ఇది పూర్తిగా అపోహే! వీర్యమనేది శరీరం నుంచి బయటకు వెళ్లిపోవటానికే ఉత్పత్తి అవుతుంది. ఇదేమీ దాచుకోవాల్సిన ద్రవం కాదు. అలా దాచుకోవటం అసాధ్యం కూడా. ఎందుకంటే ఈ వీర్యం మూత్రాశయం వెనక చిన్న తిత్తిలా ఉండే ‘సెమినల్ వెసికల్’ గ్రంథుల్లో తయారవుతుంది. ఇది మహా అయితే 7-8 మిల్లీలీటర్లు ఉంటుంది.
శుక్రకణాలు వృషణాల్లో తయారై, అక్కడి నుంచి ఈ తిత్తిలోకి వచ్చి చేరుకుంటాయి, వాటికి కావాల్సిన పోషకాలను అందించటం ఈ ద్రవానికి ఉన్న ప్రయోజనం. ఈ ద్రవంలో ఉండేది కూడా ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు తప్పించి మరేమీ కాదు. సెమినల్ వెసికిల్స్ నుంచి శుక్రకణాలు, వీర్యం ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని సిద్ధంగా ఉంటాయి. ఈ ఫ్రక్టోజ్ ద్రవం లేకపోతే శుక్రకణాలు జీవించలేవు. ఒకవేళ 48-72 గంటలకోసారి శుక్రకణాలు బయటకు వెళ్లకపోయినా కూడా.. ఈ ద్రవంలోని ఫ్రక్టోజ్ అంతా తినేసి, అవి లోపలే చనిపోతాయి కూడా.
కాబట్టి వీర్యంలో బలం ఉంటుందనీ, అది బయటకు పోతే బలం పోతుందనే భావనలన్నీ పూర్తి అర్థరహితమైనవీ, అశాస్త్రీయమైనవే. ఒకవేళ సంభోగం, హస్తప్రయోగం వంటివేమీ జరగకపోయినా.. ‘డ్రీమ్-స్లీప్ రిఫ్లెక్స్’ రూపంలో నిద్రా సమయంలోనే వీర్యం దానంతట అదే బయటకు పోతుంది. కాబట్టి హస్తప్రయోగం వల్ల ఏదో బలహీనపడిపోతామని భావించటం శుద్ధ తప్పు. పైగా హస్తప్రయోగం వల్ల పురుషుడిలో- తనలో అంతా సవ్యంగానే ఉంది, ఎటువంటి లోపం లేదన్న భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కూడా.