telugu kiranam

Why Trees are worshipped...చెట్లను పూజించడం ఎందుకు?

Why Trees are worshipped...చెట్లను పూజించడం ఎందుకు?

హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి మన భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించడం ఆచారంగా వస్తోంది. అందులో ముఖ్యంగా తులసీ మొక్కలను ఇంటి గుమ్మం ఎదురుగా పెంచుకుని, ఉదయాన్నే లేవగానే ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. అలాగే కొన్ని జంతువులను కూడా పవిత్రంగా భావించడం ఇప్పటికీ మనం గమనించవచ్చు. అయితే కొంతమంది ఇటువంటి వాటిని మూఢనమ్మకంగా వ్యవహరించి అస్సలు పట్టించుకోరు. మరికొందరికి ఇలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ నిత్యం పూజలు మాత్రం చేస్తూనే వుంటారు. ఆ విధంగా పూజలు ఎందుకు నిర్వహిస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం....
యావత్ సృష్టినే ఏర్పాటు చేసిన ఆ భగవంతుడు మానవ సంరక్షణ కోసం మొక్కలు, జంతువులను సృష్టించాడు. మనలో ఏ విధంగా అయితే దేవుడు జీవశక్తిగా వున్నాడో... అలాగే వృక్షాలలో, జంతువులలో కూడా కొలువై వున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆనాటి పూర్వీకులు.. అప్పటి నుంచే వీటిని ఎంతో పవిత్రంగా పరిగణించడం జరిగింది. అంతేకాకుండా... మానవుని దైనందిన జీవితం కూడా ఈ వృక్షాలు, జంతువుల మీదే ఆధారపడి వుంది. మానవునికి కావలసిన ప్రాణవాయువు (ఆక్సిజన్)ను మొక్కలు ప్రసాదిస్తాయి. పోషక విలువలు కలిగిన పళ్లను, ఔషదాలను ప్రసాదిస్తాయి.
అలాగే జంతువుల నుంచి వస్త్రాలు, వసతులు కూడా లభిస్తాయి. మానవుని ప్రాణాధారానికి కావలసిన ఎన్నో వనరులను ఇవి సమకూరుస్తాయి. ఇవి మాత్రమే కాకుండా.. మన చుట్టూ వున్న పరిసరాలను అందంగా మార్చి, మనలో ఆహ్లాదాన్ని పెంపొందిస్తాయి. దీనిని బట్టి చూస్తే.. మనం వాటికి ఎటువంటి ఉపకారం చేయకపోయినా అవి మనకు ఎంతగానో సహాయపడుతున్నాయి. మానవుల నుంచి ఏమీ కోరుకోకుండా నిస్వార్థంగా జీవకోటికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అందువల్ల మన పూర్వీకులు వీటిని ఎంతో భక్తితో పూజించి, అంతరించిపోకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకునేవారు. సాధారణంగా ఈ వృక్ష, జంతు సమూహాలు మానవజాతి కంటే ముందే భూమి మీద ఏర్పడ్డాయి. అయితే మానవ సమూహం సృష్టించబడినప్పటి నుంచి వాటికి ఎంతో నష్టం కలుగుతోంది. మానవుడు తన అవసరాల మోతాదుకు మించి అనేక రకాలుగా ఉపయోగించడం వల్ల అవి అంతరించిపోతున్నాయి. దీనిని ముందే గ్రహించిన పూర్వీకులు, చెట్లను ఎంతో పవిత్రంగా చూసుకోవాలని, వాటికి నిత్యం పూజలు నిర్వహించుకోవాలని బోధిస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ వాటిని పట్టించుకోవడం లేదు.
పురాతన గ్రంథాల ప్రకారం.. చెట్లను నరికేయడం వల్ల ‘‘శూనా’’ అనే పాపం వస్తుందని, దానివల్లే జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుంటారని పేర్కొనబడింది. అందువల్ల చెట్లను నరకకూడదని గ్రంథాలలో చెప్పబడి వుంది. ఒకవేళ చెట్లను నరికేస్తే.. ఆ శూనా అనే పాపం తగలకుండా వుండడానికి ముందు క్షమాపణ చెప్పుకోవాలని, అందుకు చెట్లను పూజించాలని శాస్త్రాలలో రచించబడివున్నాయి. మౌనంగానే వుంటూ మనకు ప్రాణానికి అవసరమైన వనరులను అందించడంతోపాటు జ్ఞానాన్ని, పాఠాలను బోధిస్తున్న ఈ చెట్ల గొప్పతనాన్ని ప్రతిఒక్కరు తెలుసుకుని, వాటిని పవిత్రంగా భావించి, ప్రకృతిని కాపాడుకోవడం అసలైన నాగరికులుగా మన బాధ్యతను నిర్వర్తిస్తామని ఆశిస్తూ....