డా.నరసింహారావు నేత, ప్రొఫెసర్, చర్మ, సుఖవ్యాధుల విభాగం, గాంధీ హస్పటల్ హైదరాబాద్
దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే
సెగ, మంట - గనోరియా / gonorrhea
లైంగిక సంపర్కం ద్వారా సంప్రాప్తించే అతిపెద్ద సమస్య, శతాబ్దాలుగా మనుషులను వేధిస్తున్న సమస్య ఈ గనోరియా. ఒక్క సంపర్కమే కాదు, శారీరక స్రావాల ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా (నిసేరియా గనోరియే) ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా సంప్రాప్తిస్తుంది. ఇది ఒంట్లో చేరిన 3-8 రోజుల్లో లక్షణాలు మొదలవుతాయి. జననాంగం నుంచి తెల్లటి, పచ్చటి స్రావాలు, మూత్రం పోస్తున్నప్పుడు మంట, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయి. మంట భరించలేని స్థాయిలో ఉంటుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో లక్షణాల తీవ్రత తక్కువ. దీనివల్ల వీరి నుంచి ఇది తేలికగా వ్యాపిస్తుంటుంది. పురుషుల్లో వృషణాల వాపూ ఉండొచ్చు.
చికిత్స: పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది. భాగస్వామికీ చికిత్స తప్పనిసరి.
నిర్లక్ష్యం చేస్తే: సత్వర చికిత్స తీసుకోకపోతే స్త్రీలలో ఇది పొత్తికడుపు వాపు సమస్యలకు దారి తీస్తుంది. ఫలోపియన్ ట్యూబులు దెబ్బతిని సంతాన రాహిత్యం రావచ్చు. పురుషుల్లో వృషణాల వాపు, సంతాన సామర్థ్యం తగ్గటం, ప్రోస్టేటు గ్రంథి దెబ్బతినటం, ముఖ్యంగా మూత్ర మార్గం అక్కడక్కడ మూసుకుపోయి మూత్ర విసర్జన ఇబ్బంది కావటం వంటి సమస్యలన్నీ వేధిస్తాయి. కొందరిలో కాలేయం, మెదడు వంటి అవయవాలూ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.