india tour header

మన స్విట్జర్లాండ్‌….ఖజ్జియార్‌...! Khajjiyar summer resort

మన స్విట్జర్లాండ్‌….ఖజ్జియార్‌...! Khajjiyar summer resort
ఎత్తైన దేవదారు వృక్షాలు, పక్కనే పచ్చిక బయళ్లూ, వాటి మధ్య చిన్న సరస్సు... ఈ ప్రాంతాన్ని చూడటం ఓ ప్రత్యేకానుభూతిని కలిగిస్తుంది. ఖజ్జియార్‌... స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. హిమాలయాల ఒడిలోని చల్లని రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌… ఈ రాష్ట్రంలోని చంబా జిల్లాలోనిది ఖజ్జియార్‌. సముద్రమట్టానికి 6500 అడుగుల ఎత్తులో, ధౌలాధార్‌ పర్వత సానువుల్లో ఉందీ ప్రాంతం. ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ చోటును చూసేందుకూ, పచ్చదనపు ఒడిలో సేదతీరేందుకూ ఏడాదంతా ఇక్కడికి పర్యటకులు వస్తూనే ఉన్న... వేసవి విడిదిగానే ఇది ఎక్కువ పేరు పొందింది.
అన్నిరోజులు చల్లని వాతావరణం, అప్పుడప్పుడూ అకస్మాత్తుగా పలకరించే చిరుజల్లులూ ఈ ప్రాంతపు విశిష్టతలు. చలికాలంలో వెళితే మాత్రం గడ్డలు కట్టిన మంచు వణికించేస్తుంది. పచ్చని ఆ ప్రాంతాన్ని మంచి చలికాలంలో చూస్తే అందమైన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాన్ని చూసినట్టే కనిపిస్తుంది. ఏపుగా పెరిగిన దేవదారు, పైన్‌ వృక్షాల అడవి... వాటి పక్కనే పట్టులాంటి మెత్తటి పచ్చిక బయలు, దాని మధ్య నీటి సరస్సు... భౌగోళికంగా ఈ ప్రాంతం స్విట్జర్లాండ్‌ను పోలి ఉండటంతో 1992లో ఇక్కడికి వచ్చిన వైస్‌ కౌన్సెలర్‌, ఛాన్సెరీ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌ ఇన్‌ ఇండియా అధ్యక్షుడు విల్లీ.టి.బ్లేజర్‌ స్విట్జర్లాండ్‌ దీన్ని మినీ ఆఫ్‌ ఇండియాగా అభివర్ణించారు
ఇక్కడ కొండమీద ఉండే సన్‌రైజ్‌ వ్యూ పాయింట్‌ నుంచి చూస్తే దివాకరుడి బంగారు కిరణాలు కొండకు అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లిన వాళ్లు తప్పక అనుభూతి చెందే ఓ దృశ్యం. ఇక పశ్చిమ హిమాలయాలూ, ముఖ్యంగా కైలాస పర్వతపు - మౌంట్‌ కైలాశ్‌ అందాల్ని ఖజ్జియార్‌ నుంచి చూడవచ్చు. ఈ ప్రాంతమంతా పరుచుకుని ఉండే ‘వచా’ అని పిలిచే ఒక రకం గడ్డి కాలికి దూదిలా తగులుతూ పచ్చని తివాచీ మీద నడుస్తోన్న అనుభూతిని కలిగిస్తుంది. వాలుగా ఉండే ఈ ప్రాంతంలో దొర్లడం పిల్లలకు మంచి ఆట. అంతేకాదు, పైన్‌ చెట్ల అడవిలోనూ సరదాగా ఎవరమైనా నడవొచ్చు. ఇక, కొండవాలుల్లో కనిపించే పచ్చటి పల్లెటూళ్లు ఈ ప్రాంతపు మరొక ప్రత్యేకత. ఈ వూళ్ల దగ్గర ఆపిల్‌ తోటలనూ చూడొచ్చు. స్వచ్ఛమైన నీటితో ఉండే ఖజ్జియార్‌ సరస్సును చూసేందుకు ఇక్కడకు వచ్చిన ఎవరైనా తప్పక చూస్తారు.
ఈ సరస్సుకు కాస్త దూరంలో ఖజ్జినాగ్‌ టెంపుల్‌ అని పిలిచే ఓ నాగేంద్రుడి గుడి ఉంటుంది. పన్నెండో శతాబ్దానికి చెందిన ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా పేరొందింది. అక్కడే గోల్డెన్‌ దేవి టెంపుల్‌గా పిలిచే మరో గుడినీ చూడొచ్చు. ఒకే పైన్‌ వృక్షం నుంచి ఆరు పొడవాటి పైభాగాలు వచ్చిన పంచపాండవ చెట్టును ఇక్కడి వచ్చిన వారు ప్రత్యేకంగా దర్శిస్తారు. ఆ ఆరు కొమ్మలూ పంచపాండవులూ, ద్రౌపదికి చిహ్నాలుగా చెబుతారు.
వినోదం....
ఈ ప్రాంతపు అందాల్ని ఆకాశంలో ఎగురుతూ చూసేందుకు సహకరించే పారాగ్లైడింగ్‌ ఉంది. ఒక పెద్ద పారదర్శకపు బంతిలోకి దూరిపోయి అక్కడి వాలుల్లో దొర్లుతూ ఆడే ఆట జోర్బింగ్‌ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక, ఖజ్జియార్‌ పచ్చికబయళ్లలో శిక్షకుడి సహాయంతో గుర్రపు స్వారీ చేయడం ఓ సరదా. అక్కడే ఓ చోట కుందేళ్లతో కలిసి ఫొటోలు దిగొచ్చు. హిమాచల్‌ ప్రదేశ్‌ వాళ్లు వేసుకునే ప్రత్యేక వస్త్రాలనూ మనం వేసుకుని ఫొటోలు దిగేందుకు అద్దెకు ఇస్తారు. ట్రెక్కింగ్‌ ఇష్టపడేవాళ్లకు ఇది మంచి ప్రదేశం.
ఖజ్జియార్‌లో ఉండేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ కాటేజీలతో పాటు, అటవీశాఖ, పీడబ్ల్యూడీ వాళ్ల గెస్ట్‌హౌసా3లు ఉన్నాయి. ఇవి కాక ప్రైవేటు హోటళ్లూ అందుబాటులో ఉంటాయి.