header

Liver….లివర్..కాలేయం...

Liver….లివర్..కాలేయం...

డా॥ కిరణ్ పెద్ది, కన్సల్టెంట్‌, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, గ్లోబల్‌ హాస్పటల్‌, హైదరాబాద్‌
శరీరంలోని ఏ ఇతర భాగానికి సమస్య వచ్చినా కాస్త ముందే జాగ్రత్త పడతాం. కానీ, కాలేయం విషయంలో చాలాసార్లు నిర్లక్ష్యంగానే ఉండిపోతాం. లివర్‌ సిర్రోసిస్‌ వంటి ఏ తీవ్ర సమస్యో మొదలయ్యాక గుండె బాదుకునే కన్నా, ముందే జాగ్రత్తపడితే ఆ సమస్యలు చాలా వరకు దరిచేరవు. శరీరంలో అతి కీలకమైన కాలేయాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ కిరణ్‌ పెద్ది.
కాలేయ సమస్య అక్యూట్‌ అని, క్రానిక్‌ అనీ రెండు రకాలు. అక్యూట్‌ సమస్య తొలిదశలోనే బయటపడితే, క్రానిక్‌ సమస్యలు ఎప్పుడో చాలా ఆలస్యంగా బయటపడతాయి. అప్పటి దాకా ఏ సమస్యా లేని కాలేయం. ఏ వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వలనో, నీటితో సంక్రమించే ఏ వ్యాధుల కారణంగానో హఠాత్తుగా దెబ్బతిని పోవడాన్ని అక్యూట్‌ సమస్య అంటారు. ఈ తరహా సమస్యకు ఎక్కువగా హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌ -ఇ, సమస్యలే కారణంగా ఉంటాయి. కొన్నిసార్లు హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌ -సి కూడా తీవ్రమైన దుష్ప్రభావాన్నే చూపుతాయి.
హెపటైటిస్‌ సమస్యల్లో ప్రధానంగా కామెర్ల వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. అంతకన్నా ముందు ఆకలి లేక పోవడం, ఒంటినొప్పులు, ఎడతెరిపి లేకుండా జ్వరం, మూత్రం పసుపు రంగులో నుండి తెలుపు రంగులోకి మారడం కనిపిస్తుంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే కాలేయ సంబంధిత ఏ సమస్య ఉన్నా బయటపడుతుంది. కారణం స్ఫష్టంగా తెలిసి, ఆ తరువాత సరైన వైద్య చికిత్స అందిస్తే, వ్యాధి లక్షణాలే కాదు వ్యాధి కూడా పూర్తిగా నయమై పోయే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు బయటికి ఏ ఒక్క లక్షణం కనిపించకుండానే కాలేయం దెబ్బతింటూ వెళుతుంది. మామూలుగా అయితే ఒక్కొక్కసారి కాలేయం సగానికి పైగా దెబ్బతినే దాకా ఏమీ తెలియకపోవచ్చు. అనుకోకుండా మరేదో పరీక్ష కోసం వెళ్లినప్పుడు సమస్య తెలిసిపోవడం తప్ప మామూలుగా అయితే తెలిసే అవకాశమే ఉండదు. అయితే పరిస్ధితి అక్కడి దాకా వెళ్ళకుండా ముందే గుర్తించే అవకాశాలున్నాయి. కొన్ని రకాల జబ్బులు కాలేయాన్ని దెబ్బతీసే కొన్ని అలవాట్ల విషయాల్లో జాగ్రత్త పడటమే అందుకు మార్గం. అంటే అతిగా మద్యం సేవించడం, స్ధూలకాయం, రక్తపోటు, మధుమేహం ఉన్నవారు కొలస్ట్రాల్‌ ఉన్నవారు ఎక్కువగా కాలేయం దెబ్బతినే పరిస్ధితిలో పడిపోతారు. అలాంటి వారంతా ఏటా ఒకసారి లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ ఆల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.
ఇలా చేయడం వల్ల కాలేయం సగానికి పైగా దెబ్బతినే దాకా ఉండిపోకుండా ముందే జాగ్రత్త పడే అవకాశాలుంటాయి. కొందరిలో కాలేయం నిదానంగా దెబ్బతింటూ ఎప్పుడో చాలా ఆస్యంగా బయటపడుతుంది. ఇది ఎక్కువగా చాలా కాలంగా కామెర్ల వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తుంది. చాలాకాలంగా కాళ్ల వాపున్నవారు, పొట్ట ఉబ్బిపోవడం వంటి లక్షణాలతో బయటపడుతూ ఉంటారు.
మరికొందరిలో రక్తవాంతులు కావడం ద్వారా బయటపడుతుంది. ఈ లక్షణాలు కనిపించిన వారంతా కాలేయ సమస్యగా అనుమానించి వైద్యనిపుణులను సంప్రదించాలి. అంటే లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధి మొదలయ్యాకో లేదా వ్యాధికి చాలా దగ్గరగా ఉన్నప్పుడో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
నియంత్రణ, నివారణ : సిర్రోసిస్‌ తాలూక దుష్ప్రభావాలను నియంత్రించడం చాలా ప్రధానం. అప్పటికే కాలేయం దెబ్బతిని వుంటే ముందు ముందు మరింత దెబ్బతినకుండా అవసరమైన వైద్యచికిత్స అందించడం మరొకటి. ఈ రెండు వెంటవెంటనే చేయాలి. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతినిపోతే లివర్‌ మార్పిడి చేయడం తప్ప మరేమి చేయలేము. ఒకవేళ మద్యం తాగడం వలన కొంతమేర కాలేయం దెబ్బతినివుంటే వెంటనే మద్యం తీసుకోవడం మానేస్తే దెబ్బతిన్న కాలేయం తిరిగి చక్కబడే అవకాశాలు కూడా కొంతమేర ఉంటాయి. ఈ విషయం ఎలా వున్న ఇక ముందు మరింత దెబ్బతినే పరిస్ధితి మాత్రం లేకుండా అరికట్టవచ్చు.
