ సహాయంతో దహించుకుపోయేలా చేస్తూ సిరలను మూసివేస్తారు. కాబట్టి చెడిపోయిన కొన్ని సిరలను వదిలేసేందుకు ఆస్కారమే ఉండదు.
సాధారణ సంప్రదాయ సర్జరీలో ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరడం అవసరం. కానీ... ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ థెరపీలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. కేవలం కొద్దిసేపు మాత్రమే పట్టే (డే-కేర్) చికిత్సతో ఈ ప్రొసీజర్ నిర్వహిస్తారు.
సాంప్రదాయికంగా జనరల్ సర్జరీ ద్వారా చేసే ఆపరేషన్‌లో వెన్నెముకకు మత్తు ఇవ్వడం (స్పైనల్ అనస్థీషియా), పూర్తిగా మత్తు ఇవ్వడం (జనరల్ అనస్థీషియా) ఇస్తారు. కానీ లేజర్ ద్వారా చేసే చికిత్సలో స్థానికంగా ఇచ్చే అనస్థీషియా (లోకల్ అనస్థీషియా) తప్ప పూర్తి మత్తు కానీ, స్పైనల్ అనస్థీషియా కాని అవసరం ఉండదు.
సర్జరీ ద్వారా వెరికోస్ వెయిన్స్‌ను తొలగించిన సందర్భాల్లో కొన్నిసార్లు కొన్నేళ్ళ తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చి మునుపటి సమస్య పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ... ఎండోవీనస్ లేజర్ థెరిపీతో ఆ సమస్య ఉండదు. సక్సెస్ రేటు చాలా ఎక్కువ.
ఎండోవీనస్ లేజర్ చికిత్స పూర్తయిన వెంటనే వాళ్ళ పనులను, దినచర్యలను వెంటనే మొదలుపెట్టవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా బెడ్‌రెస్ట్ అవసరం లేదు.