header

Vinakaka Chaviti…వినాయక చవితి....

Vinakaka Chaviti…వినాయక చవితి....

వినాయక చరిత్ర.... పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి ఉదరంలో ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి... ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు.
వినాయక జననం..
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.
కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తనవద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండేనికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్నీ త్రిలోక పూజ్యతనూ కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. ఆ తరవాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.