అరకువ్యాలి విశాఖపట్నం, డుంబ్రిగూడ మండలానికి చెందిన గ్రామము. అరకులోయ సముద్ర మట్టానికి సుమారు 600 నుండి 800 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ పట్నానికి 115
కి.మీదూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొండలతో, లోయలతో పర్యాటకులకు కనువిందు చేస్తంది. విశాఖపట్నం నుండి అరకు లోయకు వెళ్ళే దారిలో ఘాట్ రోడ్డుకు
ఇరువైపులా ఉండే దట్టమైన అడవుల గుండా ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో ఉన్న కాఫి తోటలు ఉన్నాయి. అరకు లోయ అంతా పూలతోటలతో ఉండి ప్రయాణం
ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇంకా పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, ప్రభుత్వశాఖ వారి మల్బరీ తోటలు, సిల్క్ ఫారంలు కూడా అరకు దారిలోనే ఉన్నాయి.
ఇక్కడ కాఫీతోటలు ప్రసిద్ది. గిరిజనులు పండించే రసాయనిక మందులు వాడని కాఫీ పౌడర్ అరకు ఎమరాల్డ్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతుంది.
సంవత్సరంలో ఎప్పుడైనా అరకు వెళ్ళవచ్చు. ఎండాకాలంలో వెళితే ఎండల నుండి బయటపడవచ్చు. చలికాలంలో అయితే పలిస పూలతో కొండలన్నీ పసుపు వర్ణంతో ఎంతో
అందంగా ఉంటాయి. వర్షాకాలంలో పచ్చదనంతో వాతావరణం కళకళలాడుతూ ఉంటుంది. ఈ సీజన్లో వెళ్ళేవారు గొడుగులు, రైన్ కోట్లు. తగిన జాగ్రత్తలతో వెళ్ళటం మంచిది.
చలికాలం వాతావరణం 4 డిగ్రీలకు పడిపోతుంది. సామాన్యంగా ఆగస్ట్ నెల తరువాత పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది.
అరకు లోయ ఆకర్షణలు :
గిరిజనులు తయారు చేసే వస్తువులు,
గిరిజనాభివృద్ధి సంస్ధ అమ్మే స్వచ్ఛమైన తేనె మొదలగుననవి కొనవచ్చు. ఇక్కడికి 15 కి.మీ దూరంలో ఉన్న తాటిదూడ, కటికి, చప్పరాజ్ అనేవి మంచి పిక్నిక్ ప్రదేశాలు.
ట్రైబల్ మ్యూజియం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి స్థానిక 19 తెగల గిరిజనులు తమ పురాతన సంస్కృతిని కాపాడుకుంటూ నివసిస్తున్నారు. ఇక్కడ ఇటికాల పొంగల్ అనే పండుగ రోజున చేసే థిమ్సా మరియు సాంప్రదాయక నృత్యాలు ఇప్పుడు రోజూ పర్యాటకుల కోసం ప్రదర్శిస్తారు. సముద్రమట్టానికి 3,800 అడుగుల ఎత్తు ఉన్న గాలికొండలు అనే ప్రదేశాన్నుంచి అరకు లోయ మొత్తాన్ని చూడవచ్చు.
ప్రయాణ సౌకర్యాలు :
విశాఖపట్నం నుండి రోడ్డు మరియు రైలు మర్గాల
ద్వారా వెళ్ళవచ్చు. ఈశాన్య రైల్వే లైన్ లో కొత్తవలస – కిరండల్ మార్గంలో అరకు, అరకులోయ స్టేషన్లు వస్తాయి. వెళ్ళేటపుడు రైలు, తిరిగి వచ్చేటపుడు బస్ ప్రయాణం చేస్తే అన్ని ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు.
వైజాగ్ లో ఉదయం కిరండల్ రైలు ఎక్కవచ్చు. కొండలు, గుహలు, లోయల గుండా ప్రయాణం సాగిపోతుంది. ప్రయాణకాలం సుమారు 5 గంటలు.దారిలో భారతదేశంలోనే అతి ఎత్తులో ఉన్న సిమిలిగూడ అనేస్టేషన్ ను చూడవచ్చు. రైలు 58 సొరంగాలు మరియు 84 వంతెనల మీదుగా ప్రయాణిస్తుంది. అరకు వెళ్ళే దారిలోనే ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలున్నాయి. తిరుగు ప్రయాణంలో చూడవచ్చు. అరకు లోయలో ఉండటానికి అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉన్న కాటేజ్ లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్ లు కలవు.