header

HIV/AIDS

డా.నరసింహారావు నేత, ప్రొఫెసర్, చర్మ, సుఖవ్యాధుల విభాగం, గాంధీ హస్పటల్ హైదరాబాద్

దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే


హెచ్‌ఐవీ

హెచ్‌ఐవీ సంపూర్ణ నిర్మూలన సాధ్యం కాకపోవచ్చు. అందుకే అవగాహన పెంచుకుని నిరంతరం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరంఅప్పుడే మనం సుఖంగా, సురక్షితంగా ఉంటాం. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నుంచి రక్షణగా మనం ఏం చెయ్యాలో.. వివరణ....
ఇది ప్రధానంగా 4 మార్గాల్లో సంక్రమిస్తుందని చెప్పుకోవచ్చు.
01. ఇప్పటికే హెచ్‌ఐవీ ఉన్న వారితో శృంగారం ద్వారా
02. హెచ్‌ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించటం ద్వారా
03. హెచ్‌ఐవీ వ్యక్తులకు వాడిన సూదులు, సిరంజిలు, చెవులు కుట్టే పరికరాలు, రేజర్ల వంటి వాటి ద్వారా
04. గర్భిణికి హెచ్‌ఐవీ ఉంటే ఆమె ద్వారా అమెకు పుట్టే పిల్లలకు సంక్రమించొచ్చు.
వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే హెచ్‌ఐవీ సంక్రమించకుండా చూసుకోవచ్చు.
హెచ్‌ఐవీ - ఎయిడ్స్‌: ఏమిటి తేడా?
సులభంగా చెప్పుకోవాలంటే- హెచ్‌ఐవీ అనేది వైరస్‌. దీనివల్ల వచ్చే తీవ్రమైన రుగ్మత ఎయిడ్స్‌! అయితే హెచ్‌ఐవీ ఒంట్లో ప్రవేశించగానే ఎయిడ్స్ వచ్చేసినట్లు కాదు. హెచ్‌ఐవీ ఒంట్లో చేరిన తర్వాత కూడా చాలామందికి, చాలా ఏళ్ల పాటు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. వాళ్లు పూర్తి ఆరోగ్యంగానే, అందరిలానే కనిపిస్తుండొచ్చు. కానీ వీరి ద్వారా, ఈ దశలో కూడా వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంటుందని మాత్రం మర్చిపోకూడదు. వారి ఒంట్లో చేరిన వైరస్‌ క్రమేపీ వృద్ధి చెందుతూ.. తన సంతతి పెంచుకుంటూ.. ఒంట్లోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి ఆరంభిస్తుంది. ఈ రోగనిరోధక వ్యవస్థ అన్నది మనందరికీ కూడా చాలా కీలకం. ఇది మనకు రక్షణ కవచం లాంటిది. దీనివల్లే మనం నానా రకాల జబ్బుల పాలవ్వకుండా సుఖంగా జీవించగలుగుతున్నాం. కానీ ఒంట్లో చేరిన హెచ్‌ఐవీ- ఈ రక్షణ వ్యవస్థను దెబ్బకొట్టటం మొదలుపెట్టి, బలహీనపరచటం ఆరంభిస్తుంది. అప్పుడు తీవ్ర సమస్యలు ఆరంభమవుతాయి. ఇదే ఎయిడ్స్‌ దశ.
కాకపోతే ఒంట్లో వైరస్‌ చేరిన వారందరూ ఎయిడ్స్‌ దశలోకి వెళ్లకపోవచ్చు. కొందరు వేగంగా వెళ్లొచ్చు. ఇది వారికున్న అలవాట్లు, ఇతరత్రా ఆరోగ్య సమస్యల వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి సగటున- ఒంట్లో హెచ్‌ఐవీ ప్రవేశించిన 10 ఏళ్లలో ఈ సమస్యలన్నీ మొదలై, రోగులు ఎయిడ్స్‌ దశలోకి వెళుతున్నారని వైద్యులు గుర్తించారు. ఇవాల్టి రోజున వైరస్‌ ’వృద్ధిని అడ్డుకునే మందులున్నాయి కాబట్టి వేగంగా ఎయిడ్స్‌ దశలోకి వెళ్లకుండా మరికొంతకాలం కాపాడుకునే అవకాశం మాత్రం ఉంది. ఒకసారి హెచ్‌ఐవీ ఒంట్లో ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందో తెలియదు కాబట్టి అసలా వైరస్‌ సంక్రమించకుండా చూసుకోవటం ఒక్కటే ఉత్తమ మార్గం.
