header

Thyroid….థైరాయిడ్‌

Thyroid….థైరాయిడ్‌

డా॥ రమణ బొద్దుల, కన్సల్టెంట్‌ ఎండో క్రైనాలజిస్ట్‌, కిమ్స్‌, సికింద్రాబాద్‌
థైరాయిడ్‌ గ్రంథి మన శరీరంలో అత్యంత కీలకమైన గ్రంధులలో ఒకటి. మన దేహానికి థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరం. పిండ దశనుంచే ప్రారంభమవుతుంది. థైరాయిడ్‌ మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. పిండం ఎదగడానికి ముఖ్యంగా మెదడు, ఇతర నాడీవ్యవస్ధలు పెరగడానికి థైరాయిడ్‌ హార్మోన్‌ అత్యంత ముఖ్యం.
పుట్టిన తరువాత మొదటి రెండేళ్లలో మెదడు, నాడీవ్యవస్ధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో థైరాయిడ్‌ హార్మోన్ లు అత్యంత అవసరం. ఆ తరువాత దశలో పిల్లల పెరుగుదలకు థైరాయిడ్‌ హార్మోన్ కావాలి. పెద్దవాళ్లలోను థైరాయిడ్‌ హార్మోన్‌ శరీర జీవక్రియను నియంత్రిస్తాయి. అందుకే అన్ని దశల్లోను థైరాయిడ్‌ చాలా కీలకమైనది. ఇంతటి ప్రధాన గ్రంథికి వచ్చే వ్యాధులు, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన...
థైరాయిడ్‌లో ఉండే కణాలు ( పాలిక్యూర్‌సెల్స్‌) రక్తం నుంచి అయోడిన్‌ గ్రహించి టైరోసిన్‌ అనే అమైనోఆసిడ్‌ తో పాటు మరికొన్ని ఎంజైముల సహాయంతో థైరాయిడ్‌ హార్మోన్లను (టి-3, టి-4 వంటివి) ఉత్పత్తి చేస్తాయి. ఈ టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడానికి పిట్యుటరీ అనే గ్రంధి థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టిఎస్‌హెచ్‌) ను విడుదల చేస్తుంది. ఈ థైరాయిడ్‌ హార్మోన్‌లో (టి3, టి4) శరీరంలోని కొన్ని ప్రధానమైన జీవక్రియలను నియంత్రిస్తాయి.
మన శరీరాన్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడతాయి. రక్తంలో టి3, టి4 హర్మోన్ల మోతాదు తగ్గితే కొన్ని సంకేతాలు పిట్యుటరీ గ్రంధికి చేరి, అక్కడ నుంచి టిఎస్‌హెచ్‌ హార్మోన్‌ను ఎక్కువగా విడుదల అయ్యేలా చేస్తుంది. దానివల్ల రక్తంలో టిఎస్‌హెచ్‌ మోతాదు పెరుగుతుంది. అప్పుడు రక్తంలో టి3, టి4 హార్మోన్ల మోతాదు పెరిగితే.... పిట్యుటరీ గ్రంధినుంచి వచ్చే టిఎస్‌హెచ్‌ మోతాదు తగ్గుతుంది. థైరాయిడ్‌ సమస్యు రెండు రకాలుగా వుండవచ్చు:
1. థైరాయిడ్‌ హార్మోన్ల తగ్గడం, దీన్నే హైపోథైరాయిడిజం అంటారు.
2. థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరానికి మించి స్రవించడం, దీన్నే హైపర్‌ థైరాయిడిజం లేదా థైరోటాక్సీకోసిస్‌ అంటారు.
హైపో థైరాయిడిజం : దీనికి ముఖ్యంగా రెండురకాల కారణాలు చెప్పవచ్చు. మొదటిది అయోడిన్‌ లోపం. రెండవది రక్తంలో థైరాయిడ్‌ గ్రంధికి యాంటీబాడీస్‌ ఏర్పడటం. ఈ రెండో సమస్యను ఆటోఇమ్యూన్‌ హైపో థెరాయిడిజం అంటారు. మన శరీర జీవ క్రియకు అయోడిన్‌ అనేది ఒక ముఖ్యమైన పోషకం. ఈ పోషకం లభ్యం కాని ప్రాంతాల్లో ప్రజల్లో హైపో థైరాయిడిజం ఎక్కువగా కనిపిస్తుంది. మనదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రాంతాల్లో హిమాలయాలను ఆనుకొని ఉన్న రాష్ట్రాల నేలల్లో అయోడిన్‌ చాలా తక్కువగా ఉండడం వలన అక్కడ హైపో థైరాయిడిజం ఎక్కువగా ఉండేది.
