తవాంగ్ / Tawang
అరుణాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాకేంద్రమైన తవాంగ్ పట్టణం టిబెట్ సరిహద్దులకు అతి చేరువగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఏకంగా పదివేల అడుగుల ఎత్తున వెలసిన ఈ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. నడి వేసవిలో సైతం ఇక్కడి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు లోపే నమోదవుతుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో నిండిన దట్టమైన అడవులు, కొండల మీదుగా నేల మీదకు దూకే జలపాతాలు, సరస్సులతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఇక్కడ కనువిందు చేస్తుంది. బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన తవాంగ్‌లో తవాంగ్ బౌద్ధారామం, ఉర్గెలింగ్ గోంపా, గ్యాన్‌గోంగ్ అని గోంపా వంటి ఆరామాలు టిబెటన్ వాస్తుశైలిలో ఆకట్టుకుంటాయి. సెలా పాస్, బుమ్‌లా పాస్ వంటి పర్వతమార్గాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కొండలపై వెలసిన మాధురి సరస్సు, నగులా సరస్సు వంటి సరస్సులు, నురానంగ్ జలపాతం వంటి జలపాతాలు నిత్యం జలకళతో కనువిందు చేస్తాయి. ఇక్కడికి చేరువలోనే మంచుతో నిండిన గోరిచెన్ శిఖరం ఎక్కేందుకు పర్వతారోహకులు మక్కువ చూపుతారు. ఇక్కడి ఈగల్ నెస్ట్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం జీవవైవిధ్యానికి ఆలవాలంగా ఆకట్టుకుంటుంది.
ఎలా చేరుకోవాలి?
ఇక్కడకు చేరువలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి తవాంగ్ చేరుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి తేజ్‌పూర్ వరకు నేరుగా విమానాలు, రైళ్లు దొరకడం కష్టం. అందువల్ల గువాహటి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం మీదుగా ఇక్కడకు చేరుకోవడం కాస్త తేలికగా ఉంటుంది.