గ్యాంగ్‌టక్ / Gangtok
గ్యాంగ్‌టక్ / Gangtok
దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్.. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ చక్కని వేసవి విడిది. గ్యాంగ్‌టక్ అంటే కొండకొన అని అర్థం. తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల మధ్య వెలసిన ఈ పట్టణం సముద్ర మట్టానికి దాదాపు ఐదున్నర వేల అడుగుల ఎత్తున ఉంది. సంవత్సరం పొడవునా చల్లగా ఉండే గ్యాంగ్‌టక్‌లో వేసవిలోనూ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. సిక్కిం బ్రిటిష్ పాలనలో కొనసాగినా, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లు స్వతంత్ర రాజ్యంగానే కొనసాగింది. చివరకు 1975లో భారత్‌లో విలీనమైంది.
సిక్కిమ్ వాసులు ఇక్కడ ‘పాంగ్ లహ్‌బ్సోల్’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్ వరకు వేసవి. జూన్, జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం
గ్యాంగటక్‌లో వివిధ హిందూ ఆలయాలతో పాటు బౌద్ధారామాలు చూడముచ్చటగా ఉంటాయి. పట్టణానికి చుట్టుపక్కల సెవెన్ సిస్టర్స్ జలపాతం సహా పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. పచ్చదనంతో అలరారే ప్రశాంతమైన గ్యాంగ్‌టక్ పరిసరాలు వాకింగ్, ట్రెక్కింగ్, సైట్ సీయింగ్ వంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటాయి. తాషీ వ్యూ పాయింట్, గణేశ్ టోక్ వ్యూపాయింట్ వంటి ప్రదేశాల నుంచి గ్యాంగ్‌టక్ పట్టణాన్నీ, పరిసరాల్లోని అడవుల పచ్చదనాన్నీ తిలకించవచ్చు. ఇక్కడి జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే హిమాలయన్ జూ పార్కు, షింగ్బా రోడో డెండ్రాన్ అభయారణ్యం, కాంచన్‌జంగా నేషనల్ పార్క్ వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఎలా చేరుకోవాలి?
గ్యాంగ్‌టక్‌కు నేరుగా విమాన, రైలు సౌకర్యాలేవీ అందుబాటులో లేవు. ఇక్కడకు అతి చేరువలోని విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రాలో ఉంది. గ్యాంగ్‌టక్‌కు ఇది సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాగ్దోగ్రా విమానాశ్రయం నుంచి గ్యాంగ్‌టక్‌కు హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం దిగి రోడ్డు మార్గాన రావాలనుకుంటే ట్యాక్సీలు లేదా బస్సుల్లో వెళ్లవచ్చు. సమీపంలోని రైల్వేస్టేషన్ పశ్చిమబెంగాల్‌లోని న్యూ జాల్‌పాయిగుడిలో ఉంది. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి గ్యాంగ్‌టక్ చేరుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకోసం... http://www.sikkimtourism.gov.in లాగిన్ అవ్వచ్చు.