header

Snoring…గురక

Snoring…గురక
నిద్రలో గురకపెట్టటం తరచుగా కనిపించేది. పెద్దవారిలో దాదాపు 45 శాతం మంది గురక పెడతారని అంచనా ఇది వీరి పక్కనే పడుకునే వారికి ఇబ్బంది కలిగించటంతో పాటు గురక పెట్టేవారికీ సమస్య తెచ్చిపెట్టవచ్చు. గురకపెట్టే వారిలో 75 మంది శ్యాసలో అడ్డంకి (స్లీప్‌ ఆప్నియా) తలెత్తే సమస్యతో బాధపడుతుంటారు. దీంతో రాత్రిపూట చాలాసార్లు నిద్ర నుంచి మెలకువ వస్తుంది. అలాగే గుండెజబ్బు ముప్పూ పెరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో గురకను నివారించుకునే వీలుంది.
పక్కకు తిరిగి పడుకోవటం : వెల్లికలా పడుకోవటం వలన నాలుక వెనుకభాగం, అంగిలో గొంతులోకి జారిపోయే అవకాశం ఉంది. ఇది గురకకు దారితీస్తుంది. కాబట్టి పక్కకు తిరిగి పడుకుంటే మేలు. ఇందుకోసం అవసరమైతేశరీరం మొత్తాన్ని చుట్టుకొని ఉండే దిండునూ ఉపయోగించుకోవచ్చు. తలవైపు కాస్త ఎత్తుగా ఉండే మంచం మీద పడుకుంటే శ్వాస సాపీగా సాగి, గురక రాకుండా చూసుకోవచ్చు.
బరువు తగ్గటం: అధిక బరువును తగ్గించుకుంటే కొందరిలో గురక కూడా తగ్గే అవకాశముంది. అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుందని చేప్పలేం. ఎందుకంటే బక్కపలచగా ఉన్నవారూ గురక పెడుతుండటం తెలిసిందే. ఒకవేళ బరువు పెరిగిన తర్వాత గురక మొదలైతే మాత్రం బరువు తగ్గితే ప్రయోజనం ఉంటుంది. మెడ చుట్టుపక్క కొవ్వు బాగా పెరిగిపోతే గొంతులోపలి మార్గం, వ్యాసమూ తగ్గుతుంది. ఇది నిద్రపోతున్నప్పుడు వదులై గురకకు దారి తీస్తుంది.
మద్యం : మద్యం, మత్తుకారకాల వంటివి విశ్రాంతి సమయంలో గొంతు కండరాల పటుత్వాన్ని తగ్గిస్తాయి. ఇది గురక రావటానికి కారణమవుతుంది. నిద్ర పోవటానికి నాలుగైదు గంట ముందు మద్యం తాగితే గురక మరింత తీవ్రమవుతుంది. గురక రాని వాళ్లుకూడా మద్యం తాగిన తర్వాత గురకపెట్టే అవకాశమూ ఉందని గుర్తుంచుకోవాలి.
సమయానికి నిద్ర : రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని పనిచేయటమనేది తీవ్రఅసటకు దారితీస్తుంది. ఆ తర్వాత పడుకున్నప్పుడు నిద్ర మరింత గాఢంగా పడుతుంది. ఈ సమయంలో గొంతు కండరాలు వదులవటంతో గురక రావొచ్చు.
ముక్కు రంధ్రాలు బిగుసుకు పోవటం : ఒకవేళ ముక్కు రంధ్రాలు బిగుసుపోవటం వలన గురక వస్తుంటే శ్వాస సాఫీగా ఆందేలా చూసుకోవటం మంచిది. పడుకోవటానికి మందు వేటినీటితో స్నానం చేస్తే ముక్కు బిగుసుకోవటం తగ్గుతుంది. అలాగే ముక్కులో వేసుకునే చుక్కల మందు కూడా తోడ్పడుతుంది.
దిండు మార్చటం : పడకగదిలో దిండ్లలోని అలర్జీ కారకాల సైతం గురకకు దారితీయవచ్చు, దిండ్లలో పేరుకుపోయే తవిటి పురుగు గొంతులో అలర్జీ ప్రతిస్పందనను ప్రేరేపించి గురక వచ్చేలా చేస్తాయి. పగటిపూట బాగానే ఉండి రాత్రిపూట గురక వస్తుంటే ఇలాంటి కారణమేదే ఉండొచ్చని అనుమానించాలి. దిండ్లను తరచూ శుభ్రం చేస్తుండటం, కవర్లను మార్చడం, శుభ్రం చేయటం వంటివి చేయాలి.
నీటిశాతం తగ్గకుండా : ఒంట్లో నీటిశాతం తగ్గిపోతే ముక్కులోని, గొంతులోని స్రావాలు చిక్కబడతాయి. ఇది గురక తీవ్రత పెరగటానికి దారితీయవచ్చు. కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవటం మంచిది.