స్ధూలకాయం, బరువు తగ్గించుకోవడం ద్వారా రక్తపోటు, మధుమేహం వ్యాధులను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా కాలేయ సమస్యల నుంచి బయటపడే అవకాశాలుంటాయి. ఏమైనా సమస్య బాగా ముదిరిపోకుండా అలాగే వుండి పోకుండా ముందే గుర్తించి చికిత్సకు తీసుకోవటంతో ఎక్కువ ప్రయోజనాలుంటాయి. తరుచూ పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే మార్గం.
క్రానిక్‌గా మారేముందు : కొందరిలో హెపటైటిస్‌ - సి గాని, హెపటైటిస్‌-బి గాని స్వల్పంగానే మొదలైవుండవచ్చు. అయితే ఈ వ్యాధి చికిత్సలో నిర్లక్ష్యంగా వుండిపోవడం లేదా వైద్య చికిత్సను మధ్యలోనే వదలివేయడం వంటి కారణాలు సమస్యను తీవ్రం చేస్తాయి. అది మెల్ల మెల్లగా ఎప్పుడో కాలేయంలో అధిక భాగం దెబ్బతిన్న తర్వాత ఎప్పుడో బయటపడవచ్చు. అలాగే స్ధూలకాయం, రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో కూడా బయటకు ఏ లక్షణం కనిపించకుండానే కాలేయం అధికభాగం దెబ్బతినిపోవచ్చు. అందుకే ఈ తరహా సమస్యలున్నవారు తరుచూ వైద్యపరీక్షలు చేయించుకోవటం ద్వారా సమస్య తీవ్రం కాకుండా నివారించవచ్చు.
కామెర్లు వ్యాధి కాదు : కాలేయం దెబ్బతినడానికి గల కారణాలు అనేకం. అయితే ఏకారణంగా దెబ్బతిన్న ఎక్కువ మందిలో కామెర్ల సమస్య వస్తుంది. మౌలికంగా కామెర్లు అనేవి ఏదో ఒక వ్యాధి లక్షణమే కాని అది వ్యాధి కాదు. కామెర్లు రావడానికి కారణమైన అసలు వ్యాధి వేరే ఏదో వుంటుంది. ఆ వ్యాధి ఏమిటో కనిపెట్టి దానికి వైద్య చికిత్స అందించాలి. కాలేయ క్యాన్సర్‌ మొదలైనప్పుడు కూడా కొందరిలో కామెర్లు కనపడవచ్చు. క్యాన్సర్ల వల్ల కాని, రాళ్ల వల్ల కాని, పిత్తనాళంలో ఆటంకం ఏర్పడినప్పుడు కూడా కామెర్ల సమస్య వస్తుంది. అలాగే క్లోమగ్రంధి క్యాన్సర్‌ బారిని పడినప్పుడు కూడా కామెర్ల సమస్య రావచ్చు. కామెర్లు అనేవి సాధారణ ఇన్ఫెక్షన్‌ వల్ల రావచ్చు. లేదా క్యాన్సర్ల వల్ల కూడా రావచ్చు. నిర్లక్ష్యం చేయకూడదు.
ఆహారమే లివర్‌కు భాగ్యం
1.మీరు తీసుకునే ఆహారం ఎంత తాజాగా వుంటే లివర్‌ అంత ఆరోగ్యంగా వుంటుంది. రసాయనాలతో పండించిన ఆహారం కాకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారం తీసుకుంటే మీ లివర్‌ పదిలం.
2.వేపుళ్లు, ప్రిజర్వేటివ్స్‌ వేసి నిల్వ చేసిన పదార్ధాలు మీ లివర్‌కు శత్రువు.
3.ఇంట్లో వండుకునే తాజా ఆహారం ఉత్తమం.
4.ఎడపెడా సొంత వైద్యం చేసుకుంటూ, చేతికందిన మందులు వేసుకుంటే మీ లివర్‌ పడకేస్తుంది.
5.శరీరంలో పేర్కొని పోయిన మాలిన్యాలను వ్యాయాయం, మసాజ్‌ ద్వారా తరుచూ తొలగిస్తూ పోతే మీ లివర్‌కు కాస్త విశ్రాంతి లభిస్తుంది.
6. ధూమపానానికి పూర్తిగా దూరంగా వుండాలి. మద్యపానం హద్దు మీరితే మొదట కూలిపోయేది మీ లివర్‌ అని గుర్తుంచుకోండి.
1. రక్తంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా వుండేవారు కొవ్వుపదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
2.కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటిలివర్‌ సమస్య అంటారు. అలాంటి వారు కూడా కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అది క్రమంగా లివర్‌ పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్‌ సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది.
3.ఫ్యాటి లివర్‌ సమస్య మధ్యం తీసుకునే వారిలోను, తీసుకోని వారిలోను వస్తుంది. అంతకుముందే కాళ్లవాపు, పొట్టవాపు, సిర్రోసిస్‌ వచ్చినవారు ఆహార పానీయాల్లో ఉప్పు అతి తక్కువగా తీసుకుంటే మంచిది.
4. కాచి వడపోసిన నీటిని కాని, ఫిల్టర్‌ నీటిని కాని త్రాగాలి. హెపటైటిస్‌ - ఎ , హెపటైటిస్‌ -బి ను నివారించే టీకాలు మాత్రమే ఉన్నాయి వాటిని విధిగా తీసుకోవాలి.