దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే
డా.నరసింహారావు నేత, ప్రొఫెసర్, చర్మ, సుఖవ్యాధుల విభాగం, గాంధీ హస్పటల్ హైదరాబాద్
సుఖవ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములు ఒంట్లో ప్రవేశించినా వెంటనే లక్షణాలు కనబడాలనేం లేదు. ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ సంక్రమిస్తే 3 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. కానీ షాంక్రాయిడ్ లక్షణాలు 5-8 రోజుల్లో, సిఫిలిస్ లక్షణాలు 9 రోజుల తర్వాత మొదలవుతాయి. అదే లింఫో గ్రాన్యులోమా వెనీరియం (ఎల్‌జీవీ) లక్షణాలు బయటపడటానికి దాదాపు 3-4 వారాలు పడుతుంది. అలాగే గ్రాన్యులోమా వెనీరియం (జీవీ) లక్షణాలు 90 రోజుల తర్వాత కూడా కనబడొచ్చు. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
.
పుండు నుంచి బోద - లింఫోగ్రాన్యులోమా వెనీరియం/lymphogranuloma venereum
సంపర్కం ద్వారా సంక్రమించే చికాకు సమస్య ఇది. సంభోగం ద్వారా ‘క్లమీడియా ట్రాకోమాటిస్’ అనే బ్యాక్టీరియా ఒంట్లో చేరితే 8-21 రోజుల్లో జననాంగం మీద చిన్న పుండు కనబడుతుంది. కానీ చిత్రంగా 2-3 రోజుల్లో అదే తగ్గిపోతుంది. చాలామందికి అసలు పుండు పడినట్టే తెలియదు. కానీ పుండు మానిన 2-3 వారాల తర్వాత మళ్లీ కథ మొదలవుతుంది. గజ్జల్లో వాపు, ఎరుపు, తీవ్రమైన నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, వణుకు వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి.
చికిత్స: కచ్చితంగా గుర్తించి ఎరిత్రోమైసిన్, జెంటామైసిన్ వంటి యాంటీబయోటిక్స్ 3-4 వారాలు ఇస్తే పూర్తిగా నయమవుతుంది. భాగస్వామినీ గమనిస్తూ- వ్యాధి లక్షణాలు కనబడితే వారికీ చికిత్స ఇవ్వటం అవసరం.
నిర్లక్ష్యం చేస్తే.. గజ్జలో బిళ్ల పగిలి, చీము కారుతుంది. పుండు పడి, మచ్చ ఏర్పడుతుంది. వీరి నుంచి వ్యాధి ఇతరులకూ వ్యాపిస్తుంది. అంతే కాదు.. క్రమేపీ లింఫ్ నాళాలు మూసుకుపోతాయి. ఫలితంగా లింఫ్ ద్రవం ఎక్కడిదక్కడే నిల్చిపోయి.. వృషణాలు, అంగం బోదకాలులాగా పెద్దగా ఉబ్బిపోతాయి. మలద్వారం వద్ద వాపు, భగందరం (ఫిస్టులా), ద్వారం అక్కడక్కడ మూసుకుపోవటం (స్ట్రిక్చర్) వంటి తీవ్ర సమస్యలూ తలెత్తొచ్చు.