హెచ్‌ఐవీ సోకే మార్గాలు చాలానే ఉన్నా ప్రధానంగా అరక్షిత శృంగారం, కలుషితమైన సూదులు-పరికరాలు, సరిగా పరీక్షించకుండా రక్తం ఎక్కించటం వంటి మార్గాల ద్వారానే ఎక్కువగా సంక్రమిస్తోంది. అలాగే హెచ్‌ఐవీ ఉన్న గర్భిణి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్గాల విషయంలో మనం మరింత చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది హెచ్‌ఐవీ వచ్చిందని తెలిసే వరకూ కూడా ఆ నాకెందుకు వస్తుంది? అన్న ధీమాలోనే ఉంటారు. అలాగే చాలామందికి హెచ్‌ఐవీ ఉన్నా కూడా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. వారికి ఆ విషయం తెలియకపోవచ్చు. కాబట్టి చూడటానికి బాగున్నారు, ఆరోగ్యంగా కనబడుతున్నారని నమ్మి వారితో లైంగిక సంబంధాల వంటివి పెట్టుకోవటం పెను ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే. కొత్తవారితో లైంగిక సంబంధాలు ముప్పును పెంచుతాయి. నమ్మకమైన భాగస్వామికి కట్టుబడి ఉండటం మంచిది.
కండోమ్‌ వంటి సురక్షిత పద్ధతులు పాటించటం అవసరం. స్వలింగ సంపర్కం, గుద సంభోగం (మలద్వార రతి) వంటి వాటితో కూడా హెచ్‌ఐవీ ముప్పు ఉంటుంది. అంగచూషణంతోనూ కొంత ముప్పు ఉండొచ్చు. కాబట్టి కండోమ్‌ వాడటం సురక్షిత పద్ధతులను పాటించటం ఒక్కటే సరైన మార్గం. అలాగే ఇప్పటికే సిఫిలిస్‌, హెర్పిస్‌, గనోరియా వంటి సుఖవ్యాధులున్న వారికి హెచ్‌ఐవీ కూడా తేలికగా సంక్రమిస్తుంది. కాబట్టి సుఖవ్యాధులేమైనా ఉంటే వాటికి తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.
కలుషిత సూదులు, పరికరాలు మరో పెద్ద ముప్పు. అనవసరంగా ఇంజక్షన్లు చేయించుకోకపోవటం ఉత్తమం. చీటికీ మాటికీ సూదిమందును ఆశ్రయించకూడదు. తప్పనిసరి అయినప్పుడు- కొత్త సూదులు, కొత్త సిరంజిలనే వాడాలి. అవసరమైతే కొత్తవాటినే వాడండని మొహమాటం లేకుండా డిమాండు చెయ్యాలి కూడా. క్షవరం కత్తుల బేడులు, రేజర్లు, చెవులు కుట్టే పరికరాలు, టాటూలు వేసే పరికరాలు.. ఇవన్నీ కొత్తవే వాడేలా చూసుకోవాలి. అలాగే దంత చికిత్సల్లో వాడే పరికరాలను కూడా ఒకరికి వాడినవి మరొకరికి వాడితే ముప్పు ఉంటుంది కాబట్టి కచ్చితంగా పద్ధతి ప్రకారం శుభ్రం చేసినవే వాడేలా చూసుకోవాలి.
ఆపరేషన్లు, ప్రమాదాలు..
ఇలా చాలా సమయాల్లో ఆపద నుంచి గట్టెక్కటానికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. ప్రాణ రక్షణకు ఇది కీలకం కూడా. అయితే ఇతరుల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించేటప్పుడు- దానిలో హెచ్‌ఐవీ వంటివేమీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఎక్కించాల్సి ఉంటుంది. అందుకే రక్త దానాలు చేసినప్పుడు, ఇతరుల కోసం రక్తం ఇచ్చేటప్పుడు- ఆ రక్తాన్ని కచ్చితంగా పరీక్షిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాతీయ రక్త విధానం ఉంది. దీని ప్రకారం ఎవరి నుంచి రక్తం సేకరించినా- దానిలో హెచ్‌ఐవీ గానీ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి, సిఫిలిస్‌, మలేరియా వంటివేమైనా ఉన్నాయేమో కచ్చితంగా పరీక్షించాలి. ఇవేవీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని మరొకరికి ఎక్కించేందుకు సిద్ధం చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే, రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఈ పరీక్షలన్నీ పద్ధతిగా జరిగేలా, జాగ్రత్తలన్నీ తీసుకునేలా శ్రద్ధ తీసుకోవటం ముఖ్యం.
