అక్రమంగా ధరలను మార్చడం, వస్తువులను అందించడానికి రూపొందించిన నిబంధనలలో అక్రమ మార్పులు చేయడం, కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా ఎక్కువ ఖర్చులను వినియోగ దారులపై మోపడం, ధరలు పెరిగేవరకు వస్తువుల సరఫరాలో జాప్యం చేయడం, వినియోగదారునికి కావలసిన్ వస్తువుతోపాటు మరొక వస్తువును తీసుకోవాలని నిర్బంధించడం నిర్బంధ వ్యాపార విధానాలని వినియోగదారుల రక్షణ చట్టం స్పష్టం చేసింది.
అసలు ధరను మార్చి ఎక్కువ ధరను వసూలు చేయడం చాల సందర్భాలలో వినియోగదారులకు అనుభవమే. ఉత్పత్తిదారుడు ముద్రించిన గరిష్ట చిల్లర ధరను మార్చి ఎక్కువ వసూలు చేసే వ్యాపారం వల్ల వినియోగదారుడు నష్టపోతాడు కనుక ఇటువంటి వ్యాపారం సరికాదని చట్టం చెబుతుంది.
సరుకు డెలివరీ నిబంధనలను అక్రమంగా మార్చడం కూడా నిర్బంధ వ్యాపార విధానం గానే పరిగణించబడి౦ది. వినియోగాదారులనుండి ఎక్కువధర రాబట్టడానికి కృత్రిమ కొరతను సృష్టించడం కూడా నిర్బంధ వ్యాపార విధానం. సాధారణంగా ఏప్రిల్ నెలలో ప్రభుత్వ బడ్జెట్ ఆధారంగా వస్తువుల ధరలు పెరగడంకాని, తగ్గడంకాని జరుగుతుంది. ధరలు
పెరిగే వస్తువులు తమదగ్గర అందుబాటులోవున్నా వాటిని పంపించకుండా జాప్యం చేసి పెరిగిన ధరలలో పంపిస్తారు. ఈవిషయం తెలియని వినియోగదారుడు ఎక్కువధర చెల్లించి నష్టపోతాడు.
ఆ విధంగా వినియోగదారుని నష్ట పరచకుండా వుండటానికి ఈ అంశాన్నికూడా చట్టం పరిగణలోనికి తీసుకుంది. తనకు కావల్సిన వస్తువు లేక దినుసులు కొనాలని వెళితే వాటితోపాటు మరొక వస్తువు తీసుకోవాలని నిర్బంధం విధిస్తున్నారు. రేషన్ షాపుకు వెళ్లేవారికి ఇది అనుభవమైన విషయమే. పంచదార కావాలంటే రేషన్ షాప్ యజమాని గోధుమలు తీసుకుంటేనే పంచదార ఇస్తానన్నా, గ్యాస్ డీలర్ బండ కావాలంటే మాదగ్గర తప్పనిసరిగా స్టవ్ తీసుకోవాలని నిబంధాన విధించినా నిర్బంధ వ్యాపార విధానం గానే పరిగణించ బడుతుంది.