వినియోగదారుల రక్షణచట్టం చేయక పూర్వమే వారి రక్షణకోసం పలు చట్టాలు చేయబడినాయి. ఈ చట్టాలలో ఎక్కడా ‘వినియోగదారుడు’ అనే పదం వాడకపోయినా ఆయా చట్టాలలోని నిబంధనలు వినియోగాదారులకే వర్తిస్తాయి. ఉదాహరణకు వస్తు విక్రయచట్టం తీసుకుంటే, ఆ చట్టం ప్రముఖంగా రెండు రకాల వ్యక్తులకు అన్వయిస్తుంది. ఒకటి వ్యాపారి కాగా రెండవది వినియోగదారుడు.
అయినా చట్టంలో ‘వినియోగదారుడు’ అనే పదం ఉపయోగించబడలేదు. కేవలం ప్రజలక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని చేయబడిన చట్టాలు కనుక చట్టరూపకర్తలకు ప్రజలే మనసులో వుంటారు. అసలు వినియోగదారుడు అనే పదం 1960 దశాబ్దంనుండి మాత్రమే ప్రాచుర్యంలోనికి వచ్చింది కనుక అంతకు పూర్వం ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. ఈవిధంగా చూసినపుడు ఈ క్రింది చట్టాలన్నీ వినియోగదారుల రక్షణకు ఉపయోగపడతాయి.
1. వస్తు విక్రయ చట్టం
2. నిత్యావసర వస్తువుల చట్టం
3. తూనికల కొలతల ప్రమాణాల చట్టం
4. భారత ప్రమాణాల చట్టం
5. ఔషధ నియంత్రణ చట్టాలు
6. ఆహారపదార్ధాల సురక్షితం మరియు ప్రమాణాల చట్టం
7. పర్యావరణ పరిరక్షణ చట్టాలు
8. నల్లవ్యాపార నిరోధక చట్టం
9. రైల్వే ప్రయాణికుల పరిహార చట్టం
పైన పేర్కొన్న చట్టాలన్నీ వినియోగ దారుని రక్షణలో ఉపయోగపడతాయన్న సత్యాన్ని వినియోగదారులందరూ గమనించాలి. చట్టాలపై అవగాహన వున్నపుడే వాటిని ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. చట్టం గురించే తెలియనపుడు దానిని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఎలా వస్తుంది?