గర్భిణులందరికీ తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్ష సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల ఒకవేల గర్భిణికి హెచ్‌ఐవీ ఉన్నట్టు గుర్తిస్తే- అది కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంక్రమించకుండా చూసేందుకు ముందు నుంచే చికిత్స చేసే అవకాశాలున్నాయి. అలాగే కాన్పు ముందు కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
హెచ్‌ఐవీ ఎయిడ్స్‌
కొత్తగా పరిచయం అవసరం లేని సమస్య ఇది. హెచ్‌ఐవీ అంటే హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్‌. అంటే ఈ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తే... అది మన శరీరంలో సహజంగా ఉండే రక్షణ వ్యవస్థను, ఘోరంగా దెబ్బతీసి, రకరకాల వ్యాధుల బారినపడేలా చేస్తుంది. ఒకసారి మనలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిందంటే దాన్ని అదనుగా తీసుకుని, వెంటనే రకరకాల వ్యాధులు చుట్టుముట్టేస్తాయి. వాటితో పోరాడే శక్తి లేక చివరికి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే హెచ్‌ఐవీ వైరస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఒంట్లో చేరకుండా చూసుకోవటం అవసరం. అపోహలు వద్దు
హెచ్‌ఐవీ /ఎయిడ్స్‌ గురించి బోలెడు అనుమానాలు
ప్రశ్న: హెచ్‌ఐవీ రోగిని తాకితే మనకూ వస్తుందా?
సమాధానం : రాదు. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ గలవారి రక్తం, వీర్యం, జననాంగ లేదా మలద్వార స్రావాల వంటి శరీర ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. వారిని తాకినప్పుడు ఇలా వైరస్‌ ఉండే స్రావాలేవీ ఇతరులకు అంటవు కాబట్టి తాకటం ద్వారా హెచ్‌ఐవీ వస్తుందన్న భయం అక్కర్లేదు.
ప్రశ్న: కరచాలనం, కౌగిలింతలతో వస్తుందా?
సమాధానం : రాదు. హెచ్‌ఐవీ వైరస్‌ శరీరం బయట ఎక్కువసేపు బతకలేదు. కాబట్టి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, కౌగిలించుకున్నా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.
ప్రశ్న: చెమట, కన్నీళ్లు, మూత్రం లేదా మలం ద్వారా వ్యాపిస్తుందా?
సమాధానం : లేదు. ఎందుకంటే చెమట, కన్నీళ్లు, మూత్రం లేదా మలంలో హెచ్‌ఐవీ వైరస్‌ ఉండదు.
సమాధానం : రాదు. అయితే ఒకరు వాడిన సెక్స్‌ టాయ్స్‌ను మరొకరు వాడటం మంచిది కాదు. ఒకవేళ వాడితే వాటికి కండోమ్‌ను తొడగాలి.
ప్రశ్న: గాలి, నీరు ద్వారా వ్యాపిస్తుందా?
సమాధానం : లేదు. హెచ్‌ఐవీ వైరస్‌ గాలిలో, నీటిలో జీవించలేదు. కాబట్టి దగ్గు, తుమ్ము, ఉమ్మి, ఈత కొలనులు, తాగే నీటి ద్వారా ఇది వ్యాపించదు.
ప్రశ్న: కొత్త సూదులతో వస్తుందా?
సమాధానం : రాదు. అలాగే ఒకరికి వాడిన సూదులను పద్ధతి ప్రకారం పూర్తిగా శుభ్రం చేసినా కూడా హెచ్‌ఐవీ వ్యాపించదు. అయితే పద్ధతి ప్రకారం చేశారో, లేదో చెప్పటం కష్టం కాబట్టి ప్రతిసారీ కొత్త సూదులనే వాడటం ఉత్తమం.
ప్రశ్న: టాయ్‌లెట్‌ సీట్ల ద్వారా వ్యాపిస్తుందా?
సమానం : వ్యాపించదు. టాయ్‌లెట్‌ సీట్లు, బల్లలు, తలుపు గొళ్లాలు, వంట సామగ్రి, తువ్వాళ్ల వంటి వాటిపై హెచ్‌ఐవీ వైరస్‌ జీవించలేదు. కాబట్టి వీటితో రాదు.
ప్రశ్న: సంగీత పరికరాలతో ఇతరులకు సోకుతుందా?
