అస్సాంలోని దిమా హసావో జిల్లా కేంద్రం హాఫ్లాంగ్ చూడచక్కని వేసవి విడిది కేంద్రం. స్థానిక దిమాసా భాషలో ‘హాఫ్లాంగ్’ అంటే ‘చీమ కొండ’ అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు మూడువేల అడుగుల ఎత్తున వెలసిన హాఫ్లాంగ్ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి హాఫ్లాంగ్ ఇట్టే ఆకట్టుకుంటుంది. హాఫ్లాంగ్ కొండపైన, చుట్టుపక్కల వ్యాపించిన వనాల్లో దాదాపు రెండులక్షల జాతులకు పైగా అరుదైన పూల మొక్కలు కనువిందు చేస్తాయి.
ఈశాన్య గిరిజన సంస్కృతికి ఆలవాలమైన ఈ ప్రదేశం గ్లైడింగ్, పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటుంది. హాఫ్లాంగ్ కొండపై ట్రెక్కింగ్, హాఫ్లాంగ్ సరస్సులో పడవ విహారం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పక్షులు ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశంగా పేరుపొందిన జతింగా ఇక్కడకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఏటా వర్షాకాలంలో రాత్రివేళ ఇక్కడ రకరకాల పక్షులు మూకుమ్మడిగా చనిపోతుంటాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నిరకాల విశ్లేషణలు చెబుతున్నా, ఈ పరిణామం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.