header

Breast Feeding / తల్లిపాలు ..... ఆవశ్వకత..

From eenadu - sukheebhava
Breast Feeding / తల్లిపాలు ..... ఆవశ్వకత..
ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని తెలిసినా.. సగానికి పైగా పిల్లలకు ఈ అదృష్టం దక్కటం లేదు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారాన్ని ఆరంభించాలని తెలిసినా.. దాదాపు సగం మంది ఈ కమ్మదనాన్ని పొందటం లేదు. దీంతో ఎంతోమంది పోషణలోపం బారినపడుతున్నారు. ఎక్కడుందీ లోపం? అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
మొక్క ఏపుగా ఎదగాలంటే ఆయా దశలకు అనుగుణంగా అవసరమైన పోషకాలన్నీ అందాలి. పిల్లలూ అంతే. ఏ వయసులో అవసరమైన పోషకాలు ఆ వయసులోనే అందాలి. అప్పుడే చక్కటి ఆరోగ్యంతో ఎదుగుతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. పిల్లల పోషణ విషయంలో పుట్టినప్పటి నుంచి తొలి రెండేళ్లు చాలా కీలకమైన దశ! వారి శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి బీజం పడేది ఈ వయసులోనే. ప్రవర్తన రూపుదిద్దుకోవటం, విషయాలను గ్రహించే నేర్పులూ పురుడుపోసుకునేదీ ఈ వయసులోనే. అందువల్ల తొలి రెండేళ్లలో పిల్లలకు తగినంత పోషణ లభించటం చాలా అవసరం. లేకపోతే వారి ఎదుగుదల కుంటుపడుతుంది. రకరకాల జబ్బులు చుట్టుముడతాయి. కొన్నిసార్లు బతికి బట్ట కట్టటమే కష్టమైపోతుంది. మనదేశంలో ఎంతోమంది బిడ్డలు కేవలం పోషకాహార లోపంతోనే చనిపోతుండటం ఆందోళకరం. కాబట్టి పిల్లల పోషణపై పుట్టినప్పటి నుంచే దృష్టి పెట్టటం.. జాగ్రత్తగా మసలుకోవటం.. చాలా అవసరం. ముఖ్యంగా తల్లులకు వీటిపై సరైన అవగాహన ఉండటం ముఖ్యం.
సీసాలు వద్దే వద్దు!
పిల్లలకు సీసాతో పాలు పట్టటం తగదు. మనదేశంలో ఏటా 5-6 లక్షల మంది పిల్లలు కేవలం ఈ సీసాల మూలంగానే మరణిస్తున్నారు. వీటితో పాలు పట్టటం వల్ల తీవ్రమైన విరేచనాలు, చెవిలో చీము, గొంతు నొప్పి, వూపిరితిత్తుల్లో నిమ్ము, పిప్పిపళ్లు.. వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. నోట్లో తేనె పీకలు, పాసిఫయర్లు కూడా పెట్టొద్దు. పాలను మాత్రమే కాదు.. నీళ్లు తాగించటానికి కూడా సీసాను వాడొద్దు. తల్లీబిడ్డల అనురాగం, ఆప్యాయతలకు సీసా గొడ్డలిపెట్టు. వీటితో పెరిగే పిల్లలకు అనురాగం, ఆప్యాయత, మానవ స్పర్శ.. వాటి విలువలు తెలియవు. ఇలా యాంత్రికంగా సీసా పాలు తాగి పెరిగే పిల్లలు నలుగురితో కలిసిమెలసి ఉండలేకపోతున్నారని, కలివిడిగా పనిచేయలేకపోతున్నారని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి.
తిండితో పాటు ప్రేమా పెట్టాలి!
బిడ్డకు తిండి పెట్టటమే కాదు.. ప్రేమతో, బాధ్యతతో, సంతోషంతో తినిపించటమూ ముఖ్యమే. మనదగ్గర చాలామంది బిడ్డను కాళ్ల మీద వేసుకొని నోట్లో తిండి కుక్కుతుంటారు. పిల్లలేమో అటూఇటూ కదులుతూ, మూతి తిప్పేసుకుంటూ పోరాటం చేస్తుంటారు. కొందరు తల్లులు కొడుతుంటారు కూడా. దీనివల్ల క్రమంగా పిల్లలకు తిండిపై తిరస్కార భావన కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ తెచ్చుకోకూడదు. పిల్లలు సంతోషంగా తినేలా చూడాలి. అలాగని అన్నం పిల్లల ముందు పెట్టేసి వాళ్లే తింటారులే అని విడిచిపెట్టటమూ మంచిది కాదు. తినిపించేవారి ఎత్తులో పిల్లలను కూచోబెట్టి.. వారి కళ్లలోకి చూస్తూ.. నవ్వుకుంటూ.. అనునయంగా మాట్లాడుతూ తినిపించాలి. అదీ ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొంచెం కొంచెంగా పెట్టాలి. పెదవి దగ్గరకు తెస్తే బిడ్డ తనంత తానుగా లోపలికి తీసుకునే అవకాశం ఇవ్వాలి. దీంతో తన ఆహారం తనే తిన్నాననే తృప్తి పిల్లలకు కలుగుతుంది.
పిల్లలకు తినిపించే ఆహారం తాజాగా, వేడిగా ఉండాలి. వండాక రెండు గంటల్లోపే తినిపించాలి. వండే ముందు, తినిపించే ముందు.. దొడ్డికి కడిగిన తర్వాత.. తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
తరువాత పేజీలో..