ట్రైగ్లిజరైడ్లు స్థాయిని మించి ఉంటే వాటిని తగ్గించుకోవటం అవసరం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటం కీలకం.
* లావుగా ఉంటే బరువు తగ్గాలి.
* మద్యం, పొగతాగటం వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. వాటికి దూరంగా ఉండాలి.
* కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మాంసాహారం తగ్గించాలి.
* అన్ని రకాల నూనెలు, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి.
* తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తింటే ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి. బజార్లో ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాలు, రకరకాల చిప్స్, నూడుల్స్, సేమియా, పాస్తా, పిజ్జాల వంటివి, కేకులు, బిస్కట్లు.. ఇవన్నీ తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలే.
వీటన్నింటినీ తగ్గించాలి
* పంచదార, జామ్‌లు, జెల్లీల వంటివి ఎక్కువగా తినేవారికి ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పంచదార, తీపి పదార్థాలు బాగా తగ్గించెయ్యాలి. కాఫీలో కూడా పంచదార మానెయ్యటం మంచిది.
* మామూలుగా మధుమేహం ఉన్నవారు పండ్ల వంటివి మితంగా తినటం, కాఫీలో పంచదార వంటివి మితంగా వేసుకున్నా ఫర్వాలేదుగానీ ట్రైగ్లిజరైడ్లు ఎక్కువున్న వారు మాత్రం పండ్లు, పంచదార, కూల్‌డ్రింకుల వంటి వాటన్నింటినీ మానెయ్యటం, మరీ అవసరమైతే చాలాచాలా మితంగానే తీసుకోవటం ముఖ్యం.
తేలికగా జీర్ణమయ్యే వరి అన్నం మానేసి గోధుమలకు, చపాతీలకు మారటం మంచిది.ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఇవ్వటం వల్ల ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయన్న భావన ఒకటుందిగానీ వీటితో ఆశించినంత ఫలితం ఉండటం లేదని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
మన రక్తంలో ట్రైగ్లిజరైడ్లు..
* 100 ఎంజీ/డీఎల్ లోపు ఉండటం ఉత్తమం
* 150 ఎంజీ/డీఎల్ వరకూ ఫర్వాలేదు, దాటితే రిస్కులు పెరుగుతాయి
* 200 ఎంజీ/డీఎల్ దాటితే చికిత్స తప్పదు.
మన రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయులు తేలికగా ప్రభావితమవుతుంటాయి. కాబట్టి పరీక్షకు వెళ్లే ముందు రోజు రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకోకుండా ఉండాలి. రాత్రిపూట ప్రయాణాలు చేసినా, రాత్రంతా మేలుకున్నా, మద్యం తాగినా, మసాలా పదార్థాలు తిన్నా ట్రైగ్లిజరైడ్లు పెరిగిపోతాయి. కాబట్టి ఇవేమీ చెయ్యకుండా ఉదయం పరగడుపున, లేచిన గంటలోపు పరీక్ష కోసం రక్తం నమూనా ఇవ్వాలి. సాధారణంగా కొలెస్ట్రాల్ పరీక్షతో పాటే దీన్నీ చేస్తారు.
ట్రైగ్లిజరైడ్లనేవి ఒక రకమైన కొవ్వులు. ఇవి కూడా మనకు కీలకమైన శక్తి నిల్వలు. ఈ ట్రైగ్లిజరైడ్లను మన శరీరం గ్లూకోజుగా మార్చుకుని శక్తిగా వినియోగించుకుంటుంది. మనం ఆహారం తీసుకున్న మొదటి రెండు మూడు గంటల్లో రక్తంలో గ్లూకోజు పెరిగినట్లే ట్రైగ్లిజరైడ్లు కూడా పెరుగుతుంటాయి. గ్లూకోజు కొద్దిగంటల్లోనే తరిగిపోతుందిగానీ ట్రైగ్లిజరైడ్లు మాత్రం నిల్వ రూపాలు కాబట్టి అంత త్వరగా తగ్గవు. మన శరీరం నిరంతరం గ్లూకోజును, దానితో పాటే ఈ ట్రైగ్లిజరైడ్ల నిల్వలను శక్తిరూపంలో మార్చుకుని వాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ మనం 15-18 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండిపోతే అప్పుడు శరీరంలో గ్లూకోజు నిల్వలు మొత్తం అయిపోయి..
అప్పుడు శరీరం పూర్తిగా ట్రైగ్లిజరైడ్ల మీదే, వాటిని శక్తిగా మార్చుకోవటం మీదే ఆధారపడుతుంది. అయితే ట్రైగ్లిజరైడ్లు కేవలం శక్తిగా మారటమే కాదు.. కొలెస్ట్రాల్ కొవ్వుగా కూడా మారుతుంటాయి. అందుకే ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే అవి ఎల్‌డీఎల్ వంటి కొలెస్ట్రాల్ రూపంలోకి మారుతూ... కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటానికీ దోహదం చేస్తాయి. ఇదే వీటితో పెద్ద సమస్య. మొత్తమ్మీద- ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ. 70% భారతీయుల్లో కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువ ఉంటాయి, వీటిని వదిలేస్తే మున్ముందు కొలెస్ట్రాల్ పెరగటానికి దారి తీస్తాయి. కాబట్టి ట్రైగ్లిజరైడ్లనే నియంత్రిస్తే మున్ముందు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకునే అవకాశంఉంటుందని గుర్తించాలి. కాబట్టి కొలెస్ట్రాల్ పరీక్ష ఒక్కటే చేసి చూసుకుంటూ అది బాగుంటే అంతా బాగుందని భావించటం సరికాదు. ట్రైగ్లిజరైడ్లు కూడా చూసుకోవటం అవసరం. రక్తంలో ట్రైగ్లిజరైడ్లు స్థాయికి మించి ఉండటాన్ని ‘హైపర్ ట్రైగ్లిజరిడీమియా’ అంటారు. ఇవి ఎక్కువున్నా ఎటువంటి లక్షణాలూ ఉండవుగానీ క్రమేపీ శరీరంలో వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు.. ఈ రెంటిలో ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే కొలెస్ట్రాల్!
* హైపోథైరాయిడిజం, పాంక్రియాటైటిస్, మధుమేహం వంటి ఇతరత్రా కారణాల వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరిగితే.. ఆ సమస్యలకు చికిత్స చేస్తే ట్రైగ్లిజరైడ్లూ తగ్గిపోతాయి.
* ఇతరత్రా సమస్యలేమీ లేకుండా కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే 200 కంటే ఎక్కువ ఉంటే వారికి పిండి పదార్థాలు తగ్గించటం వంటి జీవనశైలి మార్పులతో పాటు ప్రత్యేకించి ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు ఇచ్చే ‘ఫైబ్రైట్స్’ రకం మందులు కూడా ఇస్తారు.
* ట్రైగ్లిజరైడ్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటే ముందు కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లను సిఫార్సు చేస్తారు. దానితో ట్రైగ్లిజరైడ్లూ తగ్గుతాయి. ఒకవేళ అలా తగ్గకపోతే ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఫైబ్రైట్స్ సిఫార్సు చేస్తారు. ఒకవేళ కొలెస్ట్రాల్ పరిమితుల్లోనే ఉండి కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువగా ఉంటే ‘ఫైబ్రైట్స్’ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.
* కొలెస్ట్రాల్ తగ్గించటానికి ఇచ్చే స్టాటిన్ మందులూ, ట్రైగ్లిజరైడ్లు తగ్గించేందుకు ఇచ్చే ఫైబ్రైట్ మందులూ.. రెండూ కలిపి వాడితే శరీరంలోని కండర క్షీణత రావచ్చు. కాబట్టి ఈ రెంటినీ వాడుకునేటప్పుడు 3 నెలలకు ఒకసారి సీపీకే అనే ఎంజైమ్ (క్రియాటినైన్ ఫాస్ఫో కైనేస్) పరీక్ష చేయించుకుని అది పెరుగుతున్నట్లుంటే వైద్యుల సలహాతో ఈ రెంటిలో ఏదో ఒక దాన్నే తీసుకోవాల్సి ఉంటుంది.
* మధుమేహం ఉన్న వారికి మధుమేహాన్ని సమర్థంగా నియంత్రణలోకి తెస్తే ట్రైగ్లిజరైడ్లు కూడా చాలా వరకూ నియంత్రణలోకి వస్తాయి. ఒకవేళ రాకపోతుంటే దీనికీ మందు తీసుకోవాలి. మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోవటం, దాన్ని తగ్గించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వటం తప్పనిసరి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పండ్లు మానెయ్యటం, లేదా బాగా తగ్గించటం మంచిది.