ఇది వట్టి అపోహ. ఎందుకంటే పురుషుడు స్ఖలిస్తున్న సమయంలోనే.. శుక్రకణాలు చిక్కటి, ఓ చిన్న ముద్దలా తయారై వేగంగా బయటకొస్తాయి. స్ఖలన సమయంలో ఇదేమీ పల్చటి ద్రవంలా ఉండదు. కాబట్టి కడిగేసుకుంటే అంత తేలికగా పోయేది కాదు. పైగా యోని అనేది ఒక సొరంగ మార్గంలాగో, తూములాగో ఉండేదేం కాదు. ఒక రకంగా గరాటులా ఉంటుందనుకోవచ్చు. పురుషాంగమో, మరేదైనా లోపలికి ఒత్తిడితో నెడితేనే ఇది తెరుచుకుంటుంది. సంభోగానంతరం పురుషాంగం బయటకు తీసెయ్యగానే అది మూసుకుపోతుంటుంది. పురుషుడు స్ఖలించిన వీర్యం, అందులోని శుక్రకణాలన్నీ లోపలే ఉండిపోతాయి. వీర్యంలో శుక్రకణాలతో పాటు ఉండే ద్రవమంతా కూడా ఆ శుక్రకణాలకు కావాల్సిన పోషకాహారమే. స్ఖలనం తర్వాత పురుషుడి శరీరం నుంచి బయటపడిన శుక్రకణాలు.. ఇక అక్కడి నుంచీ స్త్రీ శరీరం నుంచి పోషకాలను గ్రహించటం మొదలుపెడతాయి. పురుషాంగం తీసెయ్యగానే యోని దగ్గరకు ముడుచుకుంటుంది, శుక్రకణాలన్నీ లోపల చిక్కుకున్నట్టుగా ఉండిపోతాయి. స్త్రీ బయటి నుంచి.. పైపైన ఎంతగా శుభ్రం చేసుకున్నా.. శుక్రకణాలుండే ఆ లోలోపలి ప్రాంతాన్ని అంత తేలికగా చేరుకోలేదు. లోపల శుక్రకణాలు లోపలే ఉండి.. అక్కడి నుంచే లోపలికే ప్రయాణం ఆరంభిస్తాయి. కాబట్టి సంభోగానంతరం స్త్రీ యోని భాగాన్ని ఎంతగా కడుక్కున్నా.. గర్భధారణ జరగదని భావించటానికి లేదు. అలాగే చాలామంది సంభోగానంతరం మూత్రవిసర్జన చేసినా గర్భం రాదనుకుంటుంటారుగానీ ఇదీ ఒట్టి అపోహే. ఎందుకంటే యోని మార్గం వేరు, మూత్రవిసర్జన ద్వారం వేరు. దీనికీ, దానికీ ఎలాంటి సంబంధం ఉండదు.