అయితే స్వాతంత్య్రం వచ్చాక అయోడిన్‌ డిఫిషియన్సీ డిజార్డర్స్‌ ఇరాడికేషన్‌ ప్రోగ్రామ్‌ అనే కార్యక్రమం క్రింద అయోడిన్‌ కలిపిన ఉప్పును తప్పనిసరి చేయడం వలన ఈ సమస్యను చాలా వరకు అరికట్టడం సాధ్యమైంది. హైపోథైరాయిడిజం కుటుంబంలో ఒకరికి ఉంటే చాలామందికి రావచ్చు. ప్రస్తుతం మనం చూసే హైపో థైరాయిడిజం కేసుకు ప్రధాన కారణం ఆటో ఇమ్యూన్‌ హైపో థైరాయిడిజం రక్తంలో థైరాయిడ్‌ గ్రంధికి యాంటీబాడీస్‌ తయారు కావడం వల్ల వచ్చే హార్మోన్‌ లోపాన్ని ఆటో ఇమ్యూన్‌ హైపో థైరాయిడిజం అంటారు.
కొన్నిరకాల జన్యుమార్పులు యాంటీబాడీస్‌ తయారవడానికి తోడ్పడతాయి. ఇది జన్యుపరమైన కారణం కావడంతో ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆటో ఇమ్యూన్‌ హైపో థైరాయిడిజం కుటుంబంలో ఒకరికి వచ్చినట్లయితే వారి నుంచి వాళ్ల పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ ఆటోఇమ్యూన్‌ హైపో థైరాయిడిజం పురుషుల్లో కంటే మహిళల్లో (9 రెట్లు) కనిపిస్తుంది.
హైపో థైరాయిడిజంలో బరువు పెరగడానికి కారణం : ఈ సమస్య ఉన్నవారిలో చర్మం క్రింద ఉండే కణజాలం (టిష్యూలో ) గ్లైకోసమైనోగ్లైకన్స్‌ అనే కొన్ని పదార్థాలు పేరుకుపోతాయి. ఈ రసాయన పదార్ధానికి నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది.దాంతో అవి నీటిని గ్రహించి చర్మంలో వాపు రావడానికి దారి దీస్తుంది. ఈ మార్పు ముఖ్యంగా ముఖం కాళ్లు, చేతుల ప్రాంతాలో ఎక్కువగా వస్తుంది. దానివలన శరీరం బరువు పెరుగుతుంది. అంతే కాని శరీరంలో కొవ్వు పెరగడం వలన ఈ బరువుపెరగడం జరుగదు.
అందువలన హార్మోన్‌ మాత్రలు వాడిన కొద్దివారాల్లోనే శరీరానికి పట్టిన నీరు (వాటర్‌ రిటెన్షన్‌) తగ్గిపోయి తద్వారా బరువు తగ్గడం జరుగుతుంది. తరువాత మళ్లీ బరువు పెరగడం అంటూ ఉండదు.
చిన్న పిల్లలల్లో హైపోథైరాయిడిజం వలన చురుకుగా ఉండలేకపోవడం, స్కూల్లో ఫెర్‌ఫార్మెన్స్‌ దెబ్బతినడం పెరుగుదల తగ్గిపోవడం వంటివి జరుగుతాయి.
హైపో థైరాయిడిజంను గుర్తించడం ఎలా: రక్త పరీక్ష ద్వారా హైపో థైరాయిడిజంను నిర్ధారణ చేయవచ్చు. రక్తంలో టి3, టి4 హార్మోన్ల మోతాదు తగ్గిపోవడం, టియస్‌హెచ్‌ మోతాదు పెరగడం జరుగుతుంది.
చికిత్స : హైపో థైరాయిడిజంను తగ్గించడం కోసం థైరాక్సిన్‌ మాత్రలు వాడాల్సిఉంటుంది. మందు మోతాదును డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవాలి. ఆటోఇమ్యూన్‌ హైపో థైరాయిడిజం వచ్చినవారు జీవితాంతం థైరాక్సిన్‌ మాత్రలు వాడాల్సివుంటుంది. ఎందుకంటే ఈ యాంటీబాడీస్‌ను తగ్గించడానికి మందులు లేవు.
