కర్ణాటక రాష్ట్రములోని కొడగు జిల్లా. కూర్గ్ పేరుతో ప్రసిద్ధమైనది.
నైఋతి కర్ణాటక పశ్చిమ కనుమలలో ఈ జిల్లా 4.100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. కొడగు జిల్లా యొక్క ముఖ్యపట్టణం మడికేరి.
ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమతీరంలో ఉండే కొండలు, అడవులతో నెలకొని ఉంటుంది. కనుచూపు మేరలో ఎటుచూసినా కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో మనోహరంగా ఉంటుందీ ప్రాంతం.
ఈ ప్రాంతం నంచి ఎటువైపు చూసినా కాఫీ తోటలు, ఆ తోటల మధ్యలో నివాసం ఏర్పరుచుకున్న ప్రజలు కనిపిస్తారు. ఇక ఏ రుతువులో నయినా సరే, ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించదు. కొడగు ప్రాంతంలో మనకు తెలియకుండానే కాలం
ఇట్టే హాయిగా గడచిపోతుంది. ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం దానికింద పెద్ద పెద్ద లోయలు , ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
కొడగు ప్రాంతంలోనే కావేరీ నది జన్మించింది. కావేరీ నదీ ప్రవాహం ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతంలో ఎన్నెన్నో విహార యాత్రా స్థలాలు రూపుదిద్దుకున్నాయి. కావేరీ నదిలో పడవలలో విహారం, ఏనుగుల మందల షికారు, గిరిజనుల ఉత్సవాలు...
మొదలయిన వాటినన్నింటినీ కలగలిపి చూడాలంటే, నాలుగైదు రోజులకు మించే సమయం పడుతుంది. పిల్లలు, పెద్దలు, ముసలివారు, ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారు... ఇలా ఎవరైనా సరే కొడగు సౌందర్యానికి దాసోహం అనక తప్పదు.
ఇక చివరిగా... కాఫీ ప్రియులకు కూర్గ్ కాఫీ అమృతం కంటే రుచిగా, మధురంగా ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఇక్కడి కాఫీ రుచికి ఎన్ని కప్పులయినా అలా తాగుతూనే ఉండాలనిపిస్తుంటుంది. అక్కడి కాఫీ తాగి
నాణ్యమైన యాలకులు నోట్లో వేసుకుంటే, గాలిలో తేలిపోతున్నట్లనిపిస్తుంది.