దశలను బట్టి చికిత్స
వూపిరితిత్తుల క్యాన్సర్‌లో ఆయా దశలను బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనో థెరపీల్లో ఎవరికి, ఏది పనికొస్తుందనేది నిర్ణయిస్తారు.
1, 2 దశల్లో..
* మొదటి, రెండో దశ కణితులకు శస్త్రచికిత్స ఉత్తమమైన పద్ధతి. ఇందులో కణితి ఏర్పడిన భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. అవసరమైతే ఒక భాగాన్ని (లోబ్), ఒక వూపిరితిత్తి మొత్తాన్ని కూడా తొలగించాల్సి రావొచ్చు. శస్త్రచికిత్సతో కణితిని తొలగించినప్పటికీ.. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన క్యాన్సర్ కణాలు ఛాతీలోనో, మరెక్కడో ఇంకా లోపలే ఉండిపోవచ్చు. ఇవి పెట్ స్కాన్‌లోనూ కనబడనంత చిన్నగానూ ఉండొచ్చు. ఒకవేళ క్యాన్సర్ కణాలు లోపల మిగిలిపోతే జబ్బు తిరగబెట్టే ప్రమాదముంది. అందువల్ల బయటకు తీసిన కణితిని పరిశీలించి.. జబ్బు తిరగబెట్టే అవకాశం ఎంత వరకు ఉందనేది అంచనా వేస్తారు. తిరగబెట్టే అవకాశం ఉంటే కీమో థెరపీ, రేడియో థెరపీ చేయాల్సి ఉంటుంది. కణితిని పూర్తిగా తొలగించటం సాధ్యం కానప్పుడు కొంత భాగం లోపలే వదిలేస్తుంటారు. ఇలాంటి వారికి కీమోతో పాటు రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
3వ దశలో..
* వీరికి ఒకే సమయంలో కీమోథెరపీ, రేడియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చు. కణితి ఏర్పడిన చోటు, సైజు, లింఫ్ గ్రంథుల ఉబ్బు వంటి వాటిని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. అయితే మూడో దశలో చికిత్స చేసినా క్యాన్సర్ నయమయ్యే అవకాశం 30% మాత్రమే. 70% మందిలో జబ్బు పూర్తిగా తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా మళ్లీ తిరగబెట్టొచ్చు.
4వ దశలో..
* నాలుగో దశలో క్యాన్సర్ నయం కావటం దాదాపు అసాధ్యం. అందువల్ల రోగికి ఇతరత్రా సమస్యలేవీ లేకుండా.. బతికినంతకాలం ఇంట్లో హాయిగా జీవించేలా చూసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో ‘టార్గెటెడ్ థెరపీ’ బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ క్యాన్సర్ కణాల మీదే కాదు. ఇతర కణాలపైనా ప్రభావం చూపుతుంది. దీంతో జుట్టు రాలటం, వాంతులు, రక్తకణాలు తగ్గటం, రోగనిరోధకశక్తి క్షీణించటం వంటి దుష్ఫలితాలు తలెత్తొచ్చు. అంటే చికిత్సతో ఒనగూడే ప్రయోజనం కన్నా సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముంది. కాబట్టి వీరికి టార్గెటెడ్ థెరపీయే మంచిది. ఇందులో క్యాన్సర్ వృద్ధి చెందటానికి కారణమవుతున్న ప్రోటీన్‌ను గుర్తించి, అది పనిచేయకుండా చేసే మాత్రలు ఇస్తారు. వీటిని వేసుకుంటూ రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. రెండు వారాల్లో దీని ప్రభావం కనబడుతుంది. పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. క్యాన్సర్ వృద్ధికి దోహదం చేస్తున్న ప్రోటీన్ల వంటివి కనబడనివారికి కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది.
* రోగనిరోధకవ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే ‘ఇమ్యూనోథెరపీ’ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది గతి తప్పిన కణాలను గుర్తించే, వాటిని నిర్వీర్యం చేసే యంత్రాంగాలను తిరిగి ప్రేరేపితం చేస్తూ.. క్యాన్సర్ కణాలను చంపుతుంది.
జీవనకాలం మెరుగు టార్గెటెడ్, ఇమ్యూనోథెరపీలు ఆయా రకాలకు, వ్యక్తులకు అనుగుణంగా చికిత్స చేయటానికి బాగా తోడ్పడతాయి. వీటి ద్వారా 60% మందికి కీమోథెరపీని తప్పించే అవకాశముంది. ఇవి చాలాకాలం పనిచేస్తాయి కూడా. వీటి రాకతో జీవనకాలం గణనీయంగా పెరిగింది. గతంలో వూపిరితిత్తుల క్యాన్సర్ బారినపడితే ఆరు నెలల కన్నా ఎక్కువకాలం జీవించేవారు కాదు. ఇప్పుడు దాదాపు 25% మంది ఐదేళ్లకు పైగా జీవిస్తున్నారు! అయితే ఏదో ఒక చికిత్సకు మాత్రమే సరిపోయేవారి కన్నా అన్ని రకాల చికిత్సలకు అనుగుణంగా ఉన్నవారు ఎక్కువకాలం జీవించే అవకాశముంటుంది.
