Dr. Putta Srinivas, Dermotologt Specialist... సౌజన్యంతో....
స్టిరాయిడ్ పూతలతో అనర్థం
మొండిగా తయారైన తామరకు చికిత్స కూడా కష్టమే. దీనికి పూత మందులతో పాటు 2-6 నెలల పాటు మాత్రలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే మందుల మోతాదునూ పెంచాల్సి రావొచ్చు. దీంతో పిలల్లో కాలేయం దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. కాబట్టి మరింత జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి వస్తుంది.
గతంలో తామరకు చికిత్స తీసుకుంటే 3-4 వారాల్లో నయమయ్యేది. ఇప్పుడు నెలలకొద్దీ మందులు వాడినా తగ్గటం లేదు. ఇలా ఇది మొండి సమస్యగా మారటానికి ప్రధాన కారణం స్టిరాయిడ్స్ కలిపిన పూత మందుల వాడకం పెరగటం. స్టిరాయిడ్లతో పాటు యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియా మందులనూ కలిపి వీటిని తయారుచేస్తున్నారు. ఒకప్పుడు బీటామెతజోన్ అనే స్టిరాయిడ్ పూత మందు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది దురద, ఎరుపు, వాపు వంటివి తగ్గటానికి బాగా తోడ్పడే దీంతో పెద్ద దుష్ప్రభావాలేవీ ఉండేవి కావు. అందువల్ల పేదలందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ధరల నియంత్రణ కిందికి తీసుకొచ్చింది. దీంతో ధర బాగా తగ్గిపోయింది. అయితే ఔషధ కంపెనీలు లాభాపేక్షతో.. ధరల నియంత్రణ నుంచి తప్పించుకోవటానికి బీటామెతజోన్కు బదులు శక్తిమంతమైన క్లొబిటజోల్ ప్రొపినేట్ అనే స్టిరాయిడు కలిపిన పూతమందులను మార్కెట్లోకి తేవటంతో పరిస్థితి మారిపోయింది. సాధారణంగా ఫంగస్ ఇన్ఫెక్షన్ దాడిచేసినపుడు దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరం అక్కడ రోగనిరోధక ప్రతిస్పందనలు పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
ఇలా ఇన్ఫెక్షన్ మరింత విస్తరించకుండా చూసుకుంటుంది. అయితే స్టిరాయిడ్ పూత మందులను రాసినపుడు ఈ రోగనిరోధక ప్రతిస్పందనలు నెమ్మదిస్తాయి. దీంతో లక్షణాలు తాత్కాలికంగా తగ్గినట్టు కనిపించినా ఇన్ఫెక్షన్ మాత్రం వ్యాపిస్తూనే ఉంటుంది. వారం, పది రోజులకు ఇన్ఫెక్షన్ మళ్లీ విజృంభిస్తుంది. దీంతో మళ్లీ స్టిరాయిడ్ పూతమందు కొనుక్కొని వాడుకోవటం ఆరంభిస్తారు. ఇలా చివరికి ఇదొక విష వలయంలా తయారవుతుంది. ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ ఇంట్లో మిగతావాళ్లకూ అంటుకుంటుంది. పైగా ఇది అప్పటికే ఫంగల్ మందులకు లొంగని విధంగానూ మారిపోయి ఉంటుంది కూడా. ఇన్ఫెక్షన్ తలెత్తిన చోట ఫంగల్ మందులు ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ ప్రభావం చూపుతాయి. కానీ స్టిరాయిడ్స్ వీలైనంత త్వరగా మందును బయటకు పంపటానికే ప్రయత్నిస్తుంటాయి. ఇది ఫంగస్ బలపడి మరింత మొండిగా తయారవటానికి అవకాశం కల్పిస్తోంది.
దీంతో గతంలో ఒక్క పూత మందులతోనే 4 వారాల్లో తగ్గిపోయే తామరకు ఇప్పుడు నెలల కొద్దీ మాత్రలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరో ప్రమాదమేంటంటే- స్టిరాయిడ్ పూత మందులతో తాత్కాలింకగా ఇన్ఫెక్షన్ తగ్గినచోట దురద, పొక్కుల వంటి సాధారణ లక్షణాలేవీ కనబడకపోవటం. దీని మూలంగా సమస్యను గుర్తించటం, నిర్ధరించటమూ కష్టమవుతోంది. కొందరికి చర్మం దెబ్బతిని పులిచారలు (స్ట్రెచ్ మార్క్స్), మొటిమల వంటివీ ఏర్పడొచ్చు. స్టిరాయిడ్ పూత మందుల వల్ల ఇన్ఫెక్షన్ హద్దులు (మార్జిన్స్) మాయమవుతాయి. దీంతో పొలుసులు కనబడవు. అందువల్ల పరీక్ష చేసినా ఫంగస్ బయటపడదు.
సిగ్గు, బిడియంతో డాక్టర్కు చూపించుకోకపోవటం.. సొంతంగా మందులు కొనుక్కొని వాడుకోవటం.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా సమస్యను దాచుకోవటం.. ఒకరి దుస్తులు, వస్తువులు మరొకరు వాడటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కొందరు వైద్యులు కూడా తెలిసో తెలియకో ఇలాంటి మందులు సిఫారసు చేయటమూ కనబడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. నిజానికి స్టిరాయిడ్లు కలిపిన ఇలాంటి పైపూత మందులు ప్రపంచంలో మరెక్కడా అందుబాటులో లేవు. అందుకే వీటి దుర్వినియోగాన్ని అరికట్టటానికి చర్మ, సుఖ, కుష్టు నిపుణుల సంఘం (ఐఏడీవీఎల్) గట్టిగా పోరాడుతోంది.
నివారణే అత్యుత్తమం
తామర వచ్చాక బాధపడే కన్నా అసలు దీని బారినపడకుండా చూసుకోవటమే అత్యుత్తమం. ఇందులో మన వ్యక్తిగత పరిశుభ్రతే కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి.
- చెమట ఎక్కువగా పోసే చంకలు, గజ్జల్లో తడి లేకుండా చూసుకోవటం ముఖ్యం. ఫుల్ బనియన్లు, డ్రాయర్లు.. అవీ కాటన్వే ధరించాలి. అలాగే లోదుస్తులు మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలి.
- ఒకరి దుస్తులు, జీన్స్, సాక్స్, టీషర్టులు, తువ్వాళ్ల వంటివి మరొకరు వాడకూడదు.
- తామరతో బాధపడేవారి దుస్తులను ఇతరుల దుస్తులతో కలపకూడదు. వీటిని విడిగానే ఉతకాలి. వాషింగ్ మిషన్లో వేయకూడదు.
- చన్నీటితో దుస్తులు ఉతికినా తామరకు దారితీసే ఫంగస్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి తామరతో బాధపడేవారి లోదుస్తులు, జీన్స్ ప్యాంట్ల వంటి వాటిని తప్పకుండా గంటసేపు వేడినీటిలో నానబెట్టాలి. ఈ వేడి నీటిలో ఇతరత్రా సూక్ష్మక్రిమి నాశక ద్రావణాలు కలపాల్సిన అవసరమేమీ లేదు.
- శుభ్రంగా ఉతికిన తర్వాత దుస్తులను ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇస్త్రీ చేసుకోవటం మరీ మంచిది. దీంతో ఆ వేడికి ఫంగస్ చనిపోతుంది.
- గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇది ఒంటిపై ఒక చోటు నుంచి మరొక చోటుకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చూసుకోవటానికే కాకుండా అది ఇతరులకు అంటుకోకుండా కాపాడుకోవటానికీ తోడ్పడుతుంది.
- దురద వంటి లక్షణాలు వేధిస్తుంటే సొంత వైద్యం ఏమాత్రం పనికిరాదు. సిగ్గు, బిడియం లేకుండా వెంటనే డాక్టర్ను సంప్రతించి తగు చికిత్స తీసుకోవాలి. లక్షణాలు తగ్గుముఖం పట్టినా డాక్టర్ చెప్పినంత కాలం మందులు వాడుకోవాలి.
- తాత్కాలికంగా గుణం చూపించే స్టిరాయిడ్ కలిపిన పూత మందులు అసలే వాడకూడదు.
-స్నేహితులో, చుట్టుపక్కలవాళ్లో చెప్పిన సలహాలను గుడ్డిగా నమ్మటం తగదు. అలాగే ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమాల్లో కనబడే చిట్కాలను నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయంగా భావించరాదు.