హైపర్‌ థైరాయిడిజం : రక్తంలో థైరాయిడ్‌ హార్మోన్‌లో (టి3, టి4) పెరగడం వలన వచ్చే సమస్యను హైపర్‌ థైరాయిడిజం లేదా థైరోటాక్సీకోసిస్‌ అంటారు. దీనికి ప్రధానంగా రెండుకారణాలు ఉన్నాయి. అవి రక్తంలో థైరాయిడ్‌ గ్రంధిని ప్రేరేపించే యాంటీబాడీస్‌ తయారవడం వలన థైరాయిడ్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీన్ని గ్రేవ్స్‌డిసీజ్‌ అంటారు. థైరాయిడ్‌ గ్రంధిలో ఏదైనా చిన్న భాగం అటనామస్‌ నాడ్యుయల్‌ గా రూపాంతరం చెంది హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తిచేస్తుంది. దీన్ని ‘‘టాక్సిక్‌ అడినోమా’’ అంటారు.
గుర్తించడమెలా : హైపర్‌ థైరాయిడిజంను రక్తపరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షల్లో రక్తంలో టి3, టి4 మోతాదు ఎక్కువ కావడం, టియస్‌హెచ్‌ మోతాదు బాగా తగ్గిపోవడం కనిపిస్తుంది.
చికిత్స: దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్‌ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలా మందిలో ఈ యాంటీ థైరాయిడ్‌ మందులు ఆపిన తరువాత మళ్లీ థైరాయిడ్‌ హార్మోన్‌ స్రావాలు పెరిగే అవకాశముంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్‌ మందులు ద్వారా హార్మోన్‌ను తగ్గించి, ఆ తరువాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్దతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్‌ అయోడిన్‌ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్‌ గ్రంధిలో హార్మోన్‌ తయారు చేసే కణాలను నాశనం చేస్తారు. తద్వారా హార్మోన్‌ స్రావాన్ని తగ్గిస్తారు.
ఇక రెండో పద్దతిలో ఆపరేషన్‌ ద్వారా థైరాయిడ్‌ గ్రంధిని తొలగించడం ద్వారా హార్మోన్‌ స్రావాన్ని తగ్గించడం. ఈ రెండు పద్దతుల్లోను హార్మోన్‌ స్రావం బాగా తగ్గిపోయి చివరకు హార్మోన్‌ లోపానికి దారితీస్తుంది. అప్పుడు హైపర్‌ థైరాయిడిజం సమస్య ఇచ్చినట్లుగా థైరాక్సిన్‌ మాత్రం జీవితాంతం వాడాల్సి ఉంటుంది.
గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్‌ హార్మోన్‌ ప్రాధాన్యం : గర్భవతిగా ఉన్న సమయంలో తల్లిలోని థైరాయిడ్‌ హార్మోన్‌ బిడ్డమెదడు, నాడీ వ్యవస్థ పెరుగుదలకు బాగా దోహదపడుతుంది. తల్లికి థైరాయిడ్‌ లోపం ఉండి చికిత్స చేయించకపోతే బిడ్డ మెదడు ఎదుగుదలలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు తల్లికి తగిన మోతాదులో థైరాక్సిన్‌ మాత్రలు ఇవ్వడం ద్వారా బిడ్డకు కలిగే లోపాలను నివారించవచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి రక్తంలో టిఎస్‌హెచ్‌ మోతాదును తక్కువ స్థాయిలో ఉంచాలి. తల్లిలో థైరాయిడ్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉన్నట్లయితే అది బిడ్డ ఎదుగుదలను తగ్గించవచ్చు. అంటే ఫీటల్‌గ్రోత్‌ రెస్ట్రిక్షన్‌ రావచ్చునన్నమాట. అందుకే ఇలాంటి సందర్భంలో యాంటీ థైరాయిడ్‌ మందులను తగిన మోతాదులో ఇస్తూ, తల్లిలో థైరాయిడ్‌ హార్మోన్‌ను సరిగా ఉండేలా నియంత్రించడం ద్వారా బిడ్డకు కలిగే దుష్ప్రభావాలను నివారించవచ్చు.