22 Vitamins…… విటమిన్స్‌…Vitamin A, Vitamin B, Vitamin B12, Zinc...
header

Vitamins…… విటమిన్స్‌…

శరీరంలో కీలకపాత్ర వహించే విటమిన్స్‌ గురించి....
Vitamin A... విటమిన్ ఎ
కంటి ఆరోగ్యం చక్కగా ఉండి, చూపు చక్కగా కనబడాలంటే శరీరంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండాల్సిందే. విటమిన్ ఎ వలన రకరకాల రంగులను గుర్తించగలం. మసకచీకటిలో దృశ్యాలు కనబడాలంటే విటమిన్ ఎ తప్పనిసరి.
విటమిన్ ఎ ఎక్కువగా క్యారెట్స్, చిగడదుంపలు, గుమ్మడి, మామిడిపండ్లు, నారింజ, కమలా, బత్తాయి పండ్లలో ఉంటుంది. మరియు పాలకూరలో కూడా విటమిన్ ఎ ఉంటుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది
పాలు, వెన్న, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన, కాడ్ చేప కాలేయం, నూనె మొదలగు వాటిలో విటమిన్ ఎ ఉంటుంది.

Vitamin ‘C’…. విటమిన్ ‘సి’….
చిగుళ్లు, తళతళా మెరిసే తెల్లటి పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి కారణం విటమిన్ ‘సి’. ఈ విటమిమిన్ తగినంతగా లేకపోతే స్కర్వీ అనే జబ్బు వస్తుంది. దీంతో చిగుళ్లు మెత్తబడతాయి. వాటిల్లోంచి మాటిమాటికీ రక్తం వస్తుంటుంది. పళ్లు వదులవుతాయి. చిన్న గాయానికే కందిపోతారు
కండరాలు బలంగా ఉండటానికి . ఎముకల్ని పట్టుకొని ఉండే కండర పోచలు (కొలాజెన్ పుట్టడానికీ ) కూడా విటమిన్ సి సాయపడుతుంది. మెదడు నుంచి సమాచారాన్ని చేరవేసే రసాయనాలను ప్రేరేపిస్తూ చురుకుగా ఉంచుతుంది.
విటమిన్ సి తగినంత ఉన్నవారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి జబ్బుల బారిన పడరు. ఎందుకంటే విటమిన్ సి వలన రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరంలో సహజంగా విటమిన్ సి తయారవ్వదు. ఆహారం ద్వారానే లభిస్తుంది.
నారింజ, నిమ్మ, పంపర పనస వంటి పుల్లటి పండ్లలో. బొప్పాయి, స్ట్రాబెర్రీ, పనస, పుచ్చకాయ, యాపిల్, అరటి పండ్లలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
పచ్చగోబీ, క్యాబేజీ, గోబీ పువ్వు, మెంతికూర, టమోటాలు, పాలకూర, చిలగడ దుంప, బఠానీలు, క్యారెట్లు, చింతపండు, బంగాళాదుంప, దోసకాయ, ఉల్లిగడ్డ, పుదీనా, ఉసిరికాయ వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది.
విటమిన్ సి శరీరంలో నిల్వ ఉండను. ఎప్పటికప్పుడు ఆహారం ద్వారా లభించాల్సిందే.

Vitamin K….కె విటమిన్ ...
దీనిని రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ అంటారు.
కె విటమిన్ రసాయన నామం ఫిల్లోక్వినోన్ 1929 లో డ్యానిష్ శాస్త్రవేత్తలు హెన్రిక్ డ్యామ్, ఎడ్వర్డ్ డోయిసీ ఈ విటమిన్ కనిపెట్టారు. కొన్ని సంవత్సరాల పరిశోధనల తర్వాత దీనిని రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ గా తేల్చారు. తర్వాత విటమిన్ కె గాపేరుపెట్టబడింది. వీరికి 1943లో నోబెల్ బహుమతి లభించింది.
ప్రయోజనాలు
ఇది గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేయడం, ఎముకలు విరగకుండా గుండెనూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా హృదయానికి రక్తం సరఫరాచేసే ధమనులు గట్టిపడకుండా చేస్తుంది. ధమనుల గోడలకు క్యాల్షియం పేరుకు పోకుండా ఉంటుంది.
శరీరానికి, గుండెకు రక్తసరఫరాలో అడ్డంకులు లేకుండా చేస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధిని అరికడుతుంది. విటమిన్ ఎ తోపాటు కంటి ఆరోగ్యానికి సాయపడుతుంది.
విటమిన్ కె వలన వ్యాధి నిరోధకశక్తినీ పెరుగుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అప్పుడే పుట్టిన పసి పాపాయిల్లో మాత్రం విటమిన్ కె లోపం ఉంటుంది. తల్లి పాలల్లో చాలా చాలా తక్కువ ఉంటుంది. వారికి వైద్యులు విటమిన్ కె ను ఇంజక్షన్ రూపంలో ఇస్తారు.
పసిపాపాయిలతో పాటు కాలేయ వ్యాధులతో బాధపడేవారిలో విటమిన్ కె ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం పురుషులకు రోజుకు 120 మిల్లీ గ్రాములు, స్త్రీలకు రోజుకు 90 మిల్లీ గ్రాములు ఈ విటమిన్ లభిస్తే చాలు.
ఈ విటమిన్ అన్ని ఆహారపదార్థాల్లోనూ కొద్దిగా ఉంటుంది.. ఎక్కువగా ఆకుకూరలు, బచ్చలి, క్యాబేజీ, కాలీఫ్లవర్, గోధుమ, పచ్చిబఠాణీల్లో చాలాఎక్కువగా ఉంటుంది. అంటే 100 గ్రాముల్లో దాదాపు 400 మిల్లీగ్రాముల నుంచి 700 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. మాంసాహారంలోనూ కొంత ఉంటుంది
కొంత మందికి చిన్నచిన్న ప్రమాదాలకే ఎముకలు పుటుక్కున విరిగి పోతుంటాయి. ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియంతో పాటు విటమిన్ కె తప్పనిసరిగా ఉండాలి. ఈ విటమిన్ శరీరంలో తగినంత పరిమాణంలో ఉంటే..మీఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎముకలు గుల్ల బారకుండా ఉంటాయి

అయోడిన్‌
అయోడిన్‌ శరీరానికి చాలా అవసరం. అయోడిన్‌ శరీరానికి అందకపోతే దాని ప్రభావం థైరాయిడ్‌ గ్రంథి మీద పడుతుంది. గొంతు మధ్యభాగంలో చేతికి కొంచెం ఉబ్బెత్తుగా తగిలేదే థైరాయిడ్‌ గ్రంథి. దీని లోపం వలన ఏ పని చేయబుద్ధి కాదు. బద్ధకం పెరుగుతుంది. మలబద్ధకం ఏర్పడుతుంది. బరువు పెరుగుతారు.
థైరాయిడ్‌ గ్రంథి అతిగా కూడా పనిచేసి పలురకాల ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయాలంటే అయోడిన్‌ అవసరం అయోడిన్‌ తగ్గితే థైరాయిడ్‌ గ్రంథి స్రావకాలు తగ్గుతాయి. అయోడిన్‌ లోపంతో వచ్చే జబ్బు గాయటర్‌. దీని ప్రభావాన హార్మోన్‌ స్రావకం థైరాయిడ్‌ గ్రంథి నుండి తగ్గుతుంది. సముద్ర తీర ప్రాంతంలో నివసించేవారికి అయోడిన్‌ లోపం ఉండదు. అయోడైజ్డ్‌ ఉప్పు తీసుకుంటే సమస్య పరిష్కారం కావచ్చు. అయోడైజ్డ్‌ ఉప్పులో అయోడిన్‌ ఉంటుంది

