header

Tulasi Plant, Basil Leaves....

తులసి మొక్క... Basil Leaves....
ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. సాధారణంగా అకు పచ్చ రంగులో ఉండేది లక్ష్మి తులసి. కృష్ణ తులసి ఆకులు, కొమ్మలు కాస్త నలుపు కలిసి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని ఆకు ఘాటుగా ఉంటుంది. ఔషద విలువలు రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటాయి.ఇది వర్షాకాలం దగ్గు, జలుబు, జ్వరం కలిసికట్టుగా దాడిచేస్తాయి. తులసితో వాటన్నింటినీ ఎదుర్కొనవచ్చు
ఎలాగంటే...
తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది. వర్షాకాలంలో మలేరియా వంటి వైరల్ జ్వరాలకు ఇది విరుగుడు.
జ్వరం వచ్చినప్పుడు గొంతు తడారిపోతుంది. దాహం ఒక పట్టాన తీరదు. నీరూ తాగబుద్ది కాదు. దీనికి తులసి చక్కని పరిష్కారం.
తులసి కషాయంలో ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.
తులసి ఆకులతో అవిరి పడితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఈ కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా ప్రభావం కనిపిస్తుంది. అరోమా థెరపీ అంటే ఇదే.
తులసి ఆకులను టీలో మరిగించి కూడా తీసుకోవచ్చు. టీకి మంచి సువాసనతో పాటు ఘాటైన రుచి కూడా వస్తుంది. వానాకాలంలో ఇది చాలా మేలు చేస్తుంది.
ఏడాది నిండిన పిల్లలకు రోజూ ఒక చెంచా తులసి రసం తాగిస్తే జీర్ణ శక్తి పెరుగుతుండి. పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. కళ్ళు మండుతున్నా, ఎరుపెక్కినా కషాయం పలుచగా చేసి కళ్ళు కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
నీడన ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేయండి. టీస్పూన్ పొడికి, చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు.
తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.
తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి.
జాగ్రత్తలు
ఎక్కువగా వాడకూడదు. రోజూ పది పదిహేను ఆకుల్ని మించి తినకండి. ఆకులు కాస్త చేదుగా, వగరుగా ఉంటాయి. కనుక కడుపులో ఒకలాంటి ఇబ్బందిగా ఉంటుంది.