ఊటి: సుందరమైన హిల్ స్టేషన్స్ కు రారాజు వంటిది ఊటి. ఉదకమండలంనే ఊటి అని అంటారు. భారతదేశంలోని దక్షిణాదిన తమళనాడులో పశ్ఛిమ కనుమలలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం. నీలగిరి జిల్లా కేంద్రం ఊటి. కాఫీతోటలు, టీ తోటలు ఇంకా అనేక రకాల చెట్లతో పచ్చగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 25 డిగ్రీలకు మించదు. చలికాలంలో 5 డిగ్రీల నుండి 21 డిగ్రీలకు వరకు ఉంటుంది. తోడాలు అనే స్థానిక గిరిజనుల నివాస ప్రాంతం ఇది. బ్రిటీష్ వారి కాలంలో ఊటి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా రైలు మార్గం వేయబడింది. ఊటిలో కూనూరు (ఊటి నుండి 19 కి.మీ) కొత్తగిరి (ఊటి నుండి 31 కి.మీ) మరి రెండు హిల్ స్టేషన్స్. పర్యటనుకు సాధారణంగా ఏప్రియల్ నుండి జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనుకూలం. స్థానికంగా తమిళం, కన్నడం, మళయాళం, ఇంగ్లీష్ మరియు బాడగ భాషలు మాట్లాడతారు. ఊటిలో చూడవలసినవి : గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్ 22 హెక్టార్లలో విస్తరించి ఉన్నవి. 1847 సం.లో మద్రాస్ గవర్నర్ చే ఏర్పాటు చేయబడ్డవి. ఈ బొటానికల్ తోటలు 6 భాగాలుగా విభజించబడినవి. 1. లోయర్ గార్డెన్ 2. న్యూ గార్డెన్ 3. ఇటాలియన్ గార్డెన్ 4. కన్సర్ వేటరీ 5. ఫౌంటెన్ టెర్రాస్ 6. నర్సరీ అరుదైన చెట్లజాతితో, సన్నజాజి పొదలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మంకి ఫజిల్ ట్రీ అనే ఒకరకమైన చెట్లమీద కోతులు కూడా ఎక్కలేవు. ఇటాలియన్ ఫ్లవర్ గార్డెన్ లో చెరువు అనేకరకాల ఆర్కిడ్ మరియు పూల పోదలతో కనువిందు చేస్తుంది. ప్రతి సంవత్సరం మే నెలలో అరుదైన పూలతో ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ గార్డెన్స్ ను తమిళనాడు హార్టికల్చర్ వారు నిర్వహిస్తున్నారు. రోజ్ గార్డెన్ : ఈ ప్రాంతంలో చూడవలసినది 4 హెక్టార్లలలో విస్తరించి ఉన్న రోజ్ గార్డెన్. రోజ్ గార్డన్ ఉదకమండలం రైల్వే స్టేషన్, బస్టాండ్ కు కేవలం 1 కిలో మీటరు దూరంలో ఉన్నది. మొత్తం 20,000 రోజామొక్కలు 2,241 జాతులకు చెందినవి ఇక్కడ పెంచబడుచున్నవి. ఇక్కడ వున్న నీలమడం అనే ప్రాంతనుండి రోజ్ గార్డెన్ మొత్తం దృశ్యాన్ని చూడవచ్చు. లేక్ పార్క్ : ఊటి రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు సమీపం ఉన్న లేక్ పార్క్ 1977 సం.లో ఏర్పాటు చేయబడ్డది. స్థానికులకు మరియు పర్యాటకులకు మంచి పర్యాటకస్థలం. ఊటి లేక్ : 1824 సం.లో జాన్ సులివాన్ (కోయంబత్తూరు కలక్టర్) చే ఈ కృత్రిమ సరస్సు 65 ఎకరాలలో ఏర్పాటు చేయబడినది. ఈ చెరువు చేపలకు ప్రసిద్ది. బోటింగ్ సౌకర్యం కలదు మరియు మిని ట్రయిన్ కూడా కలదు. జింకలపార్క్ : ఈ ప్రాంతంలో మరొక ప్రధాన ఆకర్షణ 1986 సం. లో 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడ్డ జింకల పార్క్. కాని 6 ఎకరాలు మాత్రమే అభవృద్ధి చేయబడి వన్యప్రాణులకు ఆవాసం కల్పించబడుచున్నది. దగ్గర నుండి వన్యప్రాణులను చూడవచ్చు. మ్యూజియం : ఊటి – మైసూర్ రోడ్ లో ప్రభుత్వం వారిచే ఏర్పాటు చేయబడ్డ మ్యూజియంలో ఆటవికులకు చెందిన వస్తువులు, చేతితో తయారు చేయబడ్డ వస్తువులు మొదలగునవి చూడవచ్చు. ఆర్ట్ గ్యాలరీ : ఉదకమండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో మైసూర్ రోడ్లో ఉందీ ఆర్ట్ గ్యాలరీ. సమకాలీన పెయింటింగ్స్, శిల్పాలు ఇక్కడ చూడవచ్చు. ఊటిలో బస చేయటానకి పూర్తి సౌకర్యాలతో గల కాటేజ్ లు, హోటల్స్ కలవు. ఇంకా ఊటి చుట్టూ అనేక పర్యాటక ప్రాంతాలున్నవి. వాటి వివరాలకు మరియు పూర్తివివరాలకు తమిళనాడు టూరిజం వారి ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి Tamilnadu Tourism Website ఎలా వెళ్ళాలి : దగ్గరలో గల విమానాశ్రయం కోయంబత్తూరు (ఊటికి 104 కి.మీ. దూరం) కోయంబత్తూరు మరియు చెన్నై నుండి మొట్టుపాలెం అక్కడ నుండి ఊటికి రైలు మార్గంలో వెళ్ళవచ్చు. మద్రాసులో అనేక ప్రాంతాల నుండి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు.