header

Malding Powder / మాల్డింగ్ పౌడర్

Malding Powder / మాల్డింగ్ పౌడర్

మాల్టింగ్ అనేది అతి పురాతనమైన, సాంప్రదాయపు ఆహార తయారి పద్ధతి. దీని వల్ల పోషక లాభాలు అధికంగా ఉంటాయి. మాల్టింగ్ అంటే గింజలను నానబెట్టి, మొలకెత్తించి, ఆరబెట్టి పొడి చేయడం. ఇలా చేయడం వల్ల ఆహారపదార్థాలు ఏ వయస్సు వారికైన సులభంగా జీర్ణమవుతాయి. ఆహారంలో మాంసకృత్తుల విలువలు పెరగడం, పోషకాలను శరీరం సులభంగా గ్రహించడం వంటి లాభాలు కలుగుతాయి. మాల్టెడ్ ధాన్యాల నుండి చేసిన పిండిలో అమైలేజ్ అనే ఎంజైము అధికంగా ఉంటుంది. ఇది తక్కువగా తిన్నప్పటికీ ఎక్కువ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఇవి చంటిబిడ్డలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి ద్వారా ధాన్యాల అరుగుదల శక్తి పెరుగుతుంది.
కావలసిన పదార్థాలు
రాగి లేదా గోధుమలు - 50 %
పెసలు - 25%
చక్కెర - 15%
వెన్న తీసిన పాల పొడి - 10%
అమైలేజ్ మాల్టింగ్ మిక్సుతయారు చేసే విధానం
రాగులు లేదా గోధుమలను, పెసలను దుమ్ము, ధూళి, చెత్త లేకుండా శుభ్రంగా చేసుకోవాలి.
శుభ్రపరచిన రాగులను లేదా గోధుమలను, పెసలను 18 గంటలపాటు నీటిలో నానబెట్టాలి.
ధాన్యాలలో నీటిని తొలగించాలి. ఇప్పుడు ఈ ధాన్యాలను ఒక సన్నటి పొడి గుడ్డలో కట్టాలి. వీటిని ఇలాగే 2 రోజుల పాటు ఉంచాలి.అప్పుడు ధాన్యాలు మొలకెత్తుతాయి. అదే పెసర్లకైతే మొలకలు రావడానికి ఒక్క రోజు సరిపోతుంది. గుడ్డపై నీళ్ళు చల్లుతూ ఉండాలి, అప్పుడు ధాన్యాలు మొలకెత్తడానికి కావలసిన తేమ లభిస్తుంది.
మొలకెత్తిన ధాన్యాలను, ఒక గిన్నెపై పొరలా పరచి డ్రైయర్ లో ఎండబెట్టాలి.లేక ఎండలో ఎండపెట్టుకోవచ్చు ఇలా ఎండిన తర్వాత పెసర్లపై పొట్టును ఒక గుడ్డతో రుద్దడం ద్వారా తొలగించాలి.
ఈ ధాన్యాలను చక్కని సువాసన వచ్చే దాకా వేయించాలి.
ఇలా వేయించిన ధాన్యాలను పిండి పట్టాలి. పిండిలో మలినాలు తొలగించడానికి జల్లెడ పట్టాలి. ఈ పిండిలో చక్కెర పొడి, పాలపొడి కలుపుకోవాలి. దీనినే మాల్టెడ్ పిండి అంటారు.
ఈ పిండిని పిల్లల వయస్సు తగ్గట్లు చెంచా లేక రెండు చెంచాలు పాలలో కలిపి లేని వేడినీటిలో కలిపి ఇవ్వవచ్చు. ఇంకా రుచికోసం కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.