Vitamin E....విటమిన్‌ ఇ
విటమిన్‌ ఇ శరీరానికి ఎంతో కీలకమైనది విటమిన్‌ - ఇ తగినంత అందకుంటే శరీరంమీద ప్రభావం చూపుతుంది. విటమిన్‌ ఇ లోపిస్తే కంటిచూపు మందగిస్తుంది
కండరాల బహీనత, కండరాల పనితీరులో లోపం ముఖం ఇతర శరీరభాగాల మీద వయసుతో వచ్చే బలహీనతలు కండరాల పనితీరులో లోపం, ముఖం మీద ఇతర శరీరభాగాల మీద వయసుతో వచ్చే మచ్చలు ఏర్పడటం జరుతుంది. కండరాలను కదిలించాలనుకున్న రీతిలో కదిలించ లేకపోయిన ఇబ్బంది వలన కాళ్ళు చేతుల కదలికలో తేడా వస్తుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ నిర్వహించే పాత్రను విటమిన్‌ ఇ పోషిస్తుంది. సాధారణంగా కండరాలలో పాలీఅన్‌ సాట్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఆక్సీకరణం చెందటం వలన కండరంలోని కణాలు దెబ్బతింటాయి. అటువంటి చర్యలను వేగవంతం కాకుండా నిరోధిస్తుంది విటమిన్‌ ఇ.
సూర్యకాంతిలోని అతినీలోహిత కిరణాల ప్రభావం శరీరం మీద పడుతుంది. వీటి ప్రభావాలతో వయసుతో వచ్చే మార్పులు, వయసు రాక ముందే కనిపించటం మొదలు పెడతాయి. కళ్ళ క్రింది చర్మం మడతలు, శరీరం ఇతర భాగాలలో చర్మం మడతలు వంటివి వయసుతో వచ్చే లక్షణాలు. ఇటువంటి మార్పులు రాకుండా చూడటం, ఒకవేళ ఆరంభమైతే వాటిని నిరోధించి తిరిగి సాధారణ స్థితికి చేర్చటం అనేవాటిని విటమిన్‌ ఇ చేస్తుంది. కాలేయం, క్లోమం, పిత్తాశయం వంటి గ్రంథుల పనితీరులో తేడా ఏర్పడినపుడు జీర్ణమైన ఆహారపదార్థాలు పేగులలో శోషణ చెందటంలో తేడా చేస్తుంది. దీనివలన విటమిన్‌ ఇ లోపం ఏర్పడుతుంది.
కొవ్వుపదార్థాలు ఉన్న పదార్థాలు అధికంగా తీసుకున్నప్పుడు ఈ ఇబ్బంది ఏర్పడవచ్చు. కాబట్టి విటమిన్‌ ఇ సమృద్ధిగా అభించే ఆహార పదార్థాలైన యాపిల్‌, పచ్చిమామిడి పండ్లు, తోటకూర వంటి ఆకుకూరలు, ఆలివ్‌ ఆయిల్‌, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె వంటివి వాడకం పెంచటం ద్వారా విటమిన్‌ ఇ ని పెంచుకోవచ్చు

Vitamin D....విటమిన్‌ డి
విటమిన్‌ డి ఎండనుంచి ఎక్కువగా లభిస్తుంది. ఎండ పుష్కలంగా ఉండే భారతదేశంలో 95 శాతం భారతీయులలో విటమిన్‌ డి లోపం ఉండటం ఆశ్ఛర్యకరం. కండరాల బాధ, అలసట, కంటరాలు పట్టేయటం, ఎముకల నొప్పులు విటమిన్‌ డి లోపం వలన వస్తాయి. సంవత్సరంలో 9 నెలల పాటు ఎండ ఉండే భారతదేశంలో విటమిన్‌ డి లోపానికి ప్రధాన కారణం పట్టణ ప్రాంతాలలో ఎండపడని ఇళ్ళు
ఎండ తాకక పోతే విటమిన్‌ డి లోపం ఏర్పడుతుంది. సూర్యకాంతి శరీరం మీద పడితే శరీరం లోపల విటమిన్‌ డి తయారవుతుంది. విటమిన్‌ డి లోపిస్తే గుండెజబ్బులు, ఎముకల జబ్బు, క్లోమగ్రంథి, క్యాన్సర్‌, మూత్రపిండాలు, కాలేయ జబ్బు, టి.బి. మూర్చ వంటి జబ్బులు వస్తాయని నిపుణలు అంటారు.విటమిన్‌ డి పొందటానికి ఉదయం, సాయంత్రపు ఎండలో నడక, డాక్టర్‌ పర్వవేక్షణలో విటమిన్‌ డి మాత్రల వాడకం వంటివి చేయాలి
ఎండ ప్రయోజనాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది విటమిన్‌ డి. ఇది అన్ని విటమిన్ల లాంటిది కాదు. ఆహారం ద్వారా లభించేది కొద్దిగానే. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల సాయంతోనే మన చర్మం దీన్ని చాలావరకు తయారు చేసుకుంటుంది. మన శరీరంలోని ప్రతి కణంలో సుమారు 25,000 నుంచి 35,000 జన్యువులుంటాయి. వీటిల్లో దాదాపు 3వేల జన్యువులపై విటమిన్‌ డి ప్రభావం చూపుతుంది. తిన్న ఆహారంలోని క్యాల్షియాన్ని శరీరం సక్రమంగా గ్రహించుకోవటానికి విటమిన్‌ డి అత్యావశ్యకం. ఎముకలు ఏర్పడటానికి, బలోపేతం కావటానికి, క్షీణించకుండా ఉండటానికి క్యాల్షియం అత్యవసరమన్నది తెలిసిందే. రోగనిరోధకశక్తి పుంజుకోవటంలోనూ విటమిన్‌ డి కీలకపాత్ర పోషిస్తుంది. తెల్లరక్తకణాలు చురుకుగా పనిచేసేలా చూస్తూ.. హానికారక క్రిములతో శరీరం సమర్థంగా పోరాడటంలో సాయం చేస్తుంది. రక్తనాళాలను ఆరోగ్యంగానూ ఉంచుతుంది. అంతేకాదు.. క్లోమంలోని బీటా కణాలను ప్రేరేపించి ఇన్సులిన్‌ ఉత్పత్తి సజావుగా సాగేలా కూడా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే- విటమిన్‌ డి కణ విభజనను నియంత్రించటం. అంటే ఇది క్యాన్సర్లు దరిజేరకుండానూ కాపాడుతుందన్నమాట. తగినంత విటమిన్‌ డి గలవారికి పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, క్లోమ క్యాన్సర్‌ వంటి రకరకాల క్యాన్సర్ల ముప్పు 60% తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎంతోమంది నిస్సత్తువ, నీరసం, కండరాల నొప్పుల వంటి వాటితో బాధపడటం చూస్తూనే ఉన్నాం.
వీటికీ విటమిన్‌ డి కళ్లెం వేస్తుంది. అంతేనా? నాడుల పనితీరునూ మెరుగుపరుస్తుంది. ఇలా నడుస్తున్నప్పుడు తూలిపోవటం, పాదాలకు స్పర్శ తగ్గటం వంటి సమస్యలు దరిజేరకుండానూ కాపాడుతుంది. అందుకే దీన్ని ఆధునిక కాలంలో ముంచుకొస్తున్న జీవనశైలి సమస్యలన్నింటికీ సంజీవని అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎలాంటి ఖర్చు లేకుండా.. కోరినవారికి కోరినంత అందించేది సూరీడే! అరగంట సేపు చర్మానికి ఎండ తగిలితే 50,000 ఐయూల విటమిన్‌ డి రక్తంలోకి విడుదలవుతుంది. అదే మనలాంటి ముదురు చర్మం గలవారిలోనైతే 8,000-10,000 ఐయూల విటమిన్‌ డి ఉత్పత్తి అవుతుంది.

Vitamin B12...విటమిన్‌ బి12
భారతదేశంలో దాదాపు 60 శాతం మందికి విటమిన్‌ బి12 లోపం ఉందనేది వాస్తవం. ఇది ఆందోళన కలిగించే విషయం. కండరాల బలహీనత, జ్ఞాపక శక్తి మందగించటం, పాదాలు, చేతివేళ్ళ చివర తిమ్మిర్లు ఏర్పడటం, నిరంతర అలసట, కాళ్ళు చేతులు నీరసం రక్తహీనత వంటి వన్నీ విటమిన్‌ బి12 లోపం వలన వస్తాయి. విటమిన్‌ బి12 లోపిస్తే డి ఎన్‌ ఎ సక్రమంగా ఏర్పడదు. పోషకపదార్థాల లోపం వలన ఈ సమస్య వస్తుంది.
పచ్చిపాలలో విటమిన్‌ బి12 ఉంటుంది. మధుమేహ రోగులు వేసుకునే మెట్‌ఫార్మిన్‌ వంటి కొన్నిరకాల మందుల ప్రభావాన శరీరంలో విటమిన్‌ బి12 స్థాయి పడిపోతుంది.
విటమిన్‌ బి12 దంపుడు బియ్యంలో సమృద్ధిగా ఉంటుంది. ముతక బియ్యం, మాంసం, చేపలలో విటమిన్ బి12 ఉంటుంది. విటమిన్‌ బి12 స్ఠాయి మరీ తక్కువగా ఉన్న వారు డాక్టర్‌ పర్వవేక్షణలో వారానికి ఒక మాత్ర వేసుకోవాలి.

జింక్‌
శరీరానికి జింక్‌ చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. జింక్‌ లోపం వలన రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడు. పిల్లలలో ఎదుగుదల ఉండదు. తరచుగా అంటురోగాల బారిన పడతారు. ఆకలి మందగిస్తుంది. సులభంగా అలసిపోతారు. ఎప్పుడూ చిరాకుగా ఉంటారు. మన శరీరంలో కీలక గ్రంథి అయిన క్లోమగ్రంథి పని తీరుమీద జింక్‌ ప్రభావం ఉంటుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్‌ తగు మోతాదులో ఉత్పత్తికాదు. మథుమేహ వ్యాధితో బాధపడే వారిలో, గుండెజబ్బులు కలవారిలో జింక్‌ లోపం కనిపిస్తుంది. శాకాహారులకు జింక్‌లోపం ఏర్పడే అవకాశం అధికం. వారు తినే కూరగాయలు, పండ్లలో జింక్‌ పరిమితంగానే లభిస్తుంది. బఠాణీ, చిక్కుడు, వంటి వాటితో పాటు సముద్రపు చేపలు వంటి వాటిలో జింక్‌ ఎక్కువగా ఉంటుంది.

పొటాషియం
పొటాషియం లోపిస్తే కండరాల నొప్పులు, కండరాలు పట్టేయటం, గుండె కొట్టుకునే తీరులో మార్పులు, పాదాలు, చేతులు కదిలించటంలో లోపాలు వస్తాయి. శరీరంలో కండరాల పనితీరు సక్రమంగా వుండేలా చేయగలిగినది పొటాషియం. గుండె, మూత్రపిండాల పనితీరును సక్రమంగా వుంచి, వాటికి రోగాలు రాకుండా కాపాడేది పొటాషియం. పండ్లు, కూరగాయలలో పొటాషియం లభిస్తుంది. తగినంత నీరు తాగక పోవటం, పోషకపదార్ధాల లోపం, కొన్ని రకాల రోగాల వలన పొటాషియం లోపం ఏర్పడుతుంది. విరేచనాలకు, మూత్రానికి సంబంధించిన మందులు అధికంగా వాడే వారిలో పొటాషియం మూత్రపిండాల గుండా అధికంగా బయటకు పంపబడుతుంది. వీరు వైద్యుని చేత పరీక్ష చేయించుకోవటం అవసరం. అరటిపండ్లు, కొబ్బరి, బత్తాయి, కమాలాపండు వంటివన్నీ పొటాషియం స్థాయిని నియంత్రిస్తాయి. డయాబెటిక్‌ రోగులకు మాత్రం పొటాషియం కృత్రిమంగా బిళ్ళలు లేదా ఇంజక్షన్ల రూపంలో ఇచ్చి శరీరంలో దాని స్థాయి పడిపోకుండా చూస్తారు.

మాంగనీస్‌
మాంగనీస్‌ లోపం వలన కండరాలు పట్టేయటం కాలి కండరాల క్రాంప్‌ కండరాలకు ఇతర ఇబ్బందులు వస్తాయి. ఆహార పదార్థాలన్నింటిలోను పొటాషియం ఉంటుంది కాబట్టి సాధారణంగా పొటాషియం లోపం ఏర్పడదు. పోషక పదార్థాల లోపం ఏర్పడితే మాంగనీస్‌ లోపం ఏర్పడుతుంది. అతిగా విరేచనాలు అయిన వారిలో ఈ లోపం కనిపిస్తుంది. ఫైనాపిల్‌, వెల్లుల్లి, వంగ, దాల్చినచెక్క, నట్స్‌ వంటి ఎండుపండ్ల ద్వారా మాంగనీస్‌ పొందవచ్చు. మరీ తక్కువైతే మాత్రం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.