సుఖవ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములు ఒంట్లో ప్రవేశించినా వెంటనే లక్షణాలు కనబడాలనేం లేదు. ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ సంక్రమిస్తే 3 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. కానీ షాంక్రాయిడ్ లక్షణాలు 5-8 రోజుల్లో, సిఫిలిస్ లక్షణాలు 9 రోజుల తర్వాత మొదలవుతాయి. అదే లింఫో గ్రాన్యులోమా వెనీరియం (ఎల్‌జీవీ) లక్షణాలు బయటపడటానికి దాదాపు 3-4 వారాలు పడుతుంది. అలాగే గ్రాన్యులోమా వెనీరియం (జీవీ) లక్షణాలు 90 రోజుల తర్వాత కూడా కనబడొచ్చు. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
.
నేడు ఎక్కువగా కనబడుతున్న, లైంగిక సంపర్కం ద్వారా చాలా వేగంగా వ్యాపించే సమస్య ఇది. దీనికి ‘హీమోఫిలస్ డుక్రేయి’ అనే బ్యాక్టీరియా మూలం. ఇది సంక్రమించిన 3-4 రోజుల్లోనే అంగం మీద బుడిపెలాంటిది కనబడుతుంది. క్రమేపీ అది పగిలి ఎర్రగా పుండ్లుపడతాయి. విపరీతమైన నొప్పి. కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులూ ఉండొచ్చు. చికిత్స తీసుకోకపోతే గజ్జల్లో బిళ్ల కట్టి, తీవ్రమైన నొప్పి, బాధ మొదలవుతాయి. దీన్ని భరించటం చాలా కష్టం. అప్పటికీ చికిత్స తీసుకోకపోతే బిళ్ల పగిలి.. చీము, రక్తం వెలువడతాయి. 15-40 మధ్య వయసు వారిలో, పురుషుల్లో ఎక్కువగా కనబడే సమస్య ఇది. స్త్రీలకు వచ్చినా పుండ్లు పైకి కనబడవు. పైగా వీరిలో నొప్పి వంటి లక్షణాలూ అంత స్పష్టంగా ఉండవు. దీంతో వీళ్లు తొందరగా బయటపడరు. కానీ వీరి నుంచి ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంటుంది.
.