header

Gooseberry

ఆరోగ్యప్రదాయని – ఉసిరి
ఔషధ మొక్కలలో సాటిలేనిది ఉసిరి. ఉసిరికి సాటి ఉసిరేనని చెబుతుంది చరకసంహిత. ఆయిర్వేదానికి మూలం ఉసిరి. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లకి లేదా ధాత్రిఫలం అంటారు. ఉసిరిని కొరికి తినటం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే పులుపు, వగరూ ఎక్కువ దీని బలం కూడా పులుపే. కమలారసంలో పోలిస్తే మిటమిన్ సి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ కన్నా 20 రెట్లు ఎక్కువ. అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. శీతాకాలం నుండి వేసవి వరకు వచ్చే ఈ కాయలను ఎండబెట్టి నిల్వచేసుకొని ఏడాది పొడవునా వాడుకోవచ్చు. ఎలా తిన్నా ఉసిరి అద్భుత ఔషధమే.
ఉసిరిలో రెండురకాలున్నాయి. ఒకటి రాతి ఉసిరి (రాచ) ఇది పూర్తిగా పుల్లగా ఉంటుంది.ఇవి పచ్చళ్ళకూ, వైద్యానికి, పులిహోరకు వాడతారు. ఇంకోటి చేదూ, తీపి వగరూ పులుపూ కలిసినట్లుండే నేరుగా తింటానికి పనికి వచ్చే ఉసిరి. వీటిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.
ఉసిరిలో 80 శాతం నీరు, ప్రొటీన్లు, పిండిపదార్ధాలు, పీచూ లభిస్తాయి. సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉసిరిలో ఉంటాయి.
ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరిపొడిని తీసుకోవటంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టి.బీ వంటివి తగ్గుతాయి. వేసవిలో ఉసిరి తినటం వలన చలువ చేస్తుంది.
కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్ళమంటలు తగ్గతాయంటారు ఎముకలు, గోళ్ళు, దంతాలు బలంగా పెరుగుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి వలన చర్మరోగాలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది.
కేవలం ఆయిర్వేద వైద్యులే కాదు అల్లోపతి వైద్యులు కూడా ఉసిరి ఔషధ గని అని అంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలను, కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది. ఫలితంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
ఉసిరిని తాజాగా, ఎండుఫలంగా, పొడిరూపంలో ఎలా తీసుకున్నాకూడా ఉసిరి అద్భుతం..... మానవులకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం ఉసిరి......