అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ కల్పించడంలో విశేష కృషి చేస్తోంది.బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది. దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాల్లో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది.
నిమ్స్‌లో నోడల్ కేంద్రం
జీవన్‌దాన్‌కు సంబంధించి 2013లో నిమ్స్‌లో నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ జీవన్‌దాన్‌కు డీఎంఈ చైర్మన్‌గా, నిమ్స్ డైరక్టర్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వర్గాలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. కాలేయం, కిడ్నీ, గుండెకు సంబంధించిన కమిటీలు ఉంటా యి. ఈ కమిటీ పర్యవేక్షణలో అవయవ మార్పిడీల కేటాయింపులు జరుగుతాయి.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి తప్పని సరిగా జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్పత్రికే అవయవాలు కేటాయించి అక్కడే మార్పిడి నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఆస్పత్రిలో ఓ కో-ఆర్డినేటర్‌ను నియమించాలి.
కో-ఆర్డినేటర్లకు శిక్షణ
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నియమించిన కో-ఆర్డినేటర్లకు అవయవదానంపై బాధిత కుటుంబాలకు అవగాహన ఎలా కల్పించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ఏదైనా ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్ అయితే ఏం చేయాలి. రోగి కుటుంబ సభ్యులకు ఎలా కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఈ సమాచారాన్ని జీవన్‌దాన్‌కు ఎలా చేరవేయాలి ఇత్యాది అంశాలపై ఆరునెలల నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు.
అవయవాల కేటాయింపు ఎలా జరుగుతుంది ?....
ఏదైనా బ్రెయిన్‌డెత్ ఉంటే జీవన్‌దాన్‌కు ఆ సమాచారం అందుతుంది. అక్కడి నుంచి ఓ కో-ఆర్డినేటర్ వెళ్లి రోగి కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవ మార్పిడి ప్రక్రియకు మార్గం సుగమం చేస్తారు. ఆ తరువాత ఆ వివరాలను వెంటనే జీవన్‌దాన్ కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ అత్యవసరంగా అవయవాలు అవసరమున్న బాధితులను గుర్తించి మార్పిడికి అవకాశమిస్తారు. జాబితా ప్రకారం అత్యవసరమున్న వారికే ఈ అవయవాలను అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకే మొదటి ప్రాధాన్యతను జీవన్‌దాన్ కల్పిస్తుంది.
అవయవాల కోసం రిజిస్ట్రేషన్
అవయవాలు అవసరమైన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. నిమ్స్‌లోని జీవన్‌దాన్ నోడల్ కేంద్రానికి వచ్చి బాధితులు తమ వివరాలను అందజేయాల్సి
ఉంటుంది.
బాధితులు 040-23489494 నంబర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
www.eevandan.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.