సమాధానం : సోకదు. ఇలాంటి పరికరాలపై హెచ్‌ఐవీ బతకదు. నోటితో వాయించే పరికరాలతోనూ హెచ్‌ఐవీ వ్యాపించదు.
ప్రశ్న: అంగ చూషణ ద్వారా వస్తుందా?
సమాధానం :ముద్దు మాదిరిగానే అంగ చూషణ ద్వారా కూడా హెచ్‌ఐవీ వైరస్‌ వ్యాపించే అవకాశం తక్కువ. కానీ జననాంగాల వద్ద పుండ్లు, నోట్లో పుండ్లు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటివి ఉంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించొచ్చు.
ప్రశ్న: హెచ్‌ఐవీ కొందరికే వస్తుందా? సమాధానం : కొన్ని వర్గాల వారికే హెచ్‌ఐవీ వస్తుందని భావించటం తప్పు. పేదలు, సంపన్నులు, మధ్యతరగతి ప్రజలు.. ఇలా ఎవరికైనా హెచ్‌ఐవీ రావచ్చు. హెచ్‌ఐవీ సంక్రమించే మార్గాలు ఎవరికైనా ఒకటే. కాబట్టి ముప్పు అందరికీ ఒకేలా ఉంటుందని గుర్తించాలి. అయితే మాదకద్రవ్యాల వంటివి తీసుకునేవారికి, నమ్మకమైన ఒకే భాగస్వామితో కాకుండా పలువురితో శృంగారంలో పాల్గొనే వారికి, శృంగారం సమయంలో కండోమ్‌లు వాడని వారికి ముప్పు ఎక్కువ.
ప్రశ్న: ముద్దు ద్వారా అంటుకుంటుందా?
సమాధానం :అంటుకోదు. లాలాజలంలో హెచ్‌ఐవీ వైరస్‌ చాలా తక్కువ. కాబట్టి ఇది ముద్దులతో వ్యాపించదు. అయితే నోట్లో పుండ్లు, చిగుళ్ల నుంచి వెలువడిన రక్తంలోని వైరస్‌ లాలాజలంలో కలిస్తే.. గాఢంగా ముద్దు పెట్టుకున్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశముంది.
ప్రశ్న: ఆఫీసుల్లో వ్యాపిస్తుందా?
సమాధానం : హెచ్‌ఐవీ బాధితులు ముట్టుకున్న టెలిఫోన్లు, కీబోర్డులు, ఇతర పరికరాల వంటి వాటిని తాకినా, వారితో కలిసి పనిచేసినా వైరస్‌ సోకే ముప్పు లేదు. హెచ్‌ఐవీ బాధితులు వాడిన కప్పు’లు, వారి చెమట వంటి వాటితో హెచ్‌ఐవీ వైరస్‌ వ్యాపించదు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధిత ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సిన, పక్కనపెట్టాల్సిన పనిలేదు. ఇలాంటివారి పట్ల ఇతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వివక్ష చూపకూడదు.
ప్రశ్న: దోమల ద్వారా రావొచ్చా?
సమాధానం : రాదు. దోమల వంటివి శరీరంలోంచి రక్తాన్ని పీలుస్తాయే గానీ ఇతరుల నుంచి పీల్చుకున్న రక్తాన్ని లోపలికి వదలవు. కాబట్టి కీటకాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదు.
ప్రశ్న: చెవులు కుట్టించుకోవటం, పచ్చబొట్టు వంటి వాటికి వాడే పరికరాల ద్వారా హెచ్‌ఐవీ సంక్రమిస్తుందా?
సమాధానం : సూదులను సరిగా శుభ్రం చేస్తే రాదుగానీ.. వాటిని పద్ధతి ప్రకారం శుభ్రం చెయ్యటం ముఖ్యం. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ గలవారికి వాడిన సూదులను సరిగా శుభ్రం చేయకుండా చెవుల వంటివి కుట్టినా, పచ్చబొట్టు పొడిచినా ఇతరులకు రావొచ్చు.
ఒంట్లో హెచ్‌ఐవీ వైరస్‌ ప్రవేశించినా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అంతా మామూలుగానే ఉండొచ్చు. చాలా ఏళ్ల పాటుఇలాగే కొనసాగొచ్చు. కాబట్టి హెచ్‌ఐవీ సోకిందా? అన్నది తెలుసుకునేందుకు ఉన్న ఒకే ఒక మార్గం పరీక్ష చేయించుకోవటం.