వినియోగజీవనంలో అనేకానేక వస్తువులు, సేవలు కొనాల్సివుంటుంది. ఆసందర్భంలో వ్యాపారి మోసం చేయవచ్చు. వస్తువులలో, సేవలలో లోపం ఉండచ్చు. కారణం ఏదైనా వినియోగదారుడు తనకు కలిగిన నష్టానికి, అనుభవించిన మానసికక్షోభకు పరిహారం పొందే అవకాశం వుంది. వినియోగదారుడు రాత పూర్వకంగా వినియోగదారుల జిల్లా ఫోరంకు (కోర్టు) ఫిర్యాడుచేస్తే చాలు. ఫిర్యాదు చేయడానికి వినియోగదారుడు న్యాయవాదిని నియమించుకోవలసిన అవసరంలేదు.
ఫిర్యాదులో వినియోగదారుని పూర్తి చిరునామా, ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారో (వ్యాపార సంస్థ) వారి చిరునామా, వివాదానికి కారణం (సవివరంగా వ్రాయాలి), వినియోగదారుడు కోర్టునుండి ఏమి కోరుకుంటున్నాడో రాయాలి. ఫిర్యాదుకు బిల్లు నెలరోజులలో ఇతర సాక్ష్యాధారాలు జతపరచాలి (కాపీలు పెడితే సరిపోతుంది). ఫిర్యాదుపై వినియోగదారుడు సంతకం చేయాలి. ఇవేవి సరిగా లేకపోయినా కోర్టు ఫిర్యాదును తిరస్కరిస్తుంది. ఫిర్యాదులో లోపంవుంటే సరిచేసుకొనే అవకాశమిస్తుంది. ఫిర్యాదు స్వీకరించిన తరువాత ప్రతివాదికి ఫిర్యాదు కాపీ పంపించి నెలరోజులలో సమాధానం పంపవలసినదిగా ఆదేశిస్తుంది. ప్రతివాది సమాధానమిస్తే దాని కాపీని వినియోగదారునికి (ఫిర్యాదు దారునికి) పంపి అతనిదగ్గరవున్న సాక్ష్యాధారాలను సమర్పించమని సూచిస్తుంది. ఫిర్యాదుకు జతపరిచిన సాక్ష్యాలేకాక మరే ఇతర సాక్ష్యాలున్నాసరే వాటిని కోర్టుకు సమర్పించవచ్చు (కాపీలు కాదు). ప్రతివాది సమాధానం రాసినా రాయకపోయినా వినియోగదారుల కోర్టు ఫిర్యాదు పరిష్కారానికి సిద్దమవుతుంది.
ఏకారణం చేతనైనా వినియోగదారుల జిల్లాఫోరం వెలువరించిన తీర్పుపై వినియోగదారుడు అసంతృప్తిగా వుంటే నేలరోజులలోపు రాష్ట్ర కమిషన్లో అప్పీలు చేయవచ్చు. జిల్లా ఫోరమైన, రాష్ట్ర కమిషనైనా లేదా జాతీయ కమిషనైనా 90 రోజులలో తీర్పునివ్వాలి. అలా ఇవ్వలేకపోతే తీర్పులో జాప్యానికిగల కారణాలుకూడా చెప్పవలసివుంటుంది.
ఒకవేళ జిల్లా ఫోరం లేదా రాష్ట్ర కమిషన్ ఇచ్చిన తీర్పును గడువులోపు ప్రతివాది అమలుచేయకపోతే, తీర్పును అమలు చేసేలా చర్యలు తీసుకోమని లెదా ప్రతివాదికి జైలు శిక్ష వేయమని వినియోగదారుడు కోరవచ్చు. తీర్పు అమలు చేయని ప్రతివాదికి గరిష్టంగా మూడు సంవత్సరాలు జైలు శిక్షగాని, అపరాధ రుసుము గాని లేదా రెండూ విధించవచ్చు. తీర్పు అమలు చేయమని కోరే అభ్యర్ధనతోపాటు ప్రతివాది ఆస్తి వివరాలు అవి ఏ సర్వే నెంబర్లో వున్నావో కోర్టుకు తెలియజేయాలి. కోర్టు ఆ ఆస్తులను అమ్మి వినియోగదారునికి ఇవ్వవలసిన సొమ్మును చెల్లిస్తుంది.
ఫిర్యాదుతో పాటు కోర్టు ఫీజు కూడా చెల్లించాలి, కోర్టు ఫీజు ఫిర్యాదులో పేర్కొన్న వివాదం విలువను అనుసరించి వుంటుంది. దాని విలువ లక్ష రూపాయలకు మించకపోతే వంద రూపాయలు, లక్షకు పైబడి ఐదు లక్షలవరకూ రెండువందల రూపాయలు, ఐదు లక్షల పైబడి పదిలక్షలు వరకు నాలుగు వందల రూపాయలు పది లక్షల పైబడి ఇరవై లక్షలవరకు ఐదువందలరూపాయలు ఇరవైలక్షలు మించి యాభైలక్షలవరకు వేయిరూపాయలు, యాభైలక్షలు పైబడి కోటి రూపాయలవరకు రెండు వేలా రూపాయలు ,కోటిపైన ఎంతైనా ఐదువేలరూపాయలు ఫీజుగా ఫిర్యాదుతోపాటు చెల్లించాల్సివుంటుంది.
ముఖ్యంగా వినియోగాదారుడు గమనించవలసిన విషయం ఏమిటంటే తాను చేసే ఫిర్యాదు సత్యమైనదేనా అని. ఫిర్యాదులో సత్యంలేకపోయినా, కేవలం ప్రతివాదిపై కక్ష తీర్చుకోవడానికి ఫిర్యాదు దాఖలు చేసినా ఆ విషయాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి వినియోగదారునికి గరిష్టంగా పదివేల రూపాయలవరకూ జరిమానా విధించవచ్చు. తానుకోరే పరిహారం న్యాయబద్దంగా వుండాలి. అలాగే వైద్యులపై అకారణంగా ఫిర్యాదులు వేయడం సమంజసం కాదు. అలాగని ప్రజలప్రాణాలతో చెలగాటాలాడుతూ, డబ్బు సంపాదనే ధ్యేయంగా వైద్యం చేస్తున్న వైద్యులను ఉపేక్షించకూడదు. కాని వైద్యులపై సాక్ష్యాలు సేకరించి వారి నిర్లక్ష్యం ఏమిటో నిరూపిస్తేనేగాని వినియోగదారునికి అనుకూలంగా తీర్పురాదు.