india tour header

సిమ్లా నగరం / Simla Tourism

సిమ్లా నగరం
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనే వారికి స్వర్గసీమ సిమ్లా. హిమాలయ పర్వతపాదాల దగ్గర సముద్ర మట్టానికి సుమారు 6 వేల కి.మీటర్ల ఎత్తున ఉంటుంది సిమ్లా నగరం. రణగొణులకు దూరంగా ప్రశాంతంగా ఉంటుంది సిమ్లా నగరం. శ్యామలాదేవి ఆలయం కారణంగా ఈ నగరానికి సిమ్లా అనిపేరు వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఢిల్లీ నుంచి రైలు విమాన మార్గాలలో సిమ్లాకు వెళ్ళవచ్చు.
కల్కా రైల్వే స్టేషన్ నుండి సిమ్లాకు రైలు ప్రయాణం ఓ మధురానుభూతి. నేరో గేజ్ రైలు మార్గం. రైలుపట్టాల మధ్య దూరం రెండు అడుగుల ఆరంగుళాలు మాత్రమే. కల్కా నుండి ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న సిమ్లాకు పర్వతాలను తొలచి రైలుమార్గాన్ని నిర్మించారు. ఈ మార్గంలో 806 వంతెనలు 102గుహలున్నాయి. ప్రకృతి సోయగాల మధ్య నుండి రైలు ప్రయాణిస్తుంటే చల్లని గాలులూ, మబ్బులు ముఖాన్ని తాకుతూ ఉంటే ఆ ఆనుభూతే వేరు. ఒక ప్రక్క లోయలు, అగాధాలు చూస్తుంటే వణుకు రావాల్సిందే.
మండుటెండలో కూడా వానలు పడే సిమ్లాలో ఎండాకాలంలో వాతావరణం 25 డిగ్రీలకు మించదు. చలికాలంలో అయితే వాతావరణం మైనస్ 1 నుంచి 16 డిగ్రీలకు పడిపోతుంది. జనవరిలో స్కేటింగ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. దక్షిణాసియాలో ఒకే ఒక సహజమైన స్కేటింగ్ రింగ్ సిమ్లాలోనే ఉంది.
దక్షిణాది సందర్శకులకు పర్వటనకు జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ’’సిమ్లా సమ్మర్ ఫెస్టివల్’’ పేరుతో వేడుకలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ గాయకులు ఈ వేడుకలలో పాల్గొంటారు.
సిమ్లాలో మాల్, రిడ్జ్ అనే రెండు ప్రాంతాలున్నాయి. వీటిలో మాల్ చూడదగ్గది. రెండు కిలోమీటర్ల పొడవైన పర్వతంపైన ఈ మాల్ ప్రాంతం ఉంది. ఇక్కడకు చేరుకోవటానికి రెండు అంచెలలో లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. రె స్టారెంట్లు, క్లబ్ లు, బ్యాంకులు, బార్ లు, హోటల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చలిలో వేడి వేడి సమోసాలు తింటూ, ఛాయ్ తాగుతూ కనిపిస్తారు ఇక్కడకు వచ్చినవారు. ఈ నగర శివార్లలో కళాకృతులకు పేరుగాంచిన లక్కర్ బజార్ అనే మార్కెట్ ఉంది. ఇక్కడే వందేళ్ళ నాటి చర్చి, రాష్ట్రపతి నిలయం, స్టేట్ మ్యూజియంలను చూడవచ్చు.
కోతులదేవాలయం రామ రావణసంగ్రామంలో మూర్చిల్లిన లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసికువెళ్ళి మళ్ళీ ఇక్కడే పెట్టాడంటారు. ఇక్కడున్న ఈ ఆలయం రామాయణ కాలం నుండి ఉన్నదని స్థానికుల విశ్వాసం. కోతులు ఎక్కవగా ఉంటాయి ఇక్కడ. కోతుల బెడద వలన ఇక్కడకు వెళ్ళేవారు తమ బ్యాగులను, వస్తువులను ముందుగానే జాగ్రత్త పరచుకొని వెళతారు. సముద్ర మట్టాని 8,500 అడుగుల ఎత్తున్న ఈ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తున్న హనుమాన్ విగ్రహం ఇక్కడే ఉంది.
సిమ్లా-కల్కా దారి సంకట్ మోచన్ అనే హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా కోతులకు ప్రసిద్ధి. ఇదే దారిలో సమ్మర్ హిల్ టౌన్ షిప్ చూడ దగ్గ ప్రాంతం.
ఛైల్ భవనం
సిమ్లా వెళ్ళనవారు తప్పక చూడవలసిన వాటిలో ఛైల్ చారిత్రాత్మక భవనం ఒకటి. ఇదో ప్రత్యేకమైన హిల్ స్టేషన్. బ్రిటీష్ వారి కాలంలో మహారాజా భూపేందర్ సింగ్ 75 ఎకరాల విస్తీర్ణంలో ఓ గొప్ప ప్యాలెస్ ను కట్టించాడు. ఇదే చైల్ భవనం. ప్రస్తుతం ఈ ప్యాలెస్ లో హిమాచల్ పర్యాటక శాఖ వారు హోటల్ ను నడుపుతున్నారు. ఆధునిక సౌకర్యాలతో ఉన్న ఈ హోటల్ లో గదులు రూ.500- నుండి రూ.5,000- రూపాయాల వరకు ఉంటుంది. ఇక్కడే ప్రపపంచంలో కెల్లా ఎత్తైన క్రికెట్, పోలో మైదానాలు ఉన్నాయి. ఇక్కడ నుండి హిమాలయ పర్వతాలు వెండికొండల్లా మెరుస్తూ కనిపిస్తాయి.
ఇక్కడ వన్య సంరక్షణా కేంద్రం కూడా ఉంది. తెల్ల ఎలుగుబంటులు, అరుదైన వన్యమృగాలు, యాక్ లు ఉంటాయి. అరుదైన ఆయుర్వేద ఔషధ దినుసుల అంగళ్ళు కూడా ఇక్కడ చాలా ఉంటాయి.
సిమ్లాలో అన్ని రోడ్లు ఇరుకుగా ఉంటాయి. ఆటోలు ఉండవు. ట్యాక్సీలు మాత్రం ఉంటాయి. కాని ధరలు ఎక్కవగాఉంటాయి. బేరాలు ఆడవచ్చు. హోటల్ గదులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయి.