header

Batukamma Panduga…బతుకమ్మ పండుగ

Batukamma Panduga…బతుకమ్మ పండుగ

బతుకమ్మలో దైవత్వం కంటే మానవత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. సామాన్యమైన పూలు తంగేడు, గునుగు, కట్ల, బంతిపూలతో బతుకమ్మను చేస్తారు. బతుకమ్మ గురించి పురాణాల్లో ప్రస్తావన లేదు. పల్లెజనం జానపదాలతో గుండెల్లో ప్రతిష్టించుకున్నారు. బతుకమ్మ పండుగకు కులబేధాలు లేవు. అందరూ చేయీ చేయీ కలిపి ఆడతారు పాడతారు.
మహాలయ అమావాశ్య నుంచి సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులూ సందడే సందడి. తెలంగాణా ఆడపడుచులకు బతుకమ్మ పండగకు రావాలె బిడ్డా! అన్న పిలుపు పుట్టింటి నుండి వస్తుంది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళతో అనుబంధాలు, చిన్ననాటి నేస్తాలతో కబుర్లు. ఆనందంగా బతుకమ్మ ఆడతారు. బతుకమ్మకు మంత్రాలుండవు..కలిసి పాడుకునే పాటే మంత్రం! బతుకమ్మకు గుడులుండవు... నలుగురు గుమిగూడిన చోటే గుడి. బతుకమ్మ ఆటకు నిబంధనలు ఏమీ లేవు. నాలుగు చేతులు కలిస్తే ఆట..జనజీవన సౌందర్యమే బతుకమ్మ! బతుకమ్మను అంకరించడం ఒక కళ. .
రోజుకోరకంగా పూలతో బతుకమ్మను తయారుచేస్తారు. ముక్కాలిపీట మీద తంబాలం లాంటిది పెట్టి..అందులో బీర, గుమ్మడి ఆకులు పరచి పూలను శిఖరంలా పేరుస్తారు. శిఖరం మీద ధగధగ మెరిసే పువ్వులను కొసమెరుపుగా ఉంచుతారు. పెద్ద బతుకమ్మకు తోడుగా చిన్న బతుకమ్మ. పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తారు. .
సాయంత్రం పట్టుచీరతో ముస్తాబై బతుకమ్మను ఎత్తుకుంటారు. గుడి ఆవరణలోనో వీధి కూడలిలోనో పెట్టి గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలందుకుంటారు. మొదటిరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ. రెండోరోజు అటుకుల బతుకమ్మ. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఐదోరోజు అట్ల బతుకమ్మ. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. ఏడోరోజు వేపకాయ బతుకమ్మ ఏనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ. చివరి రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మకు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోరా, నిమ్మకాయ పులిహోరా, కొబ్బరి తురుము సద్ది, నువ్వుల పొడి కలిపిన సద్ది.. ఇలా రకరకా సద్దులు చేస్తారు. చీకటి పడ్డాక చెరువుగట్టు కెళ్ళి...బతుకమ్మను నీళ్లలో వదిలేస్తారు. బతుకమ్మను తీర్చిదిద్ది తంబాలంలో పప్పు, ఫలహారాలు పోసి వాయనాలు ఇచ్చుకుంటారు. .
బతుకమ్మ కథ: ఓ ముద్దు చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరులే. అందరికీ వివాహాలు జరిగాయి. అన్నలకు చెల్లెలు మీద అపారమైన ప్రేమ. కానీ వదినలకు మాత్రం అసూయ. ఆ బంగారుబొమ్మను బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్ళిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. .
ఇదే సమయం అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ తరువాత అన్నలు వచ్చి చెల్లెలు గురించి అడుగుతారు. వారికి విషయం అర్థమైంది. చెల్లికోసం వెతకని ప్రదేశం లేదు. నిద్ర, ఆహారం లేదు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటుండగా పెద్ద తామరపువ్వు ఒకటి నీళ్లలో తేలుతూ వారి దగ్గరకు వస్తుంది. ఆ పువ్వునే చెల్లెలుగా భావిస్తారు ఆ అన్నదమ్ములు. .
ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఆ తామరపువ్వును తనతో తీసుకువెళ్ళి కొనులో వేస్తాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. ఆ తరువాత విష్ణుమూర్తి తామరను స్త్రీగా చేసి లక్ష్మీ అవతారమని ప్రకటిస్తాడు. పువ్వుకు బతుకుదెరువు చూపింది కాబట్టి ఆ నాటినుండి బతుకమ్మ అయింది. తెలంగాణాలో ప్రచారంలో ఉన్న జానపద కథ ఇది.
ఇంకొక కథనం ప్రకారం... మహిషాసురుని చంపిన అలసి సొలసి మూర్చపోయిన దుర్గమ్మకు మహిళలంతా కలిసి ఆటపాటలతో సృహ తెప్పించే ప్రయత్నమని చెబుతారు. .
గుమ్మడిపూలు పూయగ బ్రతుకు .
తంగేడు పసిడి చిందగ బ్రతుకు.
కట్ల నీలిమలు చిమ్మగ. బ్రతుకు .
బతకమ్మా బ్రతుకు! .
- ---- కాళోజి నారాయణరావు. .
2014 సంలో బతుకమ్మ పండుగను మరియు బోనాల జాతరను రాష్ట్ర పండుగలుగా తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది.