Seven Sages/Saptarshulu…సప్తర్షులు
కశ్యప మహర్షి లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి తండ్రి. నేలలో ఏం దాగుందో, నీటిలో ఏం దాగుందో, తేజస్సులో ఏముందో ఇలా పంచభూతాల్లోనూ దాగి వున్నదేమో అర్థమయ్యే విథంగా పరిశోథనలు చేసి ఆ ఫలితాన్ని మనకి అందించిన మహానుభావుడు. దశావతారాలో ఐదవ అవతారమైన వామనుడి తండ్రి.
అత్రి ఈయన బ్రహ్మ మానస పుత్రుడు. ఇతని భార్య అనసూయ. ఈ దంపతులకి శ్రీహరి పుడుతూ తనని తాను అర్పించుకుంటునట్లు ప్రకటిస్తూ స్యయంగా శ్రీహరి దత్తాత్రేయుడిగా అవతారమెత్తాడు.
భరధ్యాజుడు బృహస్పతి పుత్రుడు. శ్రీరామచంద్రునికి అరణ్యంలో దోవ చూపినవాడు, వనవాసానికి వెళ్లిన రాముని వద్దకు భరతుడు సైన్యంతో సహా వస్తుంటే, భరతుని అభిప్రాయాన్ని లోకానికి తెలియచేయ దలచి పరీక్షకు గురి చేసినవాడు, భరతునికి సైన్యంతో సహా తన అపూర్వ తపశ్శక్తితో ఆతిధ్యమిచ్చిన మహర్షి. ప్రాణాయామ పద్ధతిని లోకానికి పరిచయం చేసి ఆరోగ్యాన్ని రక్షించుకోవసిందని చెప్పినవాడు.
విశ్యామిత్రుడు గాధి సుతుడు. మొదట రాజు. తరువాత రాజర్షి, బ్రహ్మర్షి అయ్యాడు. ఏ అక్షరానికి ఎంత శక్తి ఉన్నదో గమనించి అలాంటి 24 అక్షరాలతో గాయత్రీ మంత్రాన్ని సమకూర్చి తాను ఉపాసించి ఆ మంత్రశక్తిని లోకానికి అందించిన మహర్షి. రాజు కాబోయే వానికి తాను పరిపాలించవసిన ప్రదేశాల మీద అవగాహన ఉండాలని తెలియజేసేందుకు రామునికి ఆయా దేశాల చరిత్రని వివరించి చెప్పాడు.
గౌతముడు వేదాంగాల్లో ఒకటైన న్యాయ దర్శనకర్తగా ప్రసిద్ధుడు. అహ్యల ఇతని భార్య. నిత్యం తపస్సు చేసుకుంటూ ఆ శక్తిని ధార్మికులైన వారికి చెందేలా చేసిన ఉత్తముడు.
వశిష్ట మహర్షి ఇక్ష్యాకుల కుల గురువు. మహా పతివ్రత అయిన అరుంధతీ ఈయన భార్య. భారతీయ వివాహవ్యవస్థలో దంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయిస్తారు. రామునికి సూర్యవంశ తపశ్శక్తిని అందిస్తూ మార్గదర్శనం చేసినవాడు
జమదగ్ని రుచీకుని పుత్రుడు. రేణుకా దేవి ఇతని భార్య. పవిత్రంగా వెలిగే అగ్నిహోత్రంలా ఉంటూ ఏనాడు ఏ దోషాన్ని చేయకుండా ఉండి దేవతా ప్రశంశలు అందుకున్నవాడు. 21 సార్లు క్షత్రీయులను కడతేర్చిన పరశరాముని తండ్రి.