header

Vitiligo ….. బొల్లి

Vitiligo ….. బొల్లి

డా. మాధవీరెడ్డి, డెర్మాలజిస్ట్‌, ఓలీవా అడ్వాన్స్‌డ్‌ హెయిర్‌ అండ్‌ స్కిన్‌ క్లినిక్‌, హైదరాబాద్‌
చర్మానికి రంగునిచ్చే పదార్థాన్ని పిగ్మంట్ అని అంటారు. దీనితో చర్మానికి రంగు వస్తుంది. కొందరికి ఈ పిగ్మంట్ లోపించటం వలన కొన్ని చోట్ల చర్మం రంగు కోల్పోతుంది. దాంతో చర్మంపై అక్కడక్కడా రంగులేని ప్రాంతాలు ఉండటంతో చర్మం మచ్చలు మచ్చలుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నొప్పి ఉండదు. తెల్ల మచ్చలతో కనిపించే ఈ కండిషన్‌ వలన ఎలాంటి హానీ ఉండదు. ఇలా మచ్చలు పడే పరిస్థితిని బొల్లి అంటారు. దీన్ని ఇంగ్లీష్‌లో విటిలిగో అంటారు. కొందరిలో ఈ మచ్చలు వ్యాప్తి చెందవు మరికొందరిలో నిదానంగా వ్యాప్తి చెందుతాయి. అయితే ఇంకొందరిలో వేగంగా వ్యాపిస్తాయి.
బొల్లికి కారణాలు ... : మనకు రోగనిరోధక శక్తిని కల్పించాల్సిన అంశాలు బయటి కణాలను అంటే... బయటి నుంచే సోకే బ్యాక్టీరియాను, ఇతర బయటి కణాలను దెబ్బతీయాలి. దానికి బదులుగా సొంత చర్మంలోని కణాలను దెబ్బతీస్తాయి. దాంతో చర్మానికి రంగునిచ్చే మెలనిన్‌ కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా చర్మంపై రంగు కోల్పోయిన ప్రాంతం తెల్లగా పాలిపోయినట్లుగా అవుతుంది. ఇలాంటి మచ్చలు శరీరంపై పొరలు, పొరలుగా కనిపిస్తూంటాయి. చర్మంపై ఇలా మచ్చలు వచ్చే కండిషన్‌ వారసులకు తప్పనిసరిగా సంక్రమించక పోయినా వచ్చే అవకాశాలు ఎక్కువే.
ఈ మచ్చలు సాధారణంగా చేతులు, పాదాలు, భుజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలలు, నోటి చుట్టూ, కంటి చుట్టూ, మర్మావయావాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడుగా విటిలిగో ఉన్నవారికి ఆ మచ్చలున్నచోట (మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలో) వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి.చర్మం నల్లగా ఉండే వారిలో ఈ గుణం ప్రస్పుటంగా కనిపిస్తుంది.
వైద్య చికిత్స ప్రక్రియలు : ఈ తెల్ల మచ్చలు ఎలాంటి హాని చేయవు కాబట్టి విటిలిగో వచ్చిన వారికి ఆ ప్రాంతంలో చర్మం తెల్లగా కనిపించకుండా చికిత్స చేయడం ప్రధానం. అయితే విటిలిగో చికిత్స దీర్ఘకాలం పాటు కొనసాగాలి.
శరిరంపై ఉండే మచ్చల సైజు, ప్రాంతం, ఏ మేరకు విస్తరించి ఉంది వంటి అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. వేర్వేరు రోగులకు వేర్వేరు చికిత్స ప్రక్రియలు అవలంభించాల్సి ఉంటుంది. అయితే చికిత్సకు గుణం కనిపించడం కూడా వ్యక్తికీ, వ్యక్తికీ మారుతుంటుంది.
ఒకరకమైన చికిత్సతో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్‌ కణాలు మరింతగా నాశనమైపోకుండా చేస్తారు. అంతే కాదు... దానితో పాటు మళ్ళీ రంగు వచ్చేలా చేస్తారు.
స్టెరాయిడ్‌ క్రీములు పైపూతగా వాడే విధంగా కొన్ని రకాల స్టెరాయిడ్‌ క్రీములు, టాక్రోలిమస్‌ క్రీములు రాస్తారు. అవి చర్మం మామూలు రంగును సంతరించుకోడానికి మాత్రమే కాకుండా, మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి.
వేర్వేరు సైజుల్లో మచ్చలు : కొందరిలో ఈ తెల్ల మచ్చలు వచ్చి అవి పెరగవు దాంతో చిన్నవిగా ఉంటాయి. కొందరిలో మాత్రం ఇవి విస్తరిస్తూ ఒకదానితో మరొకటి కలిసిపోవడం వల్ల శరీరమంతా తెల్లగా అనిపిస్తుంది. ఈ మచ్చలు కనిపించే తీరును బట్ట వీటిని మూడు రకాలు చెప్పవచ్చు.
ఫోకల్‌ పాటర్న్‌ : ఈ తెల్లని మచ్చలు చర్మంలో ఏదో ఒక చోటికి మాత్రమే పరిమితం కావటం.
పెగ్మంటల్‌ పాటర్న్‌ : ఈ మచ్చలు శరీరం అంతా కాకుండా ఏదో ఒకవైపునకే అంటే మందు వైపునకు లేదా వెనుక వైపునకు పరిమితం కావటం.
జనరలైజ్‌డ్‌ పాటర్న్‌ : ముందు చెప్పిన విధంగా కాకుండా ఒక చోటికి మాత్రమే పరిమితం కాకుండా అనేక ప్రాంతాలకు ఒక వైపునకు మాత్రమే ఉండకుండా శరీరమంతా కనిపించటం.
ఫోటో థెరపి : టాబ్లెట్లు, లోషన్‌ రూపంలోని సోరాబెన్స్‌ అనేమందు ఈ చికిత్సలో ఉపయోగపడతాయి. వీటిని సూర్వరశ్మికి ఎక్స్‌పోజ్‌ అవుతూ వాడాల్సి ఉంటుంది. సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయెలెట్ కిరణాలకు కూడా ఎక్స్‌పోజ్‌ చేయవచ్చు. ఫోటో ధెరపీని నిపుణులైన డెర్మాలజిస్టుల ఆధ్యర్వంలో ప్రత్యేక ఫోటోధెరపీ ఛాంబర్లలో చేయాలి.ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య చికిత్సల పద్ధతుల వలన విటిలిగో రోగులు మునుపటిలా బాధపడాల్సిన అవసరం లేదు.ఈ వైద్యంకోసం అనేక ప్రక్రియలు ఉన్నందున చర్మవ్యాధుల నిపుణుల సహాయంతో చికిత్స తీసుకోవచ్చు.
శస్త్రచికిత్స :
ఆధునిక శస్త్ర చికిత్సలో భాగంగా ఇప్పుడు చర్మంపై ఇతరచోట్ల ఉండే రంగునిచ్చే పిగ్మంట్ కణాలను అవి కోల్పోయిన ప్రాంతంలో అమర్చేందుకు అవకాశం ఉంది. అయితే ఇతర సాధారణ చికిత్స ప్రక్రియల వల్ల సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. చర్మం కప్పబడి ఉండే కొన్ని ప్రాంతాల్లో (అంటే పెదవులు, చేతులు, కాళ్ల చివరన ఉండే భాగాలు) సాధారణ చికిత్స ప్రక్రియల వల్ల అంతగా సత్ఫలితాలు ఉండవు అప్పుడు ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. అయితే మచ్చలు వ్యాప్తి చెందని పేషంట్లకు మాత్రమే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. (వ్యాప్తి చెందక పోవటం అంటే ఒక ఏడాది కాలంలో మచ్చ సైజు విస్తరించకపోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తి చెందని పేషంట్లుగా పరిగణిస్తారు) ఈ సర్జికల్‌ ప్రక్రియ ఇతరచోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్‌ చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మంట్ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకు.. సర్జరీ తర్వాత కూడా సాధారణ వైద్యచికిత్స అవసరం కావచ్చు