ఫిర్యాదు పరిశీలించిన కోర్టు కొన్ని నిబంధనలకు లోబడే తీర్పునివ్వాల్సివుంటుంది. వినియోగదారుడు ఫిర్యాదులో కోరినవన్నీ నెరవేర్చలేదు. సినియోగాదారుల రక్షణ చట్టంలో 14 వ సెక్షన్లో పొందుపరచబడిన అంశాల మేరకు తీర్పును ప్రకటించవచ్చు.
1. కొన్న వస్తువులో లోపం వున్నట్లయితే ఆ లోపాన్ని సవరించమని, అదేవిధంగా సేవలలో లోపంవుంటే ఆ లోపాన్ని తొలగించమని ఉత్పత్తిదారుని, లేదా వస్తువు అమ్మిన చిల్లర వ్యాపారిని ఆదేశించవచ్చు. లేదా
2. పడిన వస్తువుకు బదులు లోపంలేని అటువంటి మరో కొత్త వస్తువును యిమ్మని వ్యాపారిని ఆదేశించవచ్చు. లేదా
3. వినియోగదారుడు చెల్లించిన ధరను వాపసు చేయమని ఆదేశించవచ్చు. లేదా
4. వస్తువులోని లోపం వలన గాని సేవలలోని లోపం వలనగాని వినియోగదారుడు నష్టపోయిన సందర్భంలో నష్టపరిహారం చెల్లించమని ఆదేశించవచ్చు.. లేదా
5. అనుచిత వ్యాపార విధానాలను, నిర్బంధ వ్యాపార విధానాలను మానుకోమని, మరోసారి అటువంటి విధానాలను ఆచరించకూడదని ఆదేశించవచ్చు. లేదా
6. ప్రమాదకర వస్తువులను, సేవలను విక్రయించరాదని ఆదేశించవచ్చు. లేదా
7. ప్రమాదకర వస్తువులను, సేవలను మార్కెట్ నుండి ఉపసంహరించమని ఆదేశించవచ్చు. లేదా
8. తప్పు దారి పట్టించే వ్యాపార ప్రకటనల ప్రభావాన్ని తొలగించేలా మరో ప్రకటన జారీ చేయమని ప్రకటనదారుని ఆదేశించవచ్చు.
9. కోర్టు ఖర్చులు చెల్లించమని ఆదేశించవచ్చు.