క్షయకు దగ్గరి పోలిక
వూపిరితిత్తుల క్యాన్సర్, క్షయ..రెండింట్లోనూ దగ్గు, ఆయాసం, బరువు, ఆకలి తగ్గటం, జ్వరం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. దీంతో వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టమవుతోంది. వూపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స కోసం వచ్చేవారిలో క్షయ చికిత్స తీసుకొని, ఇంకా దగ్గు తగ్గలేదని వచ్చేవారు దాదాపు 15-50% మంది కనబడుతుంటారు. అప్పటికే వీరిలో క్యాన్సర్ ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా అవసరం. సాధారణంగా క్షయ చికిత్స ఆరంభించిన మూడు, నాలుగు వారాల్లో లక్షణాలు తగ్గుముఖం పట్టాలి. ఆరోగ్యమూ కాస్త మెరుగవ్వాలి. లేకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. ఎక్స్‌రే, సీటీస్కాన్.. అవసరమైతే బయాప్సీ చేసి వూపిరితిత్తుల క్యాన్సర్ ఉందేమో చూడాలి.
ఆలస్యమే.. పెద్ద సమస్య
వూపిరితిత్తుల క్యాన్సర్‌తో పెద్ద చిక్కటేంటంటే చాలా ఆలస్యంగా బయటపడుతుండటం. వూపిరితిత్తి పెద్ద అవయం. దీనిలో కణితి తలెత్తినా కూడా.. అది కీలకమైన భాగాలకు తగిలేంత వరకూ ఎలాంటి లక్షణాలు కనబడవు. అందువల్ల వూపిరితిత్తుల క్యాన్సర్ బయటపడేసరికే ముదిరిపోయి ఉంటోంది. ఇతరత్రా జబ్బుల్లో చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగా బయటపడటం తప్పించి.. తొలి దశలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించటం చాలా అరుదు. సుమారు 70-80% మందిలో ఇది మూడు, నాలుగు దశల్లోనే బయటపడుతోంది. దీన్ని ఒకటో దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90% వరకు నయం చేయొచ్చు. రెండో దశలో 70% వరకు నయం కావొచ్చు. అదే మూడో దశలో నయమయ్యే అవకాశం 30 శాతానికి పడిపోతుంది. ఇక నాలుగో దశలోనైతే నయం కావటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.
నివారణ కీలకం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందుకే అమెరికా వంటి దేశాల్లో వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. 55 ఏళ్లు పైబడి.. 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటున్నవారికి ఏడాదికి ఒకసారి తక్కువ మోతాదు సీటీస్కాన్ పరీక్ష చేస్తున్నారు. కానీ మనదేశంలో ఇదంత సులువైన పని కాదు. అందువల్ల నివారణ మీదే దృష్టి పెట్టటం చాలా అవసరం. క్యాన్సర్‌కు దారితీసే పొగాకు జోలికి వెళ్లకపోవటం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ పొగ తాగటం, పొగాకు నమలటం అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధికబరువు, వూబకాయాన్ని తగ్గించుకోవాలి.
పరీక్షలు: మూడు ప్రధానం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను నిర్ధరిచటంతో పాటు అది ఏ దశలో ఉందనేది గుర్తించటమూ చాలా అవసరం. ఎలాంటి చికిత్స చేయాలనేది దీని దశల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు రకాల పరీక్షలు తోడ్పడతాయి.
* ఎక్స్‌రే: వూపిరితిత్తుల క్యాన్సర్‌ను అనుమానిస్తే ముందు ఎక్స్‌రే తీస్తారు. కణితి నీడ ఏదైనా ఉంటే బయటపడుతుంది. నీరు చేరిందా? ఛాతీలో గుండె సరైన స్థానంలో ఉందా? శ్వాసనాళం ఎలా ఉంది? అనేవీ ఇందులో తెలుస్తుంది.
* సీటీ స్కాన్: క్యాన్సర్ ఉన్నట్టు అనుమానిస్తే, లక్షణాలు కూడా అనుగుణంగానే కనబడుతుంటే సీటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కణితి ఉంటే ఇందులో స్పష్టంగా బయటపడుతుంది.
* బయాప్సీ: కణితి ఉన్నట్టు తేలితే దాన్నుంచి చిన్న ముక్కను బయటకు తీసి (బయాప్సీ) పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్ నిర్ధరణ కావటమే కాదు, అది ఏ రకానికి (స్మాల్ సెల్, నాన్ స్మాల్ సెల్) చెందినదనేదీ తెలుస్తుంది.
* ఇతర పరీక్షలు: అవసరమైతే ఇతరత్రా వివరాల కోసం మరోసారి సీటీ స్కాన్, ఎముక స్కాన్, పెట్ స్కాన్ వంటివి చేస్తారు. దీంతో క్యాన్సర్ ఏ దశలో ఉంది, ఎక్కడెక్కడికి విస్తరించిందనేది బయటపడుతుంది.
నాలుగు దశలు
వూపిరితిత్తుల క్యాన్సర్ 4 దశలుగా కనబడుతుంది.
* స్టేజ్ 1: కణితి కేవలం ఒక వూపిరితిత్తిలోనే ఏర్పడటం. లింఫ్ గ్రంథులకు విస్తరించకపోవటం.
* స్టేజ్ 2: కణితి లింఫ్ గ్రంథులకు విస్తరించటం.
* స్టేజ్ 3: ప్రధాన శ్వాసనాళం చుట్టూరా ఉండే లింఫ్ గ్రంథులకు, ఛాతీ గోడకు, డయాఫ్రంకు కణితి విస్తరించటం.
* స్టేజ్ 4: వూపిరితిత్తుల్లో, గుండె చుట్టూ నీరు చేరటం.. కణితి ఇతర భాగాలకు విస్తరించటం.