Dr. Pranithi Reddy, Uro Gynocologist
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని కలత
స్త్రీలు గర్భం దాల్చకపోవడానికి చాలా కారణాలుండొచ్చు. అధిక బరువు, వయసు, పోషకాల లోపం వల్ల కూడా సంతానసాఫల్యత తగ్గొచ్చు. ముఖ్యంగా ఫోలిక్‌యాసిడ్, ఇనుము, జింక్, విటమిన్ బి12 లోపాలు ప్రభావం చూపిస్తాయి. పూర్తిగా శాకాహారం తీసుకునేవారు వైద్యుల సలహాతో ఆ పోషకాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా వ్యాయామం చేయడం, అసలు చేయకపోవడం కూడా సమస్యే. లైంగికంగా సంక్రమించే క్లమీడియా ప్రభావం ఫెలోపియన్ ట్యూబులపై పడుతుంది. కొన్నిరకాల రసాయనాలు, ఒత్తిడి వల్ల లైంగికచర్యపై ఆసక్తి సన్నగిల్లి సంతాన సాఫల్యత తగ్గుతుంది. ఇవే కాదు... మరికొన్ని సమస్యలూ ఉన్నాయి.
అండాలు నాణ్యత లేకపోవడం...
రుతుక్రమం మొదలయ్యాక ప్రతినెలా అండం విడుదల కావాలి. అయితే కొన్నిసార్లు అసలు అండం విడుదల కాదు లేదా ఎప్పుడో విడుదల కావచ్చు. కొందరిలో నలభైఏళ్లకే అండాశయాల పనితీరు ఆగిపోతుంది. దీన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. అలాగే పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్)సమస్య వల్లా అండాశయాలు సరిగ్గా పనిచేయవు. అప్పుడు కూడా అండాల విడుదల సరిగా ఉండదు.
ప్రొలాక్టిన్ స్థాయులు (హైపర్‌ప్రొలాక్టెనీమియా) ఎక్కువగా ఉన్నవారు గర్భం దాల్చలేరు. ఆ స్థాయులు పెరిగేతే అండాల విడుదలపై, సంతాన సాఫల్యతపై ప్రభావం పడుతుంది.
కొందరికి అండాలు విడుదల అవుతాయి కానీ నాణ్యత ఉండదు. జన్యుపరమైన లోపాలు, వయసు ఇందుకు కారణం.
థైరాయిడ్, గర్భాశయం లేదా ఫెలోపియన్ ట్యూబులో సమస్యలు... అండం విడుదలైనా అది గర్భాశయంలోకి చేరకుండా అడ్డుకుంటాయి. అలా అండం సవ్యంగా ప్రయాణించకపోతే గర్భం దాల్చలేరు.
కటివలయానికి ఏదయినా శస్త్రచికిత్స జరిగినప్పుడు ఫెలోపియన్ ట్యూబులకు హాని కలగొచ్చు. అలాగే గర్భాశయ ముఖద్వారానికి ఆపరేషన్ జరిగితే అది కుంచించుకుపోవచ్చు. క్యాన్సర్ కాని ఫైబ్రాయిడ్లు కూడా కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబుల్లో అడ్డుపడతాయి. దాంతో అండం, వీర్యకణాలు కలవలేవు. ఫైబ్రాయిడ్ల పరిమాణం పెరిగేకొద్దీ... గర్భాశయంపై ప్రభావం పడుతుంది. అప్పుడు వీర్యకణాలు సాఫీగా ప్రయాణించలేవు. ఎండోమెట్రియాసిస్ కూడా ఓ కారణమే.
అప్పటికే ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడంతో అవి మళ్లీ మామూలుగా పనిచేయడానికి చికిత్స చేయించుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు.
స్టిరాయిడ్ లేదా యాస్ప్రిన్, ఇబూఫ్రిన్ లాంటి నొప్పి నివారణా మందులు ఎక్కువకాలం వాడినా సమస్యే. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతోనూ సంతానసాఫల్య సామర్థ్యం తగ్గొచ్చు.
వీర్యకణాల సంఖ్య తగ్గడం...
పురుషుల్లో ఉండే కొన్ని సమస్యలు సంతానసాఫల్య సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం. అవి 15 మిలియన్ల లోపల ఉంటే తక్కువున్నట్లే లెక్క. కొన్నిసార్లు తగినన్ని వీర్యకణాలు ఉన్నా...అవి అండాన్ని చేరుకోలేవు.
పురుషుల్లో జననాంగాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్ ఉండటం, క్యాన్సర్, ఏదయినా శస్త్రచికిత్స చేయించుకోవడం కూడా కారణాలే. జన్యుపరంగా పురుషుడిలో ఎక్స్, వై క్రోమోజోములు ఉండాలి. అలా కాకుండా రెండు ఎక్స్ క్రోమోజోములు, ఒక వై క్రోమోజోము ఉంటే టెస్టోస్టిరాన్ లోపం ఎదురవుతుంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా లేదా అసలు లేకపోవచ్చు. కొన్నిరకాల మందులూ ఇందుకు కారణం కావచ్చు. నలభైఏళ్లు దాటేకొద్దీ వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతుంది.
మద్యపానం అలవాటు ఉన్న పురుషుల్లో సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గుతుంది.
పురుషులకు: అతడి వ్యక్తిగత ఆరోగ్యం, వాడే మందులు, లైంగిక చర్యకు సంబంధించిన అంశాల ఆధారంగా పరీక్షలు చేస్తారు. ఆ తరువాత వీర్యకణాల సంఖ్య తెలుసుకునేందుకు సెమెన్ ఎనాలిసిస్ పరీక్ష ఉంటుంది. వాటి రంగు, నాణ్యత, ఇన్‌ఫెక్షన్లు, రక్తం కూడా పడుతోందా అనేది అంచనా వేస్తారు. టెస్టోస్టిరాన్, ఇతర హార్మోన్ల పనితీరు తెలుసుకునేందుకు రక్తపరీక్ష ఉంటుంది. క్లమీడియా గుర్తించేందుకు పరీక్ష చేస్తారు.
ఇద్దరికీ చికిత్స ఉంది..
మొదట భార్యాభర్తలిద్దరినీ అండం విడుదలయ్యే సమయంలో శారీరకంగా కలవమంటారు. దానివల్ల గర్భం దాల్చొచ్చు. సంతాన సాఫల్య సామర్థ్యం పెరిగేలా కొన్నిరకాల మందులు సిఫారసు చేస్తారు. హార్మోన్లు విడుదలయ్యేందుకు కొన్ని మాత్రల్ని సూచిస్తారు.
ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోతే శస్త్రచికిత్స ఉంటుంది. అప్పుడే అండాల కదలిక సజావుగా, సాఫీగా ఉంటుంది. ఎండోమెట్రియాసిస్ అయితే ల్యాప్రోస్కోపీ ద్వారా నయం చేస్తారు.
పరీక్షలున్నాయి... స్త్రీలకు
వ్యక్తిగత ఆరోగ్య పరీక్ష, వాడే ముందులు, నెలసరి వచ్చే విధానంతోపాటు లైంగికంగా ఎంత చురుగ్గా ఉన్నారనేది గమనిస్తారు. హార్మోన్ల స్థాయులు, అండం విడుదలయ్యే తీరునీ తెలుసుకుంటారు.
గర్భాశయంలోకి ద్రవాల్ని పంపించి, ఎక్సరే తీస్తారు. అది సరిగ్గా ఫెల్లోపియన్ ట్యూబులోకి చేరుతుందా లేదా అనేది గమనిస్తారు. ఎక్కడైనా మూసుకుపోయినట్లుగా ఉంటే... శస్త్రచికిత్స చేస్తారు. దీన్ని హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారు.
ఫెలోపియన్ ట్యూబులు, గర్భాశయం, అండాశయాలు, కటివలయం, పొట్ట భాగాన్ని చిన్న కెమెరా ద్వారా పరీక్షిస్తారు. దీనివల్ల ఆ భాగాల్లోని సమస్యలు తెలుస్తాయి. ఎండోమెట్రియాసిస్, ఫెలోపియన్ ట్యూబులు
మూసుకుపోయి ఉన్నా కనిపిస్తుంది. ఇందుకోసం హిస్టెరోస్కోపీ చేస్తారు.
అండాలు ఎంత మేరకు విడుదల అవుతున్నాయనేది తెలుసుకుంటారు. జన్యుపరమైన లోపాల్ని తెలుసుకునేందుకు పరీక్షలుంటాయి. కటివలయ పనితీరు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ చేస్తారు. క్లమీడియా, థైరాయిడ్ కూడా పరీక్ష చేస్తారు.