india tour header

డార్జిలింగ్‌ / Darjeeling

డార్జిలింగ్‌
డార్జిలింగ్‌ అంటే ఎక్కువగా తేయాకు తోటలే గుర్తుకొస్తాయి గానీ, ఇది అద్భుతమైన వేసవి విడిది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిమాలయాలకు దిగువన సముద్రమట్టానికి 6,700 అడుగుల ఎత్తున వెలసిన పట్టణం ఇది. ఎంతటి నడి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు మించవు. డార్జిలింగ్‌లోని టైగర్‌ హిల్‌ నుంచి ఉత్తరానికి చూపు సారిస్తే నింగిని తాకే హిమగిరుల సొగసులను ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే మంచుతో నిండిన ఎవరెస్టు, కాంచన్‌జంగ శిఖరాలు ఇంచక్కా కనిపిస్తాయి. ఎటు చూసినా తేయాకు తోటలు, మహా వృక్షాలతో నిండిన దట్టమైన అడవుల పచ్చదనం కనువిందు చేస్తుంది. డార్జిలింగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. జపానీస్‌ పీస్‌ పగోడా, భుటియా బస్టీ గోంపా వంటి బౌద్ధారామాలు, ధీర్‌ధామ్, మహాకాల్‌ ఆలయాలు, పద్మజా నాయుడు హిమాలయన్‌ జూలాజికల్‌ పార్క్, చాప్రామడి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బార్బొటీ రాక్‌ గార్డెన్‌ వంటి ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. వేసవిలో వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఇది చాలా అనువైన ప్రదేశం.
ఎలా చేరుకోవాలి?
ఢిల్లీ, కోల్‌కతా, గువాహటిల నుంచి డార్జిలింగ్‌కు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. దక్షిణాది నుంచి విమానాల్లో వెళ్లేవారైతే ముందుగా కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి డార్జిలింగ్‌ వెళ్లడం తేలికగా ఉంటుంది. రైలులో వెళ్లేవారు ముందుగా న్యూజాల్‌పాయిగుడి స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి హిమాలయన్‌ రైల్వేస్‌కు చెందిన టాయ్‌ ట్రెయిన్‌లో డార్జిలింగ్‌ చేరుకోవచ్చు. అలా కాకుంటే కోల్‌కతాలో రైలు దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా కూడా చేరుకోవచ్చు.