
సుఖవ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములు ఒంట్లో ప్రవేశించినా వెంటనే లక్షణాలు కనబడాలనేం లేదు. ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ సంక్రమిస్తే 3 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. కానీ షాంక్రాయిడ్ లక్షణాలు 5-8 రోజుల్లో, సిఫిలిస్ లక్షణాలు 9 రోజుల తర్వాత మొదలవుతాయి. అదే లింఫో గ్రాన్యులోమా వెనీరియం (ఎల్‌జీవీ) లక్షణాలు బయటపడటానికి దాదాపు 3-4 వారాలు పడుతుంది. అలాగే గ్రాన్యులోమా వెనీరియం (జీవీ) లక్షణాలు 90 రోజుల తర్వాత కూడా కనబడొచ్చు. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
.
చిరకాలంగా మానవాళిని వేధిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఈ సుఖవ్యాధికి మూలం ‘ట్రెపోనెమా పాలిడమ్’ బ్యాక్టీరియా. ఇది ఒంట్లో ఉన్నవారితో సంపర్కం జరిపితే- 9 నుంచి 90 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు మొదలవ్వచ్చు. ముందు జననాంగం మీద గట్టి పుండు పడుతుంది, తాకితే రసి కారుతుంది గానీ నొప్పేం ఉండదు. ఇది సిఫిలిస్ ప్రత్యేకత. ఈ దశలో చికిత్స చేసినా చేయకపోయినా పుండు మానిపోతుంది. దీంతో సమస్య తగ్గిపోయిందనుకుంటారుగానీ.. లోపల బ్యాక్టీరియా వ్యాపిస్తూనే ఉంటుంది. అంగం మీద పుండు ఉన్నప్పుడు కలిస్తే.. సిఫిలిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పుండు మానిన తర్వాత ఇతరులకు వ్యాపించదు. కానీ వారి లోపల మాత్రం బ్యాక్టీరియా ఇతర భాగాలకు విస్తరిస్తూ, వారిని కబళిస్తుంటుంది.
.