ఒకపక్క భాగస్వామితో రతిక్రియలో పాల్గొంటూనే.. ఆ అనుభూతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా శృంగారానికి సంబంధించి మనసులో ఏవేవో ¬హించుకుంటూ, గత భావనలను గుర్తుచేసుకుంటూ, వాటి గురించి మధనపడుతుండటం వల్ల కూడా కొన్నిసార్లు ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. లైంగిక భావనలకు, గాఢానుభూతికి శారీరక ప్రేరణల కంటే మానసిక భావోద్వేగాలూ కీలకమే. కాబట్టి సాధ్యమైనంత వరకూ వీరు శృంగార ప్రేరణనిచ్చే లైంగిక భావనల మీద దృష్టిపెట్టటం చాలా అవసరం. తన భాగస్వామిలో తనను ప్రేరేపించే అంశాల వంటివాటి మీద దృష్టి పెట్టటం, భాగస్వామిని కూడా ఇష్టమైన రీతిలో ప్రేరేపించమని కోరటం మంచిది. భాగస్వామిని తృప్తిపరుస్తున్నానా? లేదా? అన్న అంశం గురించి మరీ అతిగా మధనపడుతున్నారేమో చూసుకోవటం కూడా అవసరం. లైంగిక తృప్తి అన్నది కేవలం భాగస్వామికి ఇచ్చేదీ, ఇవ్వాల్సిందే కాదు, ఇందులో తాను పొందాల్సిందీ ఉందన్న భావన అలవరచుకోవాలి. నేరుగా సంభోగ సమయంలో అంగాంగ ప్రేరణకు పూనుకోవటం వల్ల సున్నితమైన భాగాలు మొద్దుబారి, స్పందించకుండా తయారయ్యే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ముందస్తు ముద్దుముచ్చటలకు, ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. ఎంత సమయం గడిపాం, టైమ్ ఎంత గడిచిందన్న భావనలను మనసులో నుంచి తుడిచిపెట్టెయ్యటం అవసరం.
భాగస్వామి ఇబ్బందిపడుతూ ఫిర్యాదు చేస్తే తప్పించి లేకుంటే ఆనందించటం మీదే దృష్టిపెట్టటం మంచిది. సంభోగ సమయంలో కసిగా, ఆగ్రహంగా, ఆందోళనగా, భయంగా ఉండటం మంచిది కాదు. దీనివల్ల నాడీమండల స్పందనలు కొన్ని కొరవడి, స్ఖలనం, భావప్రాప్తి జరగకుండా అడ్డుకోవచ్చు. మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండటం, ప్రశాంత చిత్తంతో ఉండటం, భాగస్వామితో కలిసిమెలిసి భావోద్వేగాలను పంచుకుంటూ ఉండటం ముఖ్యం.
కొందరికి స్ఖలనమైనా వీర్యం బయటకు రాకుండా వెనక్కి మళ్లి... మూత్రాశయంలోకి వెళ్తుంది. దీన్ని ‘రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్’ అంటారు.చూడటానికి ఇందులో పైకి అసలు స్ఖలనమే కానట్టుంటుంది. పరీక్షలు చేస్తే అసలు విషయం బయటపడుతుంది. వీరిలో వీర్యం తయారయ్యే భాగాలు సక్రమంగానే ఉంటాయి. భావప్రాప్తి బాగానే ఉంటుంది, వీర్యం స్ఖలనమైన భావన కూడా కలుగుతుంటుంది గానీ వీర్యం బయటకు రాదు. స్ఖలన సమయంలో మామూలుగా మూత్రాశయం చివ్వరి భాగం, అక్కడి స్ఫింక్టరు మూసుకుపోయి వీర్యం వెనక్కి.. మూత్రాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూంటాయి. కానీ వీరిలో అవి సరిగా పనిచేయకపోవటం మూలంగా వేగంగా బయటకు రావాల్సిన వీర్యం.. దారిమళ్లి మూత్రాశయంలోకి వెళుతుంటుంది.
మూత్రాశయం చివరి భాగానికి ఏదైనా దెబ్బతగలటం, నాడీసంబంధ సమస్యల వల్ల ఆ ప్రాంతం పట్టుకోల్పోవటం వంటి కారణాల వల్ల తలెత్తే సమస్య ఇది. సంభోగానంతరం వీరు మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు అతి తెల్లగా, మబ్బుగా అనిపిస్తుంటుంది. మధుమేహం కారణంగా నాడీమండల సమస్యలున్న వారిలో ఇది ఎక్కవగా కనబడుతుంటుంది. అలాగే వెన్నుపాము సమస్యలు, వెన్నుకు సర్జరీలు, మూత్రాశయం ప్రోస్టేటు గ్రంథి సర్జరీలు చేయించుకున్న వారిలో ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. కొన్ని రకాల మందులూ దీనికి కారణం కావచ్చు. ఇమిప్రమైన్, ఎఫిడ్రిన్, ఫినైల్‌ప్రొపనోలమైన్ వంటి మందులతో దీనికి చికిత్స చేస్తారు. వీటితో చాలామందికి సమర్థమైన ఫలితాలు లభిస్తాయి. స్ఖలనం కాకపోవటం, వీర్యం వెనక్కి పోయే సమస్యలు సంతానలేమికి దోహదం చేస్తాయి. అయితే వీర్యం వెనక్కి మళ్లే వారిలో మూత్రాశయం నుంచి వీర్యకణాలు బయటకు తీసి ఐవీఎఫ్ వంటివిధానాల ద్వారా స్త్రీయోనిలోకి ప్రవేశపెట్టటం ద్వారా పిల్లలు కలిగే అవకాశం ఉంది.
కొందరికి స్ఖలన సమయంలో నొప్పి వస్తుంటుంది. రక్తం కూడా పడుతుంది. కొన్ని రకాల వాపులు, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్లు దీనికి దోహదం చేయొచ్చు. అవన్నీ వ్యాధి సంబంధమైనవే కానీ శృంగార పరమైన స్ఖలన సమస్యలుగా భావించలేం. వీటిని గురించి వైద్యులతో చర్చించటం చాలా అవసరం.