గుంటకగర లేక గుంట గలిజేరు శాస్త్రీయ నామం Eclipta Alba. దీని వలన చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా దీనిని తల వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరగటానికి వాడతారు. దీనిని సంస్కృతంలో భృంగరాజ అంటారు. దీనిని తల నూనెల తయారీలో ఉపయోగిస్తారు. తల వెంట్రకలురాలకుండా అడ్డుకుంటుంది.
ఇంకా లివర్, చర్మవ్యాధులలో ఉపయోగిస్తారు.
ఇది చిన్నపిల్లలలో దగ్గు తగ్గించటానికి ఉపయోగిస్తారు. వీటి ఆకులను శుభ్రంగా మంచినీటితో కడిగి దంచి రసంతీసి రెండు చుక్కల ఈ రసాన్ని ఒక స్పూన్ తేనెలో కలిపి పిల్లలకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగిస్తే దగ్గు, గొంతులో గరగరలు తగ్గుతాయి.
వీటి ఆకులను నోటిలో ఉంచుకుని చప్పరిస్తూ ఉంటే నోటిపూత, పుండ్లు తగ్గుతాయి.
ఈ మొక్కను వేళ్లతో సహా తీసుకుని శుభ్రం చేసి దంచి రసాన్ని తీసి ఈ రసం సుమారు అరకిలో కొబ్బరినూనెలో కలిపి సన్నని మంటమీద ఈ రసం ఇగిరిపోయేదాకా మరిగించి చల్లార్చుకుని తలకు పూసుకుంటే, చిన్నతనంలోనే తెల్లబడిన వెంట్రుకలు నల్లగా మారతాయి. ఇలా సుమారు ఆరునెలలదాకా వాడవలసి ఉంటుంది.