వినియోగదారుల హక్కులు
భారత దేశంలో వినియోగదారులకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు కలుగచేసిన చట్టం వినియోగదారుల రక్షణ చట్టం, 1986. ఈ చట్టంచేయకముందు వినియోగదారులకు ఏవిధమైన హక్కులు వుండేవికావు. వినియొగదారులను నష్టపరచిన వ్యాపారులకు శిక్షలుమాత్రమే వుండేవి. అందుచేత వారికి కలిగిన నష్టాన్ని పూరించుకొనే అవకాశం వుండేది కాదు. ఈ చట్టం చేసిన తరువాత లక్షలాదిమంది వినియోగదారులు పరిహారంకోసం వినియోగదారులు కోర్టులకు వెళ్లి పరిహారం పొందుతున్నారు. ఈ చట్టంలో ఆరు వినియోగదారుల హక్కులు పొందుపరచడం జరిగింది. అవేమిటో ఇపుడు తెలుసుకుందాం.
1. రక్షణ పొందే హక్కు: ప్రమాదకరమైన వస్తువులనుండి, సేవలనుండి రక్షణ పొందే హక్కు, కల్తీకిగురైన ఆహారపదార్ధాలు, షాక్ కొట్టి ప్రాణాలకు ముప్పు తెచ్చే విద్యుత్ పరికరాలు, వంటగాస్ ఇవన్నీ ప్రమాదకరమే. అటువంటి వస్తువులు, సేవలు సరిగా తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా విక్రయించిన వ్యాపారులనుండి జరిగిన నష్టానికి పరిహారం పొందడానికి మొదటిహక్కు అవకాశం కలిగిస్తుంది.
2. సమాచారం పొందే హక్కు: వస్తువులయొక్క స్వచ్చత, పరిమాణం, శక్తి మొదలైన సమాచారాన్ని పొందే హక్కు ఇది. తాను కొనాలనుకునే వస్తువు, సేవల సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటే తనకు ఆ వస్తువు లేక సేవ ఎంతవరకూ ఉపయోగకరంగా వుంటుందో తెలుస్తుంది. వస్తువుపట్ల అవగాహన కుదురుతుంది. ఈ రెండవ హక్కు వల్ల వస్తువు లేదా సేవల యొక్క మంచి చెడులు తెలుసుకోవచ్చు. తద్వారా సరైన కొనుగోలు నిర్ణయం చేయడానికి వీలు కలుగుతుంది.
3. ఎంపిక చేసుకొనే హక్కు: తనకు కావలసిన వస్తువును సరసమైన ధరలో ఎంపిక చేసుకొనే హక్కు.. “నీకు ఇష్టమైతే తీసుకో లేకుంటేపో” అనే నిర్లక్ష్య వ్యాపార సరళినుండి వినియోగదారులు తమను తాము రక్షించుకోవడానికి ఎంపిక చేసుకొనే హక్కు దోహద పడుతుంది. పలు రకాలైన వస్తువులను వ్యాపారి అందుబాటులో ఉంచాలి. వాటినుండి తనకు కావలసిన వస్తువును సరసమైన ధరలలో పొందడానికి ఈ హక్కు ఉపయోగకరంగా వుంటుంది.
4. ఆసక్తిని తెలియజేసుకొనే హక్కు: సంబంధిత వేదికలపై తన వాదనను వినిపించుకునే హక్కు. తన వినియోగజీవనానికి ఇబ్బంది కలిగించేలా చేయబడిన నిర్ణయాలపై తన అభ్యంతరాలను తెలియ చేసుకోవడానికి ఈ హక్కును వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు కరెంటు చార్జీలు పెరిగితే వినియోగదారులపై ఆర్ధిక భారం పడుతుంది. ఇటువంటి సందర్భాలలో వినియోగదారుడు తన వాదనను సంబంధిత వేదికలపై వినిపించవచ్చు.
5. పరిహారం పొందే హక్కు: జరిగిన నష్టానికి పరిహారం పొందే హక్కు. వినియోగ జీవనంలో వినియోగదారుడు అనేకానేక వస్తువులను, సేవలను వినియోగించుకుంటాడు. అనుచిత వ్యాపార విధానాలవల్ల గాని, నిర్భంద వ్యాపార ధోరణులవల్లగాని, మోసాలవల్ల గాని వినియోగదారుడు నష్టపోతే ఆనష్టానికి పరిహారం పొందడానికి ఈ హక్కు ఉపయోగపడుతుంది. ఈ హక్కు ఉండటంవల్లనే ఈనాడు ప్రతిజిల్లాకు ఒక వినియోగదారుల కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారులకు పరిహారం పొందడం సులభతరమైనది.
6. వినియోగ విద్యను పొందే హక్కు: వినియోగజీవనానికి సంబంధించిన విద్యను పొందే హక్కు.. వినియోగ జీవనానికి అవసరమైన విద్యను పొందడం ద్వారా వినియోగదారుడు మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుని తనను తాను రక్షించుకోగలుగుతాడు. ఈ విద్యను అందించవలసిన బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవాలి. వినియోగదారులు కూడా వినియోగ విద్యను అందుకోవడానికి ఆసక్తి చూపాలి. లేకుంటే ఈ హక్కు వలన పెద్దగా ప్రయోజనం వుండకపోవచ్చు.
వ్యాపారులు పైన చెప్పబడిన వినియోగదారుల హక్కులు తమ భాద్యతలని గుర్తించాలి. ఆ హక్కుల పరిరక్షణకోసం వారుకూడా శ్రద్ధ చూపాలి. ఎందుకంటే వినియోగాదారునితో వివాదం పెట్టుకుంటే చివరికి పరిహారం చెల్లించ వలసినది వ్యాపారులే. అదే విధంగా వినియోగదారులు కూడా బాధ్యతాయుతంగా